‘క్రూయిజ్’ కొండెక్కింది...
ABN , Publish Date - Apr 27 , 2025 | 12:35 PM
కొండ అంచుదాకా వచ్చి నిలిచిపోయిన క్రూయిజ్ షిప్... చూడటానికి భలేగా ఉంది కదూ.. కానీ సముద్రంలో ఉండాల్సిన షిప్ కొండపైకి ఎలా చేరింది? సముద్రంలో లంగరు వేయాల్సిన భారీ నౌకను కొండపైకి ఎవరు చేర్చారు? అది తెలియాలంటే దక్షిణకొరియా తూర్పు తీరంలోని జియోంగ్‌డాంగ్‌జిన్‌లో ఉన్న రిసార్టును సందర్శించాల్సిందే.

క్రూయిజ్‌లో ప్రయాణం అంటే కాస్త ఖరీదైన వ్యవహారమే. అయితే తక్కువ ఖర్చులో క్రూయిజ్‌లో ప్రయాణించిన అనుభూతిని సొంతం చేసుకోవాలంటే సన్ క్రూయిజ్ రిసార్టులో బస చేస్తే చాలు. ఎక్కడైనా సరే, పర్యాటకులను ఆకర్షించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు రిసార్టు యజమానులు. దక్షిణకొరియాలోని జియోంగ్‌డాంగ్‌జిన్‌లో ఒకరు తన రిసార్టుని క్రూయిజ్ షిప్ మోడల్‌లో నిర్మించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రత్యేకంగా షిప్‌యార్డులో దీన్ని తయారుచేయించారు. ఆయన శ్రమ వృథా కాలేదు. ఆ హోటల్ రాత్రుళ్లు విద్యుద్దీపాల కాంతుల్లో వెలుగులీనుతూ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఏకైక హోటల్...
క్రూయిజ్‌ను పోలిన ఈ రిసార్టులో చాలా విశేషాలే ఉన్నాయి. 500 అడుగుల పొడవు, 150 అడుగుల ఎత్తులో ఉంటుందీ క్రూయిజ్. ఇందులో మొత్తం 211 రూములున్నాయి. 6 ఫంక్షన్ గదులు, కొరియన్, యూరోపియన్ రుచులను అందించే 6 రెస్టారెంట్లు ఉన్నాయి. టాప్‌ఫ్లోర్‌లో 360 డిగ్రీలు తిరిగే బార్ కూడా ఉంది. పై ఫ్లోర్ నుంచి సూర్యోదయం, సూర్యాస్తమయం అందాలు చూసి తీరాల్సిందే. వాలీబాల్ కోర్ట్, ఫిట్‌నెస్ క్లబ్, స్విమ్మింగ్‌పూల్స్, గోల్ఫ్ రేంజ్.... ఇలా సకల సదుపాయాలు రిసార్ట్‌లో అందుబాటులో ఉంటాయి. మొత్తంగా ఇదొక భూతల స్వర్గం. హోటల్ గదుల్లో నుంచి సముద్రపు అందాలు కట్టిపడేస్తాయి. అలల శబ్దాలు గదుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. దీనివల్ల నిజంగా క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న భావన కలుగుతుంది. ఇందులో బస చేయడం ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని అంటారు పర్యాటకులు. ప్రపంచంలో క్రూయిజ్ షిప్ మోడల్‌లో ఉన్న ఏకైక హోటల్ ఇదే.
స్వర్గానికి మెట్లు...
ఈ రిసార్టులో సన్‌క్రూయిజ్ పక్కనే మరో షిప్పును నిర్మించారు. దాని పేరు బీచ్ క్రూయిజ్. ఇది ప్రత్యేకమైన ‘పూల్ విల్లా’లను కలిగి ఉంటుంది. అంటే ప్రతి గదికి ఒక ప్రైవేటు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. రిసార్టులో 360 డిగ్రీల కోణంలో తిరిగే రొటేటింగ్ స్కైలాంజ్ అదనపు ఆకర్షణ. ఇక్కడ కూర్చుని కాఫీ సిప్ చేస్తూ సముద్రపు అందాలు వీక్షించడం మధురానుభూతిగా మిగిలిపోతుంది. అవుట్‌డోర్ ఇన్ఫినిటీ పూల్‌లో ఈత కొట్టడం ఛాలెంజింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఈ రిసార్టు ‘హ్యాండ్స్ ఆఫ్ ప్రామిస్’కు ప్రసిద్ధి.
అదేవిధంగా అబ్జర్వేషన్ డెక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దాన్ని చేరుకోవాలంటే గాజుతో చేసిన మెట్లపై నుంచి వెళ్లాల్సి ఉంటుంది. దీన్ని ‘స్టెయిర్‌కేస్ టు హెవెన్’ (స్వర్గానికి మెట్లు) అని కూడా పిలుస్తారు. ఇక్కడి నుంచి చూస్తే సముద్రపు అందాలు కనువిందు చేస్తాయి. పర్యాటకులు ఈ మెట్లపై సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతుంటారు. మొత్తానికి సముద్ర అలలపై కదిలే క్రూయిజ్ ప్రయాణం అనుభూతి ఒకరకంగా ఉంటే... కొండ చివరి అంచున నిర్మించిన ఈ క్రూయిజ్ రిసార్ట్‌లో బస మధురానుభూతుల్ని అందిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ దందాల కవితకు రాహుల్ పేరెత్తే అర్హత లేదు
పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్ బాధితుడు
జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ
Read Latest Telangana News and National News