England Dominates: పట్టు బిగించారు
ABN , Publish Date - Jul 26 , 2025 | 02:07 AM
నాలుగో టెస్టులో వరుసగా మూడో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం సాగింది...

186 పరుగుల ఆధిక్యంలో ఇంగ్లండ్ జూ తొలి ఇన్నింగ్స్ 544/7
జో రూట్ శతకం
స్టోక్స్, పోప్ హాఫ్ సెంచరీలు
భారత్‌తో నాలుగో టెస్టు
మాంచెస్టర్: నాలుగో టెస్టులో వరుసగా మూడో రోజూ ఇంగ్లండ్‌దే ఆధిపత్యం సాగింది. వరల్డ్ నెంబర్‌వన్ జో రూట్ (150) మరోసారి తన అత్యుత్తమ ఆటతీరుతో అదరగొట్టాడు. అతడికి జతగా కెప్టెన్ బెన్ స్టోక్స్ (77 బ్యాటింగ్), పోప్ (71) అర్ధసెంచరీలతో రాణించగా, ప్రస్తుతం ఆతిథ్య జట్టు 186 పరుగుల భారీ ఆధిక్యంతో దూసుకెళుతోంది. భారత బౌలర్లు ఎప్పటిలాగే నిరాశపర్చడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 135 ఓవర్లలో 544/7 స్కోరుతో నిలిచింది. క్రీజులో స్టోక్స్‌తో పాటు డాసన్ (21 బ్యాటింగ్) ఉన్నాడు. ఇద్దరూ బ్యాటర్లే కావడంతో నాలుగో రోజు వీలైనంత వేగంగా ఆడి తమ ఆధిక్యాన్ని పెంచాలనే భావనలో ఉన్నారు. జడేజా, సుందర్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.
వికెట్ కోల్పోకుండా..: 225/2 ఓవర్‌నైట్ స్కోరుతో ఇంగ్లండ్ మూడో రోజు ఆటను ఆరంభించగా.. రూట్, పోప్ తొలి సెషన్‌లో పూర్తి ఆధిపత్యం చూపారు. భారత బౌలర్లు ఈ జోడీని విడదీయడంలో విఫలమయ్యారు. పసలేని బౌలింగ్‌తో నిరాశపర్చారు. దీంతో ఇద్దరు బ్యాటర్లు తమ అర్ధసెంచరీలను పూర్తి చేసుకున్నారు. బుమ్రా సైతం ఎలాంటి ప్రభావం చూపకపోగా.. అతడి ఓవర్లలో సులువుగా పరుగులు రాబట్టారు. పోప్ 48 రన్స్ దగ్గర ఉన్నప్పుడు అన్షుల్ ఓవర్‌లో ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను కీపర్ జురెల్ అందుకోలేకపోయాడు. మొత్తంగా ఈ సెషన్‌లో 107 పరుగులు రాబట్టిన ఇంగ్లండ్ లంచ్ విరామానికి వెళ్లింది.
రూట్ శతకం: వికెట్ కోసం నిరీక్షిస్తున్న భారత్‌కు సెషన్ ఆరంభంలోనే ఆ అవకాశం దక్కింది. పాత బంతితో స్పిన్నర్ సుందర్ చక్కటి టర్న్ రాబట్టి ముందుగా పోప్‌ను అవుట్ చేశాడు. దీంతో మూడో వికెట్‌కు 144 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే హ్యారీ బ్రూక్ (3) సుందర్ ఓవర్‌లో ముందుకు వచ్చి స్టంపౌట్ కావడంతో భారత్ పైచేయి సాధించినట్టు కనిపించింది. ఈ దశలో గిల్ కొత్త బంతి తీసుకోకుండా స్పిన్నర్లతోనే ఓవర్లు వేయించాడు. కానీ రూట్‌తో జత కట్టిన కెప్టెన్ స్టోక్స్ భారత్ సంబరాలకు చెక్ పెట్టాడు. ఓవైపు అన్షుల్ ఓవర్‌లో ఫోర్‌తో రూట్ శతకం పూర్తి చేశాడు. అటు 91వ ఓవర్ మధ్యలో రెండో కొత్త బంతిని తీసుకున్నా పేసర్లు ఎలాంటి ఒత్తిడి తేలేకపోయారు. సెషన్‌లో 101 పరుగులు సాధించిన ఇంగ్లండ్ జట్టు.. ఇన్నింగ్స్ 100వ ఓవర్‌లోనే స్కోరును 400 దాటించింది. ఇక డ్రింక్స్ విరామంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన బుమ్రా ఐదు ఓవర్ల తర్వాత మైదానంలోకి వచ్చాడు. అయితే తను మెట్ల మీద నుంచి జారి పడినందుకే సమయం తీసుకున్నాడని వ్యాఖ్యాత నాసిర్ హుసేన్ తెలిపాడు.
చివర్లో ఊరట: ఆఖరి సెషన్ చివర్లో భారత బౌలర్లు మూడు వికెట్లు తీయగలిగారు. కానీ ఆరంభంలో రూట్, స్టోక్స్ అవలీలగా బంతులను ఎదుర్కొంటూ అడపాదడపా ఫోర్లతో తమ ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు. ఈక్రమంలో స్టోక్స్ 15 ఇన్నింగ్స్ తర్వాత భారత్‌పై అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొడ కండరాలు పట్టేయడంతో 116వ ఓవర్ ముగిశాక తను రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి రూట్‌తో కలిసి ఐదో వికెట్‌కు 142 పరుగలు జత చేయడం విశేషం. అలాగే డ్రింక్స్ తర్వాత భారత్‌కు కాస్త కలిసివచ్చింది. క్రీజులో పాతుకుపోయిన రూట్‌ను జడేజా అవుట్ చేయగా.. స్వల్ప వ్యవధిలో స్మిత్ (9)ను బుమ్రా, వోక్స్ (4)ను సిరాజ్ వెనక్కిపంపారు. ఈ దశలో స్టోక్స్ తిరిగి బ్యాటింగ్‌కు రాగా, డాసన్‌తో కలిసి వికెట్ కోల్పోకుండా రోజును ముగించాడు.
ఇవి కూడా చదవండి
వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News