Share News

UP Woman: ఇన్‌స్టాలో ఇద్దరు ఫాలోవర్లు తగ్గడంతో ఆగ్రహం.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Jun 12 , 2025 | 03:54 PM

ఇన్‌‌స్టా ఫాలోవర్లు తగ్గడానికి ఇంటి పనులు ఎక్కువవడమే కారణమని భావించిన ఓ మహిళ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

UP Woman: ఇన్‌స్టాలో ఇద్దరు ఫాలోవర్లు తగ్గడంతో ఆగ్రహం.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు
Instagram follower dispute

ఇంటర్నెట్ డెస్క్: సమాజంపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మాయలో పడి యువత కెరీర్‌ను కోల్పోతుంటే యువ జంటల కాపురాల్లో కలతలు చెలరేగుతున్నాయి. తాజాగా ఇలాంటి షాకింగ్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోవర్లు తగ్గడానికి తన భర్తే కారణమని భావించిన ఓ మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. చివరకు భర్తపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

నిషా, ఆమె భర్త విజయేంద్ర హాపూర్‌ జిల్లాలో ఉంటారు. నిషాకు ఇన్‌స్టాలో అకౌంట్ ఉంది. వీడియోలు కూడా పోస్టు చేస్తూ ఉంటుంది. ఆమెకు ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే, సోషల్ మీడియాను పక్కన పెట్టి ఇంటి పనులపై దృష్టి పెట్టాలని భర్త ఆమెకు సూచించాడు. భర్త చెప్పినట్టే ఆమె ఇంటి పనుల్లో బిజీగా మారిపోయింది. ఫలితంగా ఆమెకు ఇద్దరు ఫాలోవర్లు దూరమయ్యారు. ఇది చూసి షాక్ తిన్న నిషా భర్తపై తీవ్ర ఆగ్రహానికి లోనైంది. చివరకు పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటికి కూడా భర్తపై కోపం చల్లారకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


‘నేను అంట్లు తోమడం, ఇల్లు శుభ్రం చేయడంలో బిజిగా మారిపోయాను. రీల్స్ చేసేందుకు సమయమే దొరకలేదు దీంతో, ఫాలోవర్ల సంఖ్య తగ్గింది. ఒకప్పుడు రోజుకు రెండు రీల్స్ పోస్టు చేసే దాన్ని అని’ ఆమె పోలీసులకు తెలిపింది.

ఇది చాలదన్నట్టు విజేంద్ర జాబ్ కూడా కోల్పోయాడు. ఆర్థిక కష్టాల్లో పడ్డాడు. ఈ క్రమంలోనే భార్య ఫిర్యాదు గురించి తెలియడంతో అతడి కోపం నషాళానికి అంటింది. దీంతో, అతడు కూడా భార్యపై పోలీసులకు మరో ఫిర్యాదు చేశాడు. నిత్యం సోషల్ మీడియాపైనే దృష్టి పెట్టి ఇంటి విషయాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డాడు.


స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ భార్యాభర్తల వాదనలను దాదాపు రెండు గంటల పాటు సహనంతో విని ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. పెళ్లి, కుటుంబజీవితం గొప్పదనం గురించి వివరించి చెప్పారు. దీంతో, ఇద్దరూ తమ తప్పు తెలుసుకుని ఇకపై సఖ్యతా ఉంటామని చెప్పి వెళ్లారు. అయితే, ఈ విషయమై మీడియాతో మాట్లాడేందుకు భార్యాభర్తలు ఇద్దరూ నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

ఏసీ కోచ్‌లో ఇలా ఎవరైనా చేస్తారా.. ఓ ప్రయాణికుడి ఆవేదన నెట్టింట వైరల్

సింధూరం పెడుతుండగా వణికిన వరుడి చేతులు.. వధువుకు డౌటొచ్చి..

Read Latest and Viral News

Updated Date - Jun 12 , 2025 | 04:04 PM