Indian Railways Incident: మహిళలకు రైల్లో దిగువ బెర్తు ఇవ్వనందుకు విమర్శలు.. నెట్టింట యువకుడి ఆవేదన
ABN , Publish Date - Nov 10 , 2025 | 08:16 PM
మహిళలకు రైల్లో కింది బెర్తు ఇవ్వనందుకు తాను విమర్శల పాలయ్యానంటూ ఓ యువకుడు నెట్టింట పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. జనాలు మాత్రం అతడికి మద్దతు తెలిపారు. అనవసర త్యాగాలు వద్దని కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లల్లో మహిళలు, వృద్ధులు, చిన్నారులకు కింది బెర్తుల్లో ప్రయాణించడం సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు పెట్టిన పోస్టు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాను బుక్ చేసుకున్న కింది బెర్తు ఇవ్వనందుకు కొందరు మహిళలు హీనంగా చూశారంటూ 21 ఏళ్ల యువకుడు ఒకరు నెట్టింట ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేశానా? అంటూ అతడు నెట్టింట పెట్టిన పోస్టుపై జనాలు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు (Lower Berth Issue Viral Post).
రెడిట్‌లో సదరు యువకుడు ఈ పోస్టు పెట్టాడు. ‘నా వయసు 21 ఏళ్లు. సెలవులపై సొంత ఊరికొచ్చిన నేను మళ్లీ కాలేజీకి బయలుదేరా. 12 గంటల పాలు రైల్లో వెళ్లాలి. కాలేజీ వర్క్ చేసుకునేందుకు వీలుగా కింది బెర్తు బుక్ చేసుకున్నా. జర్నీ ప్రారంభం అయ్యాక పక్క బెర్తులోని కొందరు ఆంటీలు నాతో మాట కలిపారు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది. నన్ను వారు పైబెర్తుకు మారమంటారని అనుకున్నాను. నేను ఊహించినట్టుగానే వారు నన్ను పైబెర్తుకు మారమన్నారు. కానీ నేను మాత్రం సున్నితంగా తిరస్కరించాను’
‘నా వద్ద లగేజీ ఎక్కువగా ఉంది. నా రెండు బ్యాగుల్లో ల్యాప్‌టాప్, ట్యాబ్స్ ఉన్నాయి. కాలేజీ వర్క్ కూడా చేసుకోవాలి. కాబట్టి లగేజీని పక్కన పెట్టుకుని ల్యాప్‌టాప్‌తో పని చేసుకునేందుకు వీలుగా కింది బెర్తు బుక్ చేసుకున్నాను. పైబెర్తుకు మారితే అంత లగేజీతో సౌకర్యవంతంగా ఉండదు. పని కూడా చేసుకోలేను’
‘కానీ వాళ్లు మాత్రం నాపై విమర్శలకు దిగారు. మీ బంధువులు సాయం అడిగితే ఇలాగే చేస్తావా అంటూ విమర్శలకు దిగారు. నా వయసులోని వారందరూ పైబెర్తుకు మారతారని అన్నారు. రైల్వేను కూడా తప్పుబట్టారు. మహిళలు పైబెర్తుల్లో ఉంటే పురుషులు కింద బెర్తుల్లో ఉంటున్నారని అన్నారు. ఆ తరువాత మరింతగా సణగడం ప్రారంభించారు. బెర్తు ఇవ్వనందుకు పెద్ద తప్పు చేసినట్టు ఫీలయ్యేలా చేశారు. చివరకు నాపై నాకే చిరాకు వచ్చింది. వాస్తవానికి మా ఇంట్లో వాళ్లు అడిగి ఉంటే నేను పై బెర్తుకు వెళ్లి ఉండేవాణ్ణి. మరి నేను నిజంగా తప్పు చేశానా? లేక రైల్వేది తప్పా’ అని అతడు పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై సహజంగానే నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఇవీ చదవండి:
హెచ్ఆర్ తప్పిదం.. ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్టు ఈమెయిల్
ఢిల్లీ పరిస్థితి మరీ ఇంత దారుణమా.. విమానం నుంచి కిందకు చూస్తే..