Share News

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన

ABN , Publish Date - Jul 29 , 2025 | 09:05 AM

ఐటీ రంగంలో ప్రస్తుతమున్న పరిస్థితులను కళ్లకు కట్టినట్టు వివరిస్తూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. టీసీఎస్‌లో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానమనుకునే వాళ్లమంటూ అతడు పెట్టిన పోస్టు జనాలను కదిలిస్తోంది.

TCS Layoffs: టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన
TCS layoffs 2025 AI impact

ఇంటర్నెట్ డెస్క్: టీసీఎస్ లేఆఫ్స్ తరువాత భారత ఐటీ రంగంలో భయాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. టాప్ ఐటీ కంపెనీలో జాబ్ అంటే స్థిరత్వం గ్యారెంటీ అన్న భరోసా మటుమాయం అయ్యింది. మొత్తం 12,200 మంది మిడ్ లెవెల్ ఉద్యోగులు ఈసారి లేఆఫ్స్‌లో భాగంగా జాబ్స్ కోల్పోనున్నారు. దీంతో, ఈ రంగంలో అనుభవజ్ఞులకు కూడా భరోసా లేదన్న విషయం స్పష్టమైపోయింది.

ఈ నేపథ్యంలో టెక్ రంగంలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చెబుతూ కోల్‌కతాకు చెందిన ఓ టెకీ లింక్డ్‌‌ఇన్‌‌లో పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

‘టీసీఎస్‌లో జాబ్ అంటే ప్రభుత్వ ఉద్యోగంతో సమానం అని ఒకప్పుడు అనుకునే వాళ్లం. భద్రమైన, స్థిరత్వంతో కూడిన జాబ్‌గా భావించే వాళ్లం. కానీ కాలం మారిపోయింది. ఏఐతో అనేక రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. బడా సంస్థలకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఈసారి లేఆఫ్స్‌లో ఎక్కువగా మధ్యస్థాయి, సీనియర్ లెవెల్ సిబ్బందిని తొలగించనున్నారు. ముఖ్యంగా సంప్రదాయక టెక్నాలజీలు, క్లయింట్‌లతో ప్రత్యక్షంగా సంబంధం లేని ఉద్యోగాలు, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ పొజిషన్లు ఈ ఏఐ జమానాలో ఉనికిని కోల్పోతున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.


దీనిపై ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా స్పందించారు. ‘టాటా గ్రూప్‌కు చెందిన సంస్థే 12 వేల మందిని తొలగించేందుకు సిద్ధమైందంటే మీరూ రెడీగా ఉండాలి. ఇకపై రిటైర్మెంట్ ఏజ్ అంటే 60 ఏళ్లు కాదు.. 45 అని గుర్తించాలి’ అని కామెంట్ చేశారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొన్ని సూచనలు కూడా చేశారు. 12 నెలల పాటు జాబ్ లేకపోయినా సాఫీగా ఉండేందుకు సరిపడా అత్యవసర నిధిని సిద్ధం చేసుకోవాలని అన్నారు. కార్పొరేట్ ఇన్సూరెన్స్‌ ఉన్నా వ్యక్తిగత ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్సులు తప్పనిసరిగా తీసుకోవాలి తెలిపారు. నిత్యం కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని కూడా సూచించారు. ‘ఏఐ వల్ల జాబ్స్ పోవట్లేదు. ఏఐ వినియోగించలేక జాబ్స్‌ను పోగొట్టుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. చిన్న వయసులో రిటైర్‌మెంట్‌కు రెడీగా ఉండాలని కూడా చెబుతున్నారు. ఈఎమ్ఐ‌లు, పిల్లల చదువులు భారం కాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు.

2026 మార్చ్ కల్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 6,13,000 ఉద్యోగుల్లో సుమారు 2 శాతం మందిని తీసేస్తామని టీసీఎస్ ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్తులో రానున్న మార్పులకు సిద్ధమయ్యేందుకు ఈ చర్యలు తప్పడం లేదని పేర్కొంది. టెక్ స్టాక్స్‌లో మార్పులు, సిబ్బంది పునర్వ్యవస్థీకరణలో భాగంగా లేఆఫ్స్ అని వెల్లడించింది.


ఇవీ చదవండి:

భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్

తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్

Read Latest and Viral News

Updated Date - Jul 29 , 2025 | 09:30 AM