Share News

India vs England: తొలిరోజు మనదే

ABN , Publish Date - Jul 24 , 2025 | 04:29 AM

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ తొలిరోజును భారత్‌ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది.

India vs England: తొలిరోజు మనదే

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌

  • సుదర్శన్‌, జైస్వాల్‌ అర్ధ శతకాలు

  • టీమిండియా 264/4

మాంచెస్టర్‌: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌ తొలిరోజును భారత్‌ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది. జట్టులో తనకు తిరిగి లభించిన అవకాశాన్ని సాయి సుదర్శన్‌ (61) తొలి అర్ధ శతకంతో సద్వినియోగం చేసుకోగా.. యశస్వి జైస్వాల్‌ (58) రాణించాడు. జడేజా (19), శార్దూల్‌ ఠాకూర్‌ (19) క్రీజులో ఉన్నారు. రాహుల్‌ (46) శుభారంభాన్ని చేజార్చుకోగా.. రిషభ్‌ పంత్‌ (37 రిటైర్డ్‌ హర్ట్‌) గాయం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. స్టోక్స్‌ 2 వికెట్లు తీశాడు. టీమిండియా తరఫున పేసర్‌ అన్షుల్‌ కాంబోజ్‌ అరంగేట్రం చేయగా.. కరుణ్‌ నాయర్‌, నితీశ్‌ స్థానాల్లో సుదర్శన్‌, శార్దూల్‌ జట్టులోకొచ్చారు.


జైస్వాల్‌, రాహుల్‌ ఓర్పుగా..: ఓల్ట్‌ ట్రాఫోర్డ్‌లో టాస్‌ గెలిచి ప్రత్యర్థికి బ్యాటింగ్‌ అప్పగించిన జట్టు ఇంతవరకు మ్యాచ్‌ గెలిచింది లేదు. కానీ, ఆకాశం మేఘావృతమై ఉండడంతో.. ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకొన్నాడు. అయితే, ఓపెనర్లు జైస్వాల్‌, రాహుల్‌ ఓర్పుగా ఆడుతూ.. భారత్‌కు చక్కని ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా జైస్వాల్‌ ఎంతో క్రమశిక్షణతో బ్యాటింగ్‌ చేశాడు. మరో ఎండ్‌లో మాత్రం రాహుల్‌ తనదైన శైలిలో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించడంతో.. భారత్‌ 78/0తో లంచ్‌కు వెళ్లింది.

దెబ్బకొట్టిన ఇంగ్లండ్‌: రెండో సెషన్‌లో భారత్‌ 71 రన్స్‌ చేసినా 3 కీలక వికెట్లు చేజార్చుకొంది. నిలకడగా ఆడుతున్న రాహుల్‌, జైస్వాల్‌తోపాటు గిల్‌ను అవుట్‌ చేసి ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. ఫిఫ్టీకి చేరువవుతున్న రాహుల్‌ను వోక్స్‌ క్యాచవుట్‌ చేయడంతో.. తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. బౌండ్రీలతో వేగంగా ఆడే ప్రయత్నం చేస్తున్న జైస్వాల్‌.. సింగిల్‌తో ఫిఫ్టీ మార్క్‌ను అందుకొన్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన స్పిన్నర్‌ డాసన్‌ బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడే క్రమంలో ఫస్ట్‌ స్లిప్‌లో ఉన్న బ్రూక్‌కు జైస్వాల్‌ క్యాచిచ్చాడు. కెప్టెన్‌ గిల్‌ (12)ను స్టోక్స్‌ ఎల్బీ చేశాడు. కానీ, వన్‌డౌన్‌ బ్యాటర్‌ సుదర్శన్‌, పంత్‌ రక్షణాత్మకంగా ఆడడంతో భారత్‌ 149/3తో టీ బ్రేక్‌కు వెళ్లింది.


