Drunk Youths Stop School Bus: రెచ్చిపోయిన తాగుబోతులు.. 9వ తరగతి విద్యార్థినిపై..
ABN , Publish Date - Dec 11 , 2025 | 07:50 AM
కర్ణాటక రాష్ట్రంలోని మండ్యా జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రవర్తించారు. స్కూల్ బస్సు ఆపి రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మద్యం మత్తులో ఇద్దరు తాగుబోతులు రెచ్చిపోయారు. స్కూటీపై స్కూల్ బస్సును ఛేజ్ చేసి ఆపారు. బస్సులో ఉన్న 9వ తరగతి విద్యార్థినిని కిందకు దింపాలంటూ బస్సు డ్రైవర్‌తో గొడవపెట్టుకున్నారు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మండ్యా జిల్లా క్రిష్ణరాజపేటే తాలూకాకు చెందిన ఓ ఇద్దరు యువకులు పూటుగా మద్యం తాగారు. స్కూటీపై బసవనహళ్లి - వడ్డరహళ్లి రోడ్డుపై వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ముందు వెళుతున్న స్కూల్ బస్సుపై వారి కన్ను పడింది. ఆ యువకులు స్కూటీపై బస్సును ఛేజ్ చేశారు. కొంతదూరం పోయిన తర్వాత బస్సును ఆపారు. స్కూటీని బస్సుకు అడ్డంగా ఆపారు.
ఆ వెంటనే ఇద్దరూ బస్సు డ్రైవర్ దగ్గరకు వచ్చారు. బస్సులో ఉన్న 9వ తరగతి విద్యార్థినిని బయటకు పంపాలంటూ డ్రైవర్‌కు చెప్పారు. ఆయన ఇందుకు ఒప్పుకోకపోవటంతో బెదిరింపులకు సైతం దిగారు. వారు బస్సు డ్రైవర్‌తో గొడవ పెట్టుకోవటంతో బస్సులో ఉన్న విద్యార్థులందరూ భయపడిపోయారు. దీన్నంతా బస్సులో ఉన్న స్కూల్ సిబ్బంది వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మండ్యా జిల్లా పోలీస్ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. పోలీస్ అధికారులు ఈ సంఘటనను ధ్రువీకరించారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువకులు రచ్చ రచ్చ చేశారని తెలిపారు.
ఇక, కిక్కెరి పోలీస్ స్టేషన్‌లో ఈ సంఘటనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ఫోక్సో చట్టం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ యువకుల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఆ యువకులకు సంబంధించిన వివరాలు కూడా వెలుగులోకి వచ్చాయి. వారిని 20 ఏళ్ల కిరణ్, గిరీష్‌లుగా గుర్తించారు. ఇక, వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు. కఠినంగా శిక్షించాలి’.. ‘బస్సులో చాలా మంది ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఒంటరిగా వెళ్లే అమ్మాయి అయి ఉంటే దారుణానికి పాల్పడి ఉండేవారు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సర్పంచ్ ఎన్నికల లైవ్ అప్డేట్స్
11న హైదరాబాద్-తిరుపతి ప్రత్యేక రైలు