Share News

Delhi Capitals Victory: ఢిల్లీ సిక్సర్‌

ABN , Publish Date - Apr 23 , 2025 | 01:54 AM

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ లఖ్‌నవూపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాహుల్‌, పోరెల్‌ అర్ధసెంచరీలు, ముకేశ్‌ నాలుగు వికెట్లు తీసి హీరోలుగా నిలిచారు

Delhi Capitals Victory: ఢిల్లీ సిక్సర్‌

  • లఖ్‌నవూపై ఘన విజయం

  • రాహుల్‌, పోరెల్‌ అర్ధసెంచరీలు

  • పేసర్‌ ముకేశ్‌కు నాలుగు వికెట్లు

ఐపీఎల్‌లో వేగంగా (130 ఇన్నింగ్స్‌) 5వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా రాహుల్‌. వార్నర్‌ (135)ను అధిగమించాడు.

లఖ్‌నవూ: తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడ కొనసాగుతోంది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఆరో విజయంతో పట్టికలో గుజరాత్‌తో పోటీపడుతోంది. ఇక తన పాత జట్టుపై కేఎల్‌ రాహుల్‌ (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 నాటౌట్‌) అజేయ అర్ధసెంచరీతో చెలరేగాడు. అంతకుముందు బౌలింగ్‌లో ఢిల్లీ పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ (4/33) అద్భుత ప్రదర్శనతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ ఏమాత్రం కుదురుకోలేకపోయింది. ఫలితంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ముందుగా లఖ్‌నవూ 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు చేసింది. మార్‌క్రమ్‌ (33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 52), మిచెల్‌ మార్ష్‌ (36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 45), ఆయుష్‌ బదోని (21 బంతుల్లో 6 ఫోర్లతో 36) ఆకట్టుకున్నారు. ఛేదనలో ఢిల్లీ 17.5 ఓవర్లలో 161/2 స్కోరు చేసి గెలిచింది. అభిషేక్‌ పోరెల్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 51), కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ (20 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్సర్లతో 34 నాటౌట్‌) రాణించారు. మార్‌క్రమ్‌కు 2 వికెట్లు దక్కాయి. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ముకేశ్‌ నిలిచాడు.


రాహుల్‌, పోరెల్‌ దూకుడు: ఛేదనను ఢిల్లీ ధాటిగా ఆరంభించింది. ప్రతీ బ్యాటర్‌ మెరుగ్గా ఆడడంతో లఖ్‌నవూ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. ఆరంభం నుంచే ఓపెనర్లు అభిషేక్‌ పోరెల్‌, కరుణ్‌ నాయర్‌ (15) బౌండరీలపైనే దృష్టి సారించారు. తొలి ఓవర్‌లోనే కరుణ్‌ రెండు ఫోర్లు, పోరెల్‌ ఫోర్‌తో 15 రన్స్‌ సమకూరాయి. అయితే నాలుగో ఓవర్‌లో సిక్సర్‌ సాధించిన కరుణ్‌ను మార్‌క్రమ్‌ బౌల్డ్‌ చేశాడు. దీంతో తొలి వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత పోరెల్‌కు రాహుల్‌ కలవడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ సాఫీగా సాగింది. ఆరో ఓవర్‌లో చెరో ఫోర్‌తో పవర్‌ప్లేను జట్టు 54/1తో ముగించింది. ఆ తర్వాత పిచ్‌ నెమ్మదించడంతో 7-9 ఓవర్ల మధ్య బౌండరీ రాలేదు. ఈ జోడీ కూడా షాట్లకు వెళ్లలేదు. చివరకు పదో ఓవర్‌లో పోరెల్‌ ఫోర్‌తో స్కోరు ముందుకు కదిలింది. తర్వాతి ఓవర్‌లోనే చెరో సిక్సర్‌ బాదడంతో 16 రన్స్‌ వచ్చాయి. అలాగే పోరెల్‌ 33 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేశాడు. అయితే మార్‌క్రమ్‌ మరోసారి లఖ్‌నవూకు రిలీఫ్‌నిస్తూ పోరెల్‌ వికెట్‌ తీశాడు. అప్పటికే రెండో వికెట్‌కు 69 పరుగులు జత చేరాయి. అక్షర్‌ రాగానే ధాటిని ప్రదర్శించాడు. బిష్ణోయ్‌ ఓవర్‌లో అక్షర్‌ రెండు సిక్సర్లతో జట్టు చకచకా లక్ష్యం వైపు సాగింది. 16వ ఓవర్‌లో శార్దూల్‌ 14 రన్స్‌ ఇవ్వడంతో సమీకరణం 24 బంతుల్లో 19కి మారింది. ఇద్దరూ మరింత జోరు చూపడంతో 13 బంతులుండగానే మ్యాచ్‌ ముగిసింది. అలాగే రాహుల్‌ 40 బంతుల్లో ఫిఫ్టీని కూడా పూర్తి చేసుకున్నాడు.


