Rare Cat Breeds: ఇవి.. పిల్లులే అంటే నమ్ముతారా..
ABN , Publish Date - Jul 27 , 2025 | 08:06 AM
ఇంట్లో పిల్లి... వీధిలో పులి... అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. నిజానికి చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా ఆకారాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. కొద్దిగా రంగులో తేడా ఉన్నా మనకు తెలిసిన పిల్లి ఒకేలా ఉంటుంది. అయితే పులుల్లాంటి పిల్లులు కూడా ఉంటాయంటే నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా అరుదైన రకాలు చాలానే ఉన్నాయి.

ఇంట్లో పిల్లి... వీధిలో పులి... అనే మాట అప్పుడప్పుడు వినిపిస్తుంది. నిజానికి చూడటానికి రెండూ ఒకేలా ఉన్నా ఆకారాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు. కొద్దిగా రంగులో తేడా ఉన్నా మనకు తెలిసిన పిల్లి ఒకేలా ఉంటుంది. అయితే పులుల్లాంటి పిల్లులు కూడా ఉంటాయంటే నమ్ముతారా? ప్రపంచవ్యాప్తంగా అరుదైన రకాలు చాలానే ఉన్నాయి. అంతరించిపోయే దశలో ఉన్న అలాంటి పిల్లులను సంరక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అలాంటి కొన్ని అరుదైన పిల్లులివి...
చిన్నపాటి పులి..
ప్రపంచంలోని అరుదైన పిల్లులలో ‘సుమత్రన్ టైగర్’ ఒకటి. దీన్ని ‘సుండా టైగర్’ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోనే చిన్న పులిగా సుమత్రన్ టైగర్‌కు గుర్తింపు ఉంది. దీని జీవితకాలం 15 ఏళ్లు. ఇండోనేషియా ద్వీపం అయినటువంటి సుమత్రలో మాత్రమే కనిపిస్తుంది. ఆ దీవి పేరే ఈ పిల్లికి స్థిరపడింది. ప్రస్తుతం వీటి సంఖ్య 400 వరకు ఉంటుందని అధికారుల అంచనా. ఇవి ఒక ఏడాది వయస్సు రాగానే వేటాడటం ప్రారంభిస్తాయి. రెండేళ్ల వయసు వచ్చే వరకు తల్లితో ఉంటాయి. నల్లటి చారలు కలిగి ఉంటాయి. పది మీటర్ల వరకు దూకుతాయి. వీటి చర్మానికి గిరాకీ ఎక్కువ. వేటగాళ్ల వల్ల ఇవి అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.
సంఖ్య పెరిగింది..
మీడియం సైజులో ఉండే అడవి పిