Twitch Streamer Lightning Strike: ఇంట్లో వీడియో గేమ్ ఆడుతూ పిడుగుపాటుకు గురైన యువకుడు.. షాకింగ్ దృశ్యం వైరల్
ABN , Publish Date - Jul 29 , 2025 | 02:58 PM
ఇంట్లో ఉండగా ఓ యువకుడు పిడుగుపాటుకు గురైన ఘటన అమెరికాలోని నార్త్ కెరొలీనా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో ఓ యువకుడు ఇంట్లో కూర్చుని వీడియో గేమ్ ఆడుతుండగా పిడుగుపాటుకు గురైన ఘటన వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉత్తర కెరొలీనాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, క్రిస్టియన్ హావర్డ్ అనే యువకుడు భారీ వర్షం పడుతున్న సమయంలో తన ఇంట్లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. ట్విచ్ వేదికగా తన గేమ్‌ను లైవ్‌లో ప్రసారం చేశాడు. ఇంతలో అతడి ఇంటి బయట పిడుగు పడింది. ఆ వెలుతురు అతడి గదిలోకి వచ్చి తళ్లుక్కుమని మెరవడం కూడా వీడియోలో రికార్డయ్యింది. ఆ తరువాత కొన్ని క్షణాలకే వెబ్‌కామ్‌లో స్వల్ప ఆటంకం కనిపించింది. ఆ మరుక్షణం క్రిస్టియన్ తన హెడ్‌ఫోన్స్‌ను తొలగించి, కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి పక్కకు వెళ్లాడు. ఆ తరువాత కొన్ని క్షణాలకు మళ్లీ మైక్ వద్దకు తిరిగొచ్చిన అతడు అసలేం జరిగిందీ చెప్పుకొచ్చాడు.
తనకు తృటిలో పిడుగుపాటు తప్పిందని సంబరపడిపోయాడు. బయట పిడుగుపడిన కాసేపటికే విద్యుత్ ప్రవాహం హెడ్‌ఫోన్సు మీదుగా శరీరానికి చేరిందని అన్నారు. అయితే, తనకు పెద్దగా ఇబ్బంది ఏదీ కలగలేదని కూడా చెప్పాడు.
నిపుణులు చెప్పే దాని ప్రకారం, పిడుగుపాటు సమయంలో విద్యుత్.. వైర్లు, ఇంట్లోని పైపుల ద్వారా లోపలికి వచ్చే అవకాశం ఉంది. హెడ్ ఫోన్స్, వెబ్‌కామ్ ద్వారా కూడా విద్యుత్ ప్రవహించొచ్చు. అయితే, పిడుగుపడే అవకాశం చాలా తక్కువని నేషనల్ లైట్నింగ్ సేఫ్టీ కౌన్సిల్ చెబుతోంది. ఇక ఎన్ఎల్ఎస్‌సీ ప్రకారం ఈ ఏడాది అమెరికాలో 12 మంది పిడుగుపాటుకు గురై చనిపోయారు. గత వారం న్యూజెర్సీలో పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మరణించగా మరో 13 మంది గాయాలపాలయ్యారు.
ఇక పిడుగుపాటు ప్రమాదం తగ్గించేందుకు వానలు పడే సమయంలో ఇంట్లోని లాప్‌టాప్‌లు, గేమింగ్ కన్సోల్స్ వంటి వాటిని స్విచ్‌బోర్డుల నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ చేయాలి. వాటి వైర్లను తొలగించాలి. లాండ్ లైన్, ఎథర్‌నెట్ కేబుల్స్‌కు దూరంగా ఉండాలి. అంతేకాకుండా, ఇంట్లోని నీళ్ల పైపులు వంటి వాటినీ టచ్ చేయకూడదు. షవర్లు, వాషింగ్ మెషీన్లు, వాషింగ్ సింకులను వాడకూడదు. తలుపులు, కిటీలకు కూడా దూరంగా ఉండాలి. లోహంతో చేసిన దేన్నీ తాకకుండా ఉండాలి. టీవీ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కాపాడుకునేందుకు సర్జ్ ప్రొటెక్టర్స్‌ను వాడాలి.
ఇవీ చదవండి:
టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన
భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్