Share News

ఏ సమస్యకైనా ‘బామ్మ’ భరోసా..

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:49 AM

బామ్మ ఉంటే... పిల్లలకు తోడుగా ఉండేది. బామ్మ ఉంటే... ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ పెద్దది కాకుండా చూసేది. ఇలాంటప్పుడు బామ్మ ఉంటే బాగుండేది... ఇలా అనుకునే సందర్భాలు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బామ్మ లేని వాళ్లు ఏదో ఒక సమయంలో ఇలా కచ్చితంగా ఫీలవుతారు.

ఏ సమస్యకైనా ‘బామ్మ’ భరోసా..

బామ్మ ఉంటే... పిల్లలకు తోడుగా ఉండేది. బామ్మ ఉంటే... ఇద్దరికీ సర్దిచెప్పి గొడవ పెద్దది కాకుండా చూసేది. ఇలాంటప్పుడు బామ్మ ఉంటే బాగుండేది... ఇలా అనుకునే సందర్భాలు అందరికీ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా బామ్మ లేని వాళ్లు ఏదో ఒక సమయంలో ఇలా కచ్చితంగా ఫీలవుతారు. అలాంటి వారి కోసం ‘ఓకే గ్రాండ్‌మా’ పేరుతో జపాన్‌లో బామ్మలను అద్దెకు ఇస్తున్నారు. వినడానికి కొత్తగా ఉన్నా... ఇప్పుడు అక్కడ అద్దె బామ్మల సర్వీసే హాట్‌ టాపిక్‌...

బామ్మ ఉన్న ఇంట్లో సందడే వేరు. చాలా సమస్యలను పెద్దరికంతో చిటికెలో చక్కబెట్టేస్తుంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులైతే... పిల్లల ఆలనాపాలనా చూసుకోవడం కోసం ముందుగా గుర్తొచ్చేది బామ్మే. తన అనుభవాన్ని రంగరించి, ఓదార్పు మాటలు చెబుతుంది. ధైర్యాన్ని నింపుతుంది. కూర రుచిగా ఉండాలంటే ఏం చేయాలో చిట్కాలు చెబుతుంది.


బామ్మ లేని వారిని అడిగితే... ఆమె లేని లోటు ఏంటో స్పష్టంగా చెబుతారు. సరిగ్గా ఈ విషయాన్నే వ్యాపార అంశంగా మలుచుకుంది జపాన్‌లోని ‘క్లయింట్‌ సర్వీసెస్‌’ అనే సంస్థ. అహంకారం, అసంతృప్తి, అలజడి, అవగాహనలేమి నెలకొన్న ఈ కాలం యువతరానికి ఒక భరోసానిస్తూ... ‘ఓకే గ్రాండ్‌మా’ పేరుతో తెలివిగా బామ్మలను అద్దెకు ఇచ్చే సర్వీసును ప్రారంభించింది. హౌజ్‌ క్లీనింగ్‌, చైల్డ్‌కేర్‌ వంటి సేవలను అందిస్తున్న ఈ సంస్థ ‘ఓకే గ్రాండ్‌మా’ పేరుతో బామ్మలను అద్దెకు ఇచ్చే సర్వీసును ప్రారంభించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


పనికి తగ్గ బామ్మ

జపాన్‌లో ఒకరకంగా వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. అయితే వారి జీవితానుభవాన్ని వ్యాపారంగా మార్చొచ్చనే ఆలోచనతో రూపు దిద్దుకున్నదే ‘ఓకే గ్రాండ్‌మా’ సర్వీస్‌. అంటే బామ్మ ఒక కుటుంబానికి ఎన్నో విధాలుగా పనికొస్తుందన్నమాట. ఉదాహరణకు భార్యా భర్తలు ఇద్దరూ బిజీగా ఉండి ఏదైనా ఫంక్షన్‌కు హాజరుకాలేకపోతున్న సందర్భంలో గ్రాండ్‌మా సర్వీసును ఎంచుకుంటారు. వాళ్ల తరపున అద్దె బామ్మను పంపిస్తూ... ఫంక్షన్‌కు ఎవరూ హాజరు కాలేదనే మాట రాకుండా చూసుకుం టున్నారు.


city4.2.jpg

ఏదైనా సందర్భంలో ఇతరులకు సారీ చెప్పాల్సి వచ్చినప్పుడు, వారిని సముదాయించాలని అనుకుంటే కూడా అద్దె బామ్మను ఉపయోగించుకుంటున్నారు. ఉద్యోగం వదిలేయాల్సి వచ్చిన సందర్భంలో బాస్‌తో మాట్లాడటానికి ఇబ్బంది పడినప్పుడు అద్దె బామ్మను పంపించి పని చక్కబెట్టు కుంటున్నారు. ఇంట్లో భార్యాభర్తల నడుమ బేధాభిప్రాయాలు తలెత్తి, వాతావరణం సీరియస్‌గా మారినప్పుడు బామ్మ సర్వీస్‌ను ఎంచుకుంటున్న వారూ ఉన్నారు. ఇలాంటి సందర్భాలలో బామ్మ పరిస్థితులను చక్కదిద్దడంలో సహాయపడుతోంది.


60 నుంచి 94 ఏళ్ల బామ్మలు...

మోరల్‌ సపోర్టు కోసం బామ్మ సర్వీసును ఎంచుకుంటున్న వారూ ఉన్నారు. ‘‘బాయ్‌ ఫ్రెండ్‌కు బ్రేకప్‌ చెప్పాలనుకుంటున్నాను. కానీ నేను ఒక్కదాన్నే వెళ్లి చెప్పలేను. అందుకే బామ్మను వెంట తీసుకెళ్లాను’’ అని అంటారు ‘ఓకే గ్రాండ్‌మా’ సర్వీసును ఉపయోగించుకున్న ఒక యువతి.సంప్రదాయ వంటలు వండేందుకు, పిల్లలకు కథలు చెప్పేందుకు బామ్మలను తీసుకెళ్లే వారూ ఉన్నారు. ‘‘నాకు బంధువులు ఎక్కువగా లేరు. ఫ్యామిలీ మెంబర్‌గా కాస్త హడావిడి చేయడానికి బామ్మను హైర్‌ చేసుకున్నాను’’ అని చెబుతున్నారు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మరో యువకుడు.


60 నుంచి 94 ఏళ్ల వరకు ఏ వయస్సు బామ్మ కావాలో కస్టమర్‌ తన పనిని బట్టి ఎంపిక చేసుకోవచ్చు. కస్టమర్‌ అవసరం గురించి చెబితే సంస్థ అందుకు తగిన బామ్మను ఎంపిక చేసి పంపడంలోనూ సహాయపడుతుంది. సందర్భానుసారంగా ఎలా మసలుకోవాలో తెలిసిన వారినే ‘క్లయింట్‌ సర్వీసెస్‌’ సంస్థ బామ్మలుగా నియమించుకుంటోంది. ప్రస్తుతం వంద మందికి పైగా బామ్మలు ఈ సంస్థలో పనిచేస్తున్నారు. బామ్మ సర్వీసు కావాల్సినవారు గంటకు సుమారు రూ. 2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రవాణా ఛార్జీలు, వారితో ఉన్న సమయంలో... వారి తిండి బాధ్యత చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి అద్దె బామ్మల సేవ భలేగా ఉంది కదూ!

Updated Date - Aug 03 , 2025 | 08:49 AM