BCCI: టీమిండియా అసిస్టెంట్ కోచ్ నాయర్‌పై వేటు
ABN , Publish Date - Apr 18 , 2025 | 02:54 AM
భారత క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై బీసీసీఐ వేటు వేసింది. అలాగే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లు పొడిగించనున్నారు

దిలీప్, సోహమ్ పొడిగింపు లేదు
కోచింగ్ సిబ్బందిని కుదించిన బీసీసీఐ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బంది విషయంలో బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకొంది. ఇంగ్లండ్ పర్యటనకు ముందే కోచింగ్ స్టాఫ్‌ను కుదించింది. ఈ క్రమంలో గతేడాది జూలైలో నియమించిన అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌పై వేటు వేసింది. వాస్తవంగా స్వదేశంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టూర్‌లో టెస్ట్ సిరీస్‌ల్లో జట్టు వైఫల్యంపై బోర్డు సమీక్ష చేసింది. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్లు వరుసగా విఫలమవుతున్నా కోచ్‌లు ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీలు కూడా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో నాయర్‌పై వేటు వేస్తారనే ప్రచారం భారీగానే జరిగింది. జట్టు బ్యాటింగ్ కోచ్‌గా సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్‌గా మోర్నీ మోర్కెల్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
దిలీప్ కూడా అవుట్!: ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ర్టెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను పునరుద్ధరించకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. జూలైతో వీరిద్దరి మూడేళ్ల కాంట్రాక్ట్ ముగియనుంది. దిలీప్ స్థానంలో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న టెన్ డెస్కటే ఫీల్డింగ్ కోచ్ బాధ్యతలు నిర్వహిస్తాడని సమాచారం. ఇక, స్ట్రెంగ్త్ అండ్ కండీషనింగ్ కోచ్‌గా సౌతాఫ్రికాకు చెందిన అడ్రియన్ లీ రౌక్స్ మరోసారి భారత జట్టుకు సేవలందించనున్నట్టు సమాచారం.