Japan: తండ్రి మృతదేహాన్ని రెండేళ్ల పాటు బీరువాలో దాచిన కొడుకు.. ఎందుకని అడిగితే..
ABN , Publish Date - Apr 27 , 2025 | 01:29 PM
అంత్యక్రియల ఖర్చు భరించలేక తండ్రి మృతదేహాన్ని రెండేళ్ల పాటు బీరువాలో దాచిపెట్టిన ఓ వ్యక్తి ఉదంతం ప్రస్తుతం జపాన్‌లో సంచలనంగా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: జపాన్‌లో తాజాగా షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. అంత్యక్రియల ఖర్చును భరించలేక ఓ వ్యక్తి తన తండ్రి మృతదేహాన్ని రెండేళ్ల పాటు బీరువాలోనే దాచి ఉంచాడు. ఇరుగుపొరుగుకు అనుమానం రావడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
టోక్యోకు చెందిన నొబుహికో సుజుకీ (53) స్థానికంగా ఓ చైనా ఆహార రెస్టారెంట్ నిర్వహిస్తుంటాడు. ఇటీవల కొన్ని రోజుల పాటు అతడు తన రెస్టారెంట్‌ను మూసిపెట్టాడు. అకారణంగా సుజుకీ ఇలా చేయడంతో ఇరుగుపొరుగుకు అనుమానం వచ్చి పోలీసులను పిలిపించారు. రెస్టారెంట్‌లో పోలీసులు తనిఖీ చేయగా ఓ బీరువాలో అతడి తండ్రి అస్థిపంజరం కనిపించింది. దీంతో అంతా అవాక్కయ్యారు. సుజీకీని అదపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అంత్యక్రియలకు డబ్బులు లేకే తండ్రి మృతదేహాన్ని బీరువాలో దాచిపెట్టినట్టు చెప్పుకొచ్చాడు. ఆయన 2023లోనే మరణించినట్టు తెలిపాడు. ‘‘నా వద్ద డబ్బులు లేవు. ఏం చేయాలో పాలుపోలేదు. అందుకే ఇలా చేశా’’ అంటూ పోలీసుల ముందు అతడు విషణ్ణ వదనంతో నిలబడ్డాడు.
అయితే, తండ్రి పెన్షన్ డబ్బుల కోసమే సుజుకీ ఇలా చేసుంటాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధుడి మరణానికి గల కారణాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంత్యక్రియల ఖర్చులు జపాన్‌లో అనేక మందికి తలకు మించిన భారంగా మారాయని స్థానిక మీడియా చెబుతోంది. అక్కడి సగటు ఖర్చు సుమారు 1.3 మిలియన్ యెన్‌లు. కొవిడ్ కాలం నాటితో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ జనాలు మాత్రం ఇప్పటికీ భారంగానే ఫీలవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అంత్యక్రియల్లో సంప్రదాయిక కార్యక్రమాలకు స్వస్తి చెప్పి సింపుల్ విధానాలవైపు మళ్లుతున్నారు. ఈ ఖర్చులు కనీసం 1 మిలియన్ యెన్‌ల లోపైనా ఉండాలని 60 శాతం మంది జనాలు అభిప్రాయపడ్డారు.
ఇదిలా ఉంటే, తల్లిదండ్రులు మరణించినా బయటకు పొక్కకుండా వారి సంతానం వృద్ధుల మృతదేహాలను దాచిపెట్టిన ఘటనలు గతంలోనూ అనేకం వెలుగు చూశాయి. 2023లో 56 ఏళ్ల వ్యక్తి ఒకరు తన తల్లి మృతిని బయటకు పొక్కకుండా చేసి చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఉద్యోగం లేని తనకు తల్లి పెన్షన్‌యే ఆధారం కావడంతో ఈ పని చేశానని పోలీసు ముందు అంగీకరించాడు.
ఇవి కూడా చదవండి:
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు