Cricket: మనమ్మాయిలు.. క్రికెట్ మహారాణులు
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:09 AM
అమ్మాయిలకు ఆటలెందుకు..? అబ్బాయిలతో ఆటలేంటి..? బ్యాటు, బంతి ఆటలో వీళ్లు నెగ్గుతారా..? అసలు వీళ్లు ఆడితే ఎవరు చూస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, అవమానాలు, అవరోధాలు. కానీ, వాళ్లు ఎక్కడా కుంగిపోలేదు.. ఆగిపోలేదు. పట్టు వదలకుండా పోరాడారు.. లక్ష్యమే ధ్యేయంగా అడుగులేశారు.
అమ్మాయిలకు ఆటలెందుకు..? అబ్బాయిలతో ఆటలేంటి..? బ్యాటు, బంతి ఆటలో వీళ్లు నెగ్గుతారా..? అసలు వీళ్లు ఆడితే ఎవరు చూస్తారు..? ఇలా ఎన్నో ప్రశ్నలు, సందేహాలు, అవమానాలు, అవరోధాలు. కానీ, వాళ్లు ఎక్కడా కుంగిపోలేదు.. ఆగిపోలేదు. పట్టు వదలకుండా పోరాడారు.. లక్ష్యమే ధ్యేయంగా అడుగులేశారు. కుటుంబం అండదండలు, అభిమానుల ఆకాంక్షలు, అపార నైపుణ్యాలే ఆయుధంగా క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టిన ఆ అతివలు.. అద్భుతం చేశారు. విశ్వ విజేతలుగా అవతరించి చరిత్రను తిరగరాశారు. వన్డే ప్రపంచ కప్ విజయంతో.. సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్‌లే కాదు తాము కూడా క్రికెట్ స్టార్లమే అని వేన్నోళ్ల కీర్తించేలా చేశారు. క్రికెట్ కేవలం ‘జెంటిల్మన్ గేమ్’ కాదు ‘ఇది అందరి ఆట’ అని ఎలుగెత్తి నినదించారు. అందుకే.. మన క్రికెట్ మహిళలు.. మహారాణులు..
1983 పురుషుల వన్డే ప్రపంచకప్ ఫైనల్... ఏమాత్రం అంచనాలు లేని భారత జట్టు అరివీర భయంకర ఆటగాళ్లున్న వెస్టిండీస్‌ను ఓడించి సంచలనం సృష్టించింది. కపిల్‌దేవ్ సారథ్యంలోని టీమిండియా విశ్వవిజేతగా నిలవడంతో అప్పుడు జట్టులోని ప్రతి ఆటగాడికి కనీసం రూ. 30 లక్షల నగదు బహుమతులు లభించాయి. ఆ చారిత్రాత్మక విజయంతో మన ఆటగాళ్లు సినిమా స్టార్లను మించి ఆరాధ్య దేవుళ్లయ్యారు. భారత పురుషుల క్రికెట్ దశ ఒక్కసారిగా మారిపోయింది.

2005 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్.... మిథాలీ రాజ్ సారథ్యంలోని భారత జట్టు తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఇదే మిథాలీ కెప్టెన్సీలోని భారత మహిళల జట్టు 12 ఏళ్ల అనంతరం 2017లో ప్రపంచకప్‌లో ఫైనల్ చేరినా, ఈసారి ఇంగ్లండ్ చేతిలో ఓడి మరోసారి కప్పుకు అడుగుదూరంలో నిలిచిపోయింది. కానీ, అప్పుడు భారత మహిళల ప్రతిభకు దక్కిన ప్రోత్సాహం మ్యాచ్‌కు వేయి రూపాయలు మాత్రమే. కప్పు అందుకోకపోయినా, రెండు పర్యాయాలు విశ్వకప్పులో ఫైనల్‌కు చేరడం మహిళల జట్టు గొప్ప ప్రదర్శనకు నిదర్శనం. అయినా, పురుషులకు దక్కిన గుర్తింపులో కనీసం ఒక్కశాతం కూడా భారత మహిళా క్రికెట్‌కు లభించలేదు.

2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్.... దక్షిణాఫ్రికాను చిత్తుచేసి భారత జట్టు విజేతగా నిలిచింది. టోర్నీ ప్రైజ్‌మనీ రూ. 39 కోట్లతో పాటు ప్రోత్సాహకంగా భారత క్రికెట్ బోర్డు నుంచి రూ. 51 కోట్లు హర్మన్‌ప్రీత్ బృందం అందుకుంది. వీటితో పాటు జట్టు క్రికెటర్లకు తమ తమ రాష్ట్రాల నుంచి కోట్లాది రూపాయల నజరానాలు. కొందరు వ్యాపారుల నుంచి డైమండ్ నెక్లెస్‌ల బహుమానాలు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సమావేశాలు. గతంలో మహిళల వరల్డ్‌కప్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం కల్పించినా చూడని రోజులు. కానీ, ఇప్పుడు ముంబైలో జరిగిన తుది పోరుకు స్టేడియం మొత్తం ఫుల్. ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల కోసం రెండురోజుల ముందు నుంచే అభిమానులు స్టేడియం దగ్గర పడిగాపులు పడ్డారు. ఆన్‌లైన్‌లో వెతికినా టిక్కెట్లు దొరకని పరిస్థితి. ఒకప్పటికి, ఇప్పటికి మహిళా క్రికెటర్లకు ఉన్న ఆదరణ, వాళ్ల ఆటకున్న క్రేజ్ ఎంతలా మారిపోయిందో చెప్పేందుకు ఇదే నిదర్శనం. కానీ, ఈ మార్పు రావడానికి సుదీర్ఘ కాలమే పట్టింది.

అప్పుడేదీ ఆదరణ..?
పురుషులతో సమంగా మహిళలు ఎప్పటినుంచో క్రికెట్ ఆడుతున్నా వారికి సరైన ఆదరణ దక్కలేదనే చెప్పాలి. 1976లోనే వెస్టిండీస్‌తో భారత మహిళల జట్టు తొలి టెస్టు మ్యాచ్ ఆడింది. అప్పట్లోనే పురుషుల టెస్టులను ఐదురోజుల పాటు ఆడితే, మహిళలకు మాత్రం నాలుగు రోజులే కేటాయించారు. స్టేడియాల్లోనూ పురుషుల కంటే మహిళల మ్యాచ్‌లకు బౌండరీ స్థలాన్ని కుదించి ఆడించడం లాంటివి చేసేవారు. క్రీడల్లో మగవాళ్లకంటే ఆడవాళ్లు బలహీనులు అని చెప్పకనే చెప్పేలా ఇలాంటి నియమాలను విధించేవాళ్లని అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. వసతుల పరంగానూ మహిళా క్రికెటర్ల పట్ల వివక్ష చూపేవారు.
భారత్‌లో పురుష క్రికెటర్లకు బిజినెస్ క్లాసుల్లో ప్రయాణాలు ఉంటే.. మహిళలు మాత్రం రైళ్లలో జనరల్ బోగీల్లో వెళ్లేవారు. యాభై ఏళ్ల క్రితం విదేశాల్లో టోర్నమెంట్లలో ఆడాలంటే మహిళలకు స్పాన్సర్లు ఉండేవారు కాదు. న్యూజిలాండ్ లాంటి దేశాల్లో మ్యాచ్‌లు ఆడేందుకు వెళితే ఎన్‌ఆర్‌ఐల ఇళ్లలో ఉండేవాళ్లు. జట్టు వద్ద మొత్తం మూడు బ్యాట్లే ఉండేవి. ఓపెనర్లు ఇద్దరికి రెండు బ్యాట్లు, వన్‌డౌన్ ప్లేయర్ దగ్గర మరో బ్యాట్. ఎవరైనా అవుటై వస్తే, ఆ బ్యాట్ తీసుకొని క్రీజులోకి వెళ్లేందుకు మరో బ్యాటర్ సిద్ధంగా ఉండేవాళ్లు. వ్యక్తిగత కిట్లు కొనుగోలు చేసేందుకు కూడా డబ్బులు ఉండేవి కావు.

దేశంలో జరిగే మ్యాచ్‌లకు రైళ్లలో ప్రయాణించే సమయంలో టిక్కెట్లకు సొంత డబ్బులు పెట్టుకునేవాళ్లు. డార్మిటరీల్లో ఉంటూ నాలుగు వాష్‌రూమ్‌లను 20 మంది క్రీడాకారిణులు వాడుకునేవారు. స్థానికంగా ఉండే కొన్ని సంఘాల వాళ్లే పప్పన్నం వండి పెట్టేవాళ్లు. ఓసారి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చినప్పుడు సినీనటి, క్రికెట్ కామెంటేటర్ మందిరా బేడి మహిళా క్రికెటర్లకు విమాన టిక్కెట్లు కొనుగోలు చేశారు. ఇలాంటివి ఎన్నో కష్టాలు చవిచూశామని భారత మాజీ క్రికెటర్లు డయానా ఎడుల్జీ, శాంత రంగస్వామి, శుభాగ్ని కులకర్ణి వెల్లడించారంటే అప్పట్లో దేశంలో మహిళా క్రికెట్‌కు ఎంతటి నిరాదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.
మార్పు మొదలైందిలా..
ఐదు దశాబ్దాలుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్నా, ఎలాంటి పురోగతి లేని భారత మహిళల క్రికెట్‌ను 2006లో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) తన చేతుల్లోకి తీసుకోవడంతో మార్పు మొదలైంది. మెల్లమెల్లగా మ్యాచ్‌లు పెరిగి, వసతులు మెరుగయ్యాయి. పారితోషికాల్లో కూడా మార్పు రావడంతో కెరీర్‌పై భరోసా ఏర్పడింది. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునే అమ్మాయిల సంఖ్య పెరిగింది. మహిళల ఆటను బీసీసీఐ టీవీల్లో ప్రసారం చేసినా, ఆరంభంలో వీక్షణ అంతగా కనిపించలేదు. పురుషుల క్రికెట్‌తో పోలిస్తే అమ్మాయిల ఆటలో వేగం, మజా లేకపోవడమే ఇందుకు కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
కానీ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతీ మంధాన, దీప్తీ శర్మ, రిచా ఘోష్, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్‌లాంటి నవతరం క్రీడాకారిణుల రాకతో మహిళల క్రికెట్‌లో మార్పు వేగవంతమైంది. పురుషులకు దీటుగా భారీషాట్లు బాదడం, దూకుడైన ఆటతీరుతో బ్యాటింగ్ చేయడం, మెరుపు వేగంతో ఫీల్డింగ్‌లో ఆకట్టుకోవడం, ప్రత్యర్థి జట్లతో హోరాహోరీ మ్యాచ్‌ల్లో తలపడడం, నిలకడగా విజయాలు సాధిస్తుండడంతో అమ్మాయిల ఆటకు ఆకర్షణ వచ్చింది. పురుషులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో మహిళల ప్రీమియర్ లీగ్‌ను బీసీసీఐ ప్రవేశపెట్టింది. ఈ లీగ్ ద్వారా ప్రపంచ మేటి క్రికెటర్లతో ఆడే అవకాశాన్ని భారత యువ క్రికెటర్లకు కల్పించింది. ఈ క్రమంలోనే భారత అండర్-19 జట్టు వరుసగా రెండోసారి యువ ప్రపంచకప్‌ను గెలిచింది. ఇలాంటి అద్భుత విజయాలతో వారి ఆటను చూసేందుకు అభిమానులు స్టేడియాలకు పెద్ద ఎత్తున తరలిరావడం మొదలైంది.
అమ్మాయిలకూ ఓరోజు..
కపిల్ డెవిల్స్ 1983 ప్రపంచకప్ విజయం భారత్ క్రికెట్‌ను శిఖరాగ్రస్థాయికి తీసుకెళ్లింది. పురుషుల క్రికెట్‌లో భారత్ ఇప్పుడు ఓ బలీయమైన శక్తిగా ఎదిగింది. అయితే, మహిళల క్రికెట్‌లోనూ మనదేశం ఆస్థాయిని అందుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్న అభిమానుల ఆకాంక్షను ఈసారి హర్మన్‌ప్రీత్ సారథ్యంలోని జట్టు నెరవేర్చింది. ఈ విజయం అంత తేలిగ్గా రాలేదు. ఈసారి భారత్‌లో ప్రపంచకప్ మొదలైనప్పుడు ఆతిథ్య భారత జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. తమపై అంచనాల హంగామా పెరిగింది. అప్పటికే రెండుసార్లు వన్డే, ఓ టీ20 ప్రపంచకప్‌లో కిరీటం అందినట్లే అంది చేజారింది.
మరి, ఆటను, విజయకాంక్షను పెంచుకున్న జట్టు ఈసారైనా కప్పు కొడుతుందా? సుదీర్ఘకాల స్వప్నాన్ని నెరవేర్చుకుంటుందా? కోట్లాది అభిమానుల కళ్లన్నీ తమనే ఆశగా చూసిన వేళ హర్మన్ బృందం ఓ పెద్ద యుద్ధమే చేసింది. ఈసారి టోర్నీలో గ్రూప్ దశలో కొన్ని ఓటములు బాధించినా, తమదైన ఆటతీరుతో నాకౌట్ బెర్త్ దక్కించుకొని ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంది. సెమీఫైనల్లో జెమీమా రోడ్రిగ్స్ వీరోచిత సెంచరీతో ఆస్ట్రేలియాను రికార్డు ఛేదనతో మట్టికరిపించింది. ఫైనల్లో షెఫాలీ వర్మ, దీప్తీ శర్మ ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసి చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకుంది.
ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అమ్మాయిల ఆటను అందలాన నిలబెట్టింది. భారత క్రికెట్ అంటే పురుషుల క్రికెట్.. స్టార్లు అంటే గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. భారత్‌లో మతంగా మారిన క్రికెట్‌పట్ల చాలామందిలో ఉన్న ఈ అభిప్రాయాన్ని ఒక్క విజయంతో చెరిపేసింది. దశాబ్దాలుగా మహిళల క్రికెట్ ప్రస్థానంలో ఎదురైన ప్రతికూలతలను బద్ధలుకొడుతూ, భారతీయ మహిళల శక్తిసామర్ధ్యాలను ప్రపంచానికి చాటిచెప్పింది.
తిరస్కారాలే రాటుదేల్చగా..
తనేమైనా హర్భజన్ సింగా.. మహిళా క్రికెటరేగా..! హర్మన్‌ప్రీత్ కౌర్‌ను పంజాబ్ పోలీసు శాఖలో తీసుకోమన్నప్పుడు పైఅధికారి నుంచి ఎదురైన ఛీత్కరింపు ఇది. ఇలాంటి అవమానాలే తనను నిరూపించుకోవాలన్న కసిని ఆమెలో రేపాయి. నాన్న కోరిక నెరవేర్చేందుకు క్రికెట్‌లో అడుగుపెట్టిన హర్మన్.. జాతీయ జట్టులో చేరిన మూడేళ్లకే కెప్టెన్‌గా జట్టు పగ్గాలు అందుకునే స్థాయికి చేరింది. తనదైన నాయకత్వ ప్రతిభతో ఇవాళ జట్టును విశ్వవిజేతగా నిలబెట్టిన ఆమె.. ‘హర్మన్ సారథ్యం.. అద్భుతం’ అన్న ప్రశంసలను అందుకుంది.
నాన్న కోసం..
మహారాష్ట్రలో జిల్లాస్థాయి క్రికెట్ ఆడిన తన సోదరుడు శ్రవణ్ స్ఫూర్తితో ఆటలోకి అడుగు పెట్టిన స్మృతీ మంధాన తనదైన ప్రతిభతో అనతికాలంలోనే ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా బ్యాటర్లలో ఒకరిగా ఎదిగింది. నాన్నకు ఎడమచేతితో ఆడేవాళ్లు ఇష్టం కావడంతో, కుడిచేతి వాటం ఉన్నా తాను ఎడమచేతితో ఆడడం నేర్చుకున్నానంటున్న మంధాన.. ఇప్పుడు జట్టుకు వైస్ కెప్టెన్. ఈ ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన ఆమె.. తాజా విజయంతో భవిష్యత్ కెప్టెన్‌గా నీరాజనాలు అందుకుంటోంది.
అబ్బాయి వేషంలో వెళ్లి..
హరియాణాలోని ఆ ప్రాంతంలో ఆడపిల్లకు ఆటలంటే అభ్యంతరం చెప్పేవారు. దీంతో షెఫాలీ వర్మ జట్టు కత్తిరించుకొని అబ్బాయిలా వేషం మార్చి సాధన చేసింది. జాతీయ జట్టుకు ఆడాలన్న తండ్రి కలను నిజం చేసింది. వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ల ఆటను ఇష్టపడే షెఫాలీ దూకుడైన బ్యాటింగ్‌తో లేడీ సెహ్వాగ్‌లా పేరు తెచ్చుకుంది. ఈ ప్రపంచకప్‌లో ప్రతీకా రావల్ గాయపడడంతో జట్టులోకొచ్చిన షెఫాలీ.. ఫైనల్లో టాప్‌స్కోరర్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకుంది.
తెలుగమ్మాయి తెగువ..
అమ్మానాన్నలకు ఇష్టం లేకున్నా, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న తెలుగమ్మాయి శ్రీచరణి. కడప నుంచి ప్రపంచకప్ స్థాయికి ఎదిగిన శ్రీచరణి.. తన పదునైన బౌలింగ్‌తో టోర్నీలో తెగువ చూపింది. ప్రపంచకప్‌లో దీప్తీ శర్మ తర్వాత అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా నిలిచింది. తెలంగాణకు చెందిన బౌలర్ అరుంధతి రెడ్డి కూడా ఈ ప్రపంచకప్‌నకు ఎంపికైంది. కానీ, అన్ని మ్యాచుల్లో ఆడే అవకాశం లభించలేదు.
‘ఎనిమిదితో’నే చదువు ఆపేసి...
మధ్యప్రదేశ్‌లోని ఓ కుగ్రామానికి చెందిన క్రాంతి గౌడ్.. కుటుంబ ఆర్థికపరిస్థితుల కారణంగా ఎనిమిదో తరగతితోనే చదువు ఆపేసింది. క్రికెట్‌లో బౌలర్‌గా రాణించడం కోసం ఆమె అమ్మ నగలు అమ్మింది. ఈ ఏడాది మే నెలలోనే జాతీయ జట్టుకు ఎంపికైన క్రాంతి.. తనదైన ప్రదర్శనతో ఈ ప్రపంచకప్‌లో చోటు దక్కించుకుంది. జట్టు పేసర్లలో కీలక బౌలర్‌గా నిలిచిన ఆమె పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. ఈ విజయంతో ఇప్పుడు తన గ్రామానికి ఆదర్శప్రాయురాలైంది.
ఆ వార్త దాచిపెట్టి..
పంజాబ్‌లోని మొహాలీకి చెందిన అమన్‌జోత్ కౌర్ కార్పెంటర్ కూతురు. తండ్రి చెక్కిన బ్యాట్‌తో క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన అమన్‌కు తన నానమ్మ అంటే ఎంతో ఇష్టం. ఆడపిల్లలకు ఆటలేంటి అన్న ఇరుగుపొరుగు ఆక్షేపణలతో ప్రతిరోజూ నానమ్మే ఆమెను క్రికెట్ ప్రాక్టీస్‌కు తీసుకెళ్లేది. ప్రపంచకప్ మొదలైన కొన్నిరోజులకే అమన్ నానమ్మ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరింది. ఈ విషయాన్ని అమన్‌కు తెలియనీయకుండా ఇంట్లోవాళ్లు ఆమె విజయం కోసం ఎదురుచూశారు. వాళ్ల శ్రమకు తగ్గట్టుగానే ఫైనల్లో అమన్.. కీలక బ్యాటర్ క్యాచ్‌ను పట్టి కప్పు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ విజయాన్ని అమన్ తన నానమ్మకు అంకితం చేసింది.
వీరోచిత పోరాటంతో..
తనకు పదకొండేళ్లప్పుడు ముంబైలో భారత పురుషుల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచిన స్ఫూర్తితో క్రికెట్‌లో అడుగుపెట్టిన జెమీమా రోడ్రిగ్.. సరిగ్గా 14 ఏళ్ల తర్వాత మహిళల జట్టు ప్రపంచ చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించడం విశేషం. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై జెమీమా చేసిన వీరోచిత సెంచరీని ఎవరు మరువగలరు? అంతలా చెలరేగిన జెమీమా ఓ దశలో వివాదాల్లోనూ చిక్కుకుంది. స్టేడియంలో తన తండ్రి మతపరమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడంటూ విమర్శలు ఎదురైనా, వాటన్నింటిని భరిస్తూనే ఆటపై దృష్టి సారించింది. ఈ ప్రపంచకప్ ఆరంభంలో ఫామ్ కోల్పోయి ఓ దశలో తీవ్ర ఆందోళనకు గురైన ఆమె.. సెమీస్‌లో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని భారత జట్టును ఫైనల్ చేర్చింది. వీళ్లేకాదు.. కూరగాయల వ్యాపారి కూతురైన స్పిన్నర్ రాధా యాదవ్, డీఎస్పీగా పనిచేస్తున్న ఆల్‌రౌండర్ దీప్తీ శర్మ, జట్టులో పవర్‌హిట్టర్‌గా పేరున్న రిచా ఘోష్, క్రికెటర్ కావాలన్న తండ్రి కలను నిజం చేసిన పేసర్ రేణుకాసింగ్ ఠాకూర్.. ఇలా విశ్వవిజేతలుగా నిలిచిన జట్టు సభ్యుల్లో ప్రతి ఒక్కరి గాథ స్ఫూర్తిదాయకమే!.
‘కథానాయికలు కనిపిస్తే వెండితెరకు నిండుదనం’ ఎలా వస్తుందో.. ఇప్పుడు మైదానాల్లోనూ మహిళల రాణింపుతో.. ఆట గొప్పదనం రెట్టింపవుతోంది. క్రికెట్‌లో హర్మన్ సేన, అథ్లెటిక్స్‌లో పీటీ ఉష.. బ్యాడ్మింటన్‌లో సైనా నెహ్వాల్, పీవీ సింధు.. టెన్నిస్‌లో సానియా మీర్జా.. బాక్సింగ్‌లో మేరీకోమ్, లవ్లీనా, నిఖత్ జరీన్.. రెజ్లింగ్‌లో సాక్షీ మాలిక్, వినేశ్ ఫొగట్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను.. షూటింగ్‌లో మనూ భాకర్, ఇషా సింగ్.. ఆర్చరీలో జ్యోతి సురేఖ, రెండు చేతులు లేకున్నా కాళ్లతో బాణాలు సంధిస్తున్న శీతల్ దేవి.. అథ్లెటిక్స్‌లో జ్యోతి యర్రాజీ, దీప్తి.. ఇలా వీళ్లందరూ నారీశక్తి ప్రభంజనానికి నిదర్శనం.’
- శ్రీభానుకాంత్ రెడ్డి, 80966 77403
భవిష్యత్‌కు భరోసా..
వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో మహిళల క్రికెట్‌లో దిగ్గజ శక్తిగా భారత్ ఎదిగింది. ఈ గెలుపుతో మున్ముందు భారత్‌కు మరింత మంచి భవిష్యత్ ఉందనడంలో సందేహం లేదు. ఇప్పటికే పురుషులతో సమంగా మహిళలకు ఒప్పందాలు చెల్లిస్తూ బీసీసీఐ యువ క్రికెటర్లకు ఆర్ధిక భద్రత కల్పించింది. పురుషులకు ఐపీఎల్ తరహాలో మహిళలకు ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రారంభించారు. ఈ లీగ్ కోసం ఐదు జట్లకు బిడ్‌లను ఆహ్వానిస్తే మొత్తంగా రూ. 4700 కోట్ల ధర పలకడం మహిళా క్రికెట్ ప్రభంజనానికి తార్కాణం. ఈ లీగ్ మీడియా హక్కులు ఏకంగా రూ. 961 కోట్లు పలకడం, టోర్నీ ప్రసారదారు ఒక్కో మ్యాచ్‌కు రూ. 7 కోట్లు చెల్లించడం చూస్తే మన మహిళల క్రికెట్ అత్యున్నతస్థాయికి చేరుతోందని చెప్పవచ్చు.
దారి చూపిన మిథాలీ

ఆటకు ఆదరణ లేని రోజుల్లో.. భవిష్యత్తుకు భరోసా ఉంటుందన్న ఆశలే లేని పరిస్థితుల్లో.. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు మిథాలీ రాజ్. అమోఘమైన పోరాట స్ఫూర్తితో.. తన క్రీడలో ఎదురైన సవాళ్లను అధిగమించి.. తాను ఎదిగి, మహిళల క్రికెట్‌ను ఎదిగేలా చేసి.. దేశంలో ఎంతోమంది అమ్మాయిలు బ్యాట్ పట్టేందుకు మార్గదర్శిగా నిలిచింది. తన నాయకత్వ ప్రతిభతో మహిళల క్రికెట్ స్థాయిని పెంచింది. దేశంలో ఆ క్రీడకు చిరునామాగా నిలిచింది. రెండు దశాబ్ధాలకు పైగా మహిళల క్రికెట్‌లో రాజ్యమేలి లేడీ సచిన్‌గా నీరాజనం అందుకొంది. తొలినాళ్లలో పేరు, డబ్బు లేకపోయినా, క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ.. చెల్లింపులు నామమాత్రంగానే ఉన్నా, ఆటపై మక్కువతో కెరీర్‌ను కొనసాగించింది. రైళ్లలో ప్రయాణించి, చిన్నపాటి ఇరుకు గదుల్లో సర్దుకొని మ్యాచ్‌లు ఆడిన భారత క్రికెటర్లలో మిథాలీ కూడా ఒకరు.
