Ind vs Eng: శుభ్‌మన్ గిల్ అద్భుత రికార్డు.. ఐదో టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి..
ABN , Publish Date - Jul 31 , 2025 | 07:28 PM
తాజా సిరీస్‌లో ఒక్కసారి కూడా టాస్ గెలవని సాంప్రదాయాన్ని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగించాడు. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

లండన్‌లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు (Ind vs Eng). ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓవల్ మైదానంలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తేనే 2-2తో టీమిండియా సిరీస్‌ను డ్రా చేయగలుగుతుంది. ఈ సిరీస్‌లో ఒక్కసారి కూడా టాస్ గెలవని సాంప్రదాయాన్ని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కొనసాగించాడు. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (2) మరోసారి నిరాశపరిచాడు. ఆట్కిన్సన్ వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి అవుటయ్యాడు. అనంతరం క్రిస్ వోక్స్ మరో షాకిచ్చాడు. ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్ (14)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (15 నాటౌట్), సాయి సుదర్శన్ (25 నాటౌట్) మరో వికెట్ పడకుండా అడ్డుకున్నారు. లంచ్ సమయానికి 72/2తో టీమిండియా నిలిచింది. లంచ్ బ్రేక్ సమయంలో వర్షం మొదలు కావడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కాలేదు.
ప్రస్తుతం వర్షం తగ్గుముఖం పట్టడంతో సిబ్బంది మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం 7:30 గంటలకు మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా, టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్ 1979లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 732 పరుగులు చేశాడు. తాజా సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ (737*) పరుగులు చేసి గవాస్కర్‌ను దాటేశాడు.
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..