Child - Thief Viral Video: దొంగ మనసు మార్చిన చిన్నారి.. చూసి తీరాల్సిన వీడియో!
ABN , Publish Date - Nov 17 , 2025 | 07:09 PM
పసిపాప అమాయకత్వం దొంగలోని మానవత్వాన్ని తట్టిలేపిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో వెనుక నిజానిజాలు ఎలా ఉన్నా భలే ఎంటర్‌టెయినింగ్‌గా ఉందంటూ జనాలు వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏఐ జమానాలో నెట్టింట ఆసక్తికర కంటెంట్‌కు కొదవేలేదు. ఏది నిజమైనదో ఏది నకిలీనో చెప్పడం మాత్రం అంత సులువైన విషయం కాదు. కానీ కొన్ని రకాల కంటెంట్ మాత్రం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. విషయం ఎంటర్‌టెయినింగ్‌గా ఉండటంతో జనాలు నిజానిజాల చర్చను పక్కన పెట్టి మరీ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది ( Child Innocence Touching video).
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ దొంగ తుపాకీ పట్టుకుని షాపులో చోరీకి వచ్చాడు. కౌంటర్‌లో షాపు యజమానితో పాటు అతడి కూతురు కూడా ఉంది. తండ్రి పక్కన కుర్చీలో కూర్చుని ఆ చిన్నారి చాక్లెట్ తింటోంది. ఇంతలో దొంగ తుపాకీ చూపిస్తూ షాపు యజమానిని బెదిరించాడు. డబ్బులు మొత్తం ఇవ్వమని డిమాండ్ చేశాడు. అతడిపై పలుమార్లు చేయి చేసుకున్నాడు. తుపాకీ చూసి బెదిరిపోయిన షాపు యజమాని వెంటనే అతడు చెప్పినట్టు డబ్బులు తీసిచ్చాడు. ఇది చూసిన చిన్నారి కూడా తండ్రిలాగే తన వద్ద ఉన్న లాలీపాప్‌ను దొంగకు ఇచ్చే ప్రయత్నం చేసింది (emotional robbery video).
పసి పాప చేసి పనికి దొంగ గుండె ద్రవించింది. మానవత్వం మేల్కొంది. ఉన్మాదం నుంచి బయటపడ్డాక చేస్తున్న తప్పు దొంగకు తెలిసొచ్చింది. పశ్చాత్తాపం ముంచెత్తడంతో ఆ దొంగ తన తప్పును సరిదిద్దుకున్నాడు. చిన్నారి తండ్రి నుంచి తీసుకున్న డబ్బు, ఇతర వస్తువులను కూడా తిరిగిచ్చేశాడు. ఆ తరువాత సైలెంట్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
‘ఇలాంటి ముగింపు అస్సలు ఊహించి ఉండరు’ అన్న క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. చిన్నారుల్లో దేవుడు ఉంటాడని, వారి ముందు ఎంతటి దుర్మార్గమైనా తలవంచాల్సిందేనని కామెంట్ చేశారు. దొంగ మనసు మార్చిన చిట్టి తల్లి నిజంగా గ్రేట్ అని కొందరు అన్నారు. మరికొందరు మాత్రం వీడియోపై సందేహాలు వ్యక్తం చేశారు. వైరల్ అయ్యేందుకు ఎవరైనా చిన్న స్కిట్‌ను ఇలా రికార్డు చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇలాంటి అనుమానాలు సందేహాల మధ్య కూడా వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. వ్యూస్ విపరీతంగా వచ్చి పడుతున్నాయి. మరి ఈ ఎంటర్‌టెయినింగ్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.
ఇవీ చదవండి:
వామ్మో.. ఎలాన్ మస్క్ ట్రోల్ చేస్తే దిమ్మతిరగాల్సిందే.. మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓకు షాక్
ఏసీ కోచ్‌లో జర్నీ.. రాత్రంతా గాఢ నిద్ర.. తెల్లారి లేచే సరికి..