కెరీర్ ఆరంభం నుంచి అదే అంకితభావంతో ముందుకు సాగిన ఆమె.. పురుషాధిక్య క్రికెట్ ప్రపంచంలో వాళ్లతో ధీటుగా ఆడింది. జాతీయ జట్టును నిర్మించడం కష్టమైన రోజుల్లో జులన్ గోస్వామి లాంటి వాళ్ల అండతో జట్టును ముందుకు నడిపించింది. తనదైన ఆటతో మైదానంలో లెక్కకు మిక్కిలి రికార్డులు కొల్లగొట్టింది. భారత క్రికెట్‌కు దేవుడిగా ప్రశంసలు అందుకున్న సచిన్ టెండూల్కర్ 24 ఏళ్లు క్రికెట్‌లో కొనసాగితే.. దాదాపుగా అతనికి సమంగా 23 ఏళ్లపాటు మిథాలీ మైదానంలో బ్యాట్‌తో ఆడుకొని మహిళల క్రికెట్‌లో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది.
ఆటే కాదు ఆర్జనలోనూ..

ప్రపంచకప్ విజయంతో మన మహిళా క్రికెటర్లకు గుర్తింపు, గౌరవం దక్కడంతో పాటు వాణిజ్య విలువ కూడా ఆకాశాన్నంటింది. పురుషులకు దీటుగా వీళ్లను బ్రాండ్ స్టార్లుగా కార్పొరేట్ ప్రపంచం చూస్తోంది. కోట్ల రూపాయల స్పాన్సర్‌షిప్‌లతో క్రికెటర్ల ముందు కంపెనీలు క్యూ కడుతున్నాయి. కెప్టెన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, జెమీమా, షెఫాలీ, దీప్తీ శర్మవంటి ప్లేయర్ల బ్రాండ్ విలువ 25 నుంచి 100 శాతానికి పెరిగింది. అందం, అంతకుమించిన ఆటతో అలరిస్తున్న స్మృతీ మంధాన ఒక వాణిజ్య ప్రకటనలో కనిపించేందుకు రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల దాకా వసూలు చేస్తోందట. ఆమె ఖాతాలో ఇప్పటికే 16 ప్రముఖ బ్రాండ్లు ఉన్నాయి. జెమీమా రూ. 75 లక్షల నుంచి 1.5 కోట్ల వరకు తీసుకుంటుందని కార్పొరేట్ వర్గాల సమాచారం.
ఆటంతా వాళ్లదే..

ఆటలు ఆడడంలోనే కాదు.. ఆటను నడిపించడంలోనూ మహిళలు ముందుంటున్నారు. ఇందుకు నిదర్శనమే.. ఈసారి ప్రపంచకప్‌ను పూర్తిగా మహిళలతో నిర్వహించడమే. మైదానంలో క్రీడాకారిణులతో పాటు కనిపించే అంపైర్లు, రెఫరీలు కూడా మహిళలే కావడం విశేషం. అంతర్జాతీయ క్రికెట్‌లో అతివల సత్తాకు గుర్తింపుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. ఈ ప్రపంచ కప్‌ను పూర్తిగా మహిళలతోనే నిర్వహించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈసారి మెగా టోర్నమెంట్‌కు 14 మంది అంపైర్లు, నలుగురు మ్యాచ్ రెఫరీలుగా మహిళలనే నియమించింది. వివిధ దేశాలకు చెందిన క్లైర్ పోలోసాక్, జాక్వెలిన్ విలియమ్స్, స్యూ రెడ్‌ఫెర్న్, లారెన్ అఠిెన్‌బాన్, కిమ్ కాటన్ టోర్నీలో పలు మ్యాచ్‌లకు అంపైర్లుగా వ్యవహరిస్తే, తెలుగు మహిళ జీఎస్ లక్ష్మి, ట్రూడీ అండర్సన్, షాండ్రే ఫ్రిట్జ్, మిచెల్ పెరెరా రెఫరీలుగా బాధ్యతలు నిర్వర్తించారు.
