Share News

వంద అడుగుల చెట్టంత ఇల్లు..

ABN , Publish Date - Aug 03 , 2025 | 11:45 AM

ఎనభైకి పైగా గదులు... పదుల సంఖ్యలో వరండాలు... వంద అడుగుల ఎత్తైన నిర్మాణం... అది బహుళ అంతస్తుల కాంక్రీటు భవనమని అనుకుంటే పొరపాటే. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిర్మించిన అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’. చెక్కతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’గా గుర్తింపు పొందిన దాని విశేషాలివి...

వంద అడుగుల చెట్టంత ఇల్లు..

ఎనభైకి పైగా గదులు... పదుల సంఖ్యలో వరండాలు... వంద అడుగుల ఎత్తైన నిర్మాణం... అది బహుళ అంతస్తుల కాంక్రీటు భవనమని అనుకుంటే పొరపాటే. ఒక చెట్టును ఆసరా చేసుకుని నిర్మించిన అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’. చెక్కతో నిర్మించిన ఈ ఇంటిని చూసేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ప్రపంచంలోనే అతి పెద్ద ‘ట్రీహౌజ్‌’గా గుర్తింపు పొందిన దాని విశేషాలివి...

సుమారు ఎనభై అడుగుల ఎత్తున్న ఒక వైట్‌ ఓక్‌ చెట్టు... ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది దానికి. ఆ చెట్టునే ఆసరాగా చేసుకుని, ఇంటి నిర్మాణం చేపట్టారు. చెట్టు కాండం 12 అడుగుల వ్యాసార్థంతో భారీగా ఉంటుంది. అంటే ఒకరకంగా వెన్నుముకలాంటిది. దాని ఆధారంగానే వినూత్న ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇంటి నిర్మాణంలో పూర్తిగా రీసైకిల్డ్‌ కలపను ఉపయోగించారు. పక్కనేవున్న మరో ఆరు చెట్లను సపోర్టుగా చేసుకుని టవర్‌లాంటి నిర్మాణం చేపట్టారు.


పన్నెండేళ్ల కృషి...

ఈ అతిపెద్ద ట్రీహౌజ్‌ అమెరికాలోని టెనన్సీ రాష్ట్రంలోని క్రాస్‌విల్లే పట్టణంలో కనిపిస్తుంది. 1993లో హోరెస్‌ బర్గెస్‌ అనే వ్యక్తి దీనిని నిర్మించారు. ‘‘ఒకరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పుడు ‘నువ్వు ఒక ట్రీహౌజ్‌ నిర్మిస్తే కనుక ఇంటికి అవసరమైన సామగ్రి అయిపోకుండా నేను చూస్తాను’ అన్న మాటలు వినిపించాయి. ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయమని దేవుడు నాకు వ్యక్తిగతంగా కాంట్రాక్టు ఇచ్చాడని అనిపించింది’’ అని ట్రీహౌజ్‌ నిర్మాణం వెనక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని వివరిస్తారు హోరెస్‌. వృత్తిరీత్యా కార్పెంటర్‌, ఆర్కిటెక్ట్‌ అయిన హోరెస్‌ దేవుడి ఆజ్ఞ మేరకు ట్రీహౌజ్‌ నిర్మాణం మొదలు పెట్టారు. దీని నిర్మాణం పన్నెండేళ్ల పాటు సాగింది. అయితే ఎప్పుడూ కూడా సామగ్రి కొరత ఏర్పడలేదని అంటారాయన.


book8.2.jpg

పదంతస్తుల మేడ...

ఒకటి కాదు రెండు కాదు... ఈ ట్రీ హౌజ్‌ పది అంతస్తుల్లో ఉంటుంది. అంటే... ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌ను తలపిస్తుంది. ఒక్కో అంతస్తు తొమ్మిది నుంచి పదకొండు అడుగుల ఎత్తులో ఉంటుంది. ట్రీ హౌజ్‌లో 80కి పైగా గదులు, వరండాలు, మెట్లు అన్నీ ఉన్నాయి. సకల సదుపాయాలతో ఆకర్షణీయంగా ఉంటుంది. అందుకే ఈ ఇంటిని చూడటానికి పర్యాటకులు విశేషంగా తరలివస్తుంటారు. దీనిని ‘ది మినిస్టర్స్‌ ట్రీ హౌజ్‌’’ అని కూడా పిలుస్తారు. ఈ ట్రీ హౌజ్‌ నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 14 ఏళ్లు పట్టింది. పదో అంతస్తులో పెంట్‌ హౌజ్‌ ఉండటం విశేషం.


ఇంటి మధ్యలో విశాలమైన స్థలం ఉంది. సాయంకాలం వేళలో బాస్కెట్‌బాల్‌ ఆడుకోవడానికి ఇది అనువుగా ఉంటుంది. ఇంటి పై అంతస్తులో అర టన్ను బరువున్న చర్చ్‌గంట కూడా ఉంది. సేదదీరేందుకు ఒక ఊయలను కూడా చూడొచ్చు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఒకటి కన్నా ఎక్కువ ప్రవేశద్వారాలు ఉంటాయి. సహజ కాంతి పడేలా నిర్మాణంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ ట్రీహౌజ్‌ నిర్మాణంలో రెండున్నర లక్షలకు పైగా మేకులు ఉపయోగించారు.


అనుమతి నిషేధం...

ట్రీహౌజ్‌ పాపులర్‌ అయ్యాక అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటి వరకు 23 జంటలు అక్కడ పెళ్లి చేసుకున్నట్టు హోరెస్‌ చెబుతున్నారు. కలప గృహం కావడంతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... 2019లో అగ్ని ప్రమాదం జరిగి గ్రౌండ్‌ఫ్లోర్‌లో కొంతభాగం కాలిపోయింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అధికారులు ఈ ఇంట్లోకి పర్యాటకుల అనుమతిని నిషేధించారు. ట్రీహౌజ్‌ను సందర్శించిన ఒక రిటైర్డ్‌ ఇంజనీర్‌ సైతం ఇది ఎంత మాత్రం సురక్షితం కాదని, పర్యాటకులను అనుమతించడం శ్రేయస్కరం కాదని చెప్పారు. దాంతో అఽధికారులు ఇంటి దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ అనధికారికంగా కొంతమంది ఔత్సాహిక పర్యాటకులు ఇంటి పై అంతస్తుల వరకు వెళ్లి ఫొటోలు దిగుతూ ఉంటారు.

Updated Date - Aug 03 , 2025 | 11:46 AM