ఆఖరి సెషన్‌లో 115/1: సుదర్శన్‌, పంత్‌ ఎదురుదాడితో.. మూడో సెషన్‌లో భారత్‌ 115 పరుగులు రాబట్టింది. క్రీజులో కుదురుకున్నాక సాయి సుదర్శన్‌ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదాడు. క్రమంగా పంత్‌ తన సహజశైలిలో షాట్లు ఆడుతూ ఇంగ్లండ్‌ బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. 61వ ఓవర్‌లో కార్స్‌ బౌలింగ్‌లో ఫ్రంట్‌ ఫుట్‌పై సిక్స్‌తో వావ్‌ అనిపించాడు. ఈ క్రమంలో జట్టు స్కోరు కూడా డబుల్‌ సెంచరీ మార్క్‌ దాటింది. అయితే, 72 పరుగుల భాగస్వామ్యంతో వీరిద్దరు జట్టును బలమైన స్థితికి చేర్చేలా కనిపించారు. కానీ, పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరగ్గా.. జడేజా క్రీజులోకి వచ్చాడు. మరోవైపు ఫోర్‌తో కెరీర్‌లో తొలి అర్ధ శతకం నమోదు చేసిన సాయిని స్టోక్స్‌ వెనక్కిపంపాడు. జడేజా, శార్దూల్‌ మరో వికెట్‌ కోల్పోకుండా రోజును ముగించారు.

1. గత 35 ఏళ్లలో ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో అరంగేట్రం చేసిన తొలి భారత క్రికెటర్‌గా అన్షుల్‌ కాంబోజ్‌. 1990లో అనిల్‌ కుంబ్లే తన తొలి టెస్ట్‌ ఇక్కడే ఆడాడు.

14. అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా టాస్‌ ఓడడం ఇది 14వసారి.


పంత్‌కు గాయం

68వ ఓవర్‌లో వోక్స్‌ యార్కర్‌ను రివర్స్‌స్వీప్‌ ఆడే క్రమంలో పంత్‌ కుడికాలికి బంతి బలంగా తగిలింది. దీంతో నొప్పితో అతడు విలవిల్లాడాడు. కాలు వాయడంతో పాటు రక్తం రావడంతో పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌గా మైదానం వీడాడు.

ఇంజనీర్‌, లాయిడ్‌ పేరిట స్టాండ్‌

భారత మాజీ ఆటగాడు ఫరూక్‌ ఇంజనీర్‌ (87), వెస్టిండీస్‌ లెజెండ్‌ క్లైవ్‌ లాయిడ్‌ (80) అరుదైన గౌరవం దక్కింది. ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ స్టేడియంలోని ఓ స్టాండ్‌కు వీరిద్దరి పేర్లు పెట్టారు. బి-స్టాండ్‌కు సర్‌ క్లైవ్‌ లాయిడ్‌ అండ్‌ ఫరూక్‌ ఇంజనీర్‌ స్టాండ్‌గా నామకరణం చేశారు. టాస్‌కు ముందు స్టాండ్‌ ఆవిష్కరణ కార్యక్రమం జరగ్గా.. ఇంజనీర్‌, లాయిడ్‌ హాజరయ్యారు. ఇంగ్లండ్‌లో స్టాండ్‌కు ఓ భారత ఆటగాడి పేరు పెట్టడం ఇదే తొలిసారి.


స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58, రాహుల్‌ (సి) క్రాలే (బి) వోక్స్‌ 46, సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61, గిల్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 12, పంత్‌ (రిటైర్డ్‌ హర్ట్‌) 37, జడేజా (బ్యాటింగ్‌) 19, శార్దూల్‌ (బ్యాటింగ్‌) 19; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 83 ఓవర్లలో 264/4; వికెట్ల పతనం: 1-94, 2-120, 3-140, 3-212 (పంత్‌ రిటైర్డ్‌ హర్ట్‌), 4-235; బౌలింగ్‌: వోక్స్‌ 17-4-43-1, ఆర్చర్‌ 16-2-44-0, కార్స్‌ 16-1-60-0, స్టోక్స్‌ 14-2-47-2, డాసన్‌ 15-1-45-1, రూట్‌ 5-0-19-0.

Updated Date - Jul 24 , 2025 | 04:29 AM