శుభారంభం దక్కినా..:టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు మార్‌క్రమ్‌, మిచెల్‌ మార్ష్‌ ఆడిన తీరుకు మిగతా బ్యాటర్లకు సంబంధం లేకుండా పోయింది. ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు లఖ్‌నవూ భారీ స్కోరు చేసేలా కనిపించింది. పది ఓవర్ల పాటు ఢిల్లీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చెత్త బంతులను బౌండరీలుగా మల్చడంతో తొమ్మిది పరుగుల రన్‌రేట్‌తో స్కోరు సాగింది. కానీ మధ్య ఓవర్లలో పేసర్ల ధాటికి టపటపా వికెట్లు కోల్పోవడం జట్టును దెబ్బతీసింది. కెప్టెన్‌ పంత్‌ (0) చేతికి గాయం కావడంతో ఏడో నెంబర్‌లో బరిలోకి దిగాడు. ఆరంభంలో మార్‌క్రమ్‌ వేగం చూపాడు. అతను నాలుగో ఓవర్‌లో 4,6 బాదగా, మార్ష్‌ ఆరో ఓవర్‌లో సిక్సర్‌తో పవర్‌ప్లేలో జట్టు 51 పరుగులతో మెరుగ్గా కనిపించింది. విప్రజ్‌ ఓవర్‌లో సిక్సర్‌ సాధించిన మార్‌క్రమ్‌ 30 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. చివరి ఆరు ఇన్నింగ్స్‌లో అతడికిది నాలుగో ఫిఫ్టీ కావడం విశేషం. కానీ పదో ఓవర్‌లో మార్‌క్రమ్‌ను పేసర్‌ చమీర అవుట్‌ చేయడంతో తొలి వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక్కడి నుంచి లఖ్‌నవూ అనూహ్యంగా తడబడింది. రెండు వరుస ఫోర్లతో జోరు మీదున్న నికోలస్‌ పూరన్‌ (9) కోసం పేసర్‌ స్టార్క్‌కు బంతినివ్వడం ఫలితాన్నిచ్చింది. వరుసగా ఐదో ఇన్నింగ్స్‌లోనూ పూరన్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయగలిగాడు. 14వ ఓవర్‌లో సమద్‌ (2), మార్ష్‌ (45)లను వెనక్కి పంపి ముకేశ్‌ ప్రత్యర్థికి గట్టి ఝలకిచ్చాడు. 12 పరుగుల వ్యవధిలోనే ముగ్గురు అవుటవడంతో మిల్లర్‌ (14 నాటౌట్‌), బదోని జాగ్రత్త కనబర్చారు. ముకేశ్‌ ఓవర్‌లోనే బదోని సులువైన క్యాచ్‌ను స్టబ్స్‌ అందుకోలేకపోయాడు. చివరి ఓవర్‌లో బదోని హ్యాట్రిక్‌ ఫోర్లతో ఆకట్టుకున్నా, అతడితో పాటు పంత్‌ను ముకేశ్‌ అవుట్‌ చేశాడు. ఆఖరి పది ఓవర్లలో 72 పరుగులే చేయడంతో లఖ్‌నవూ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.

Updated Date - Apr 23 , 2025 | 01:59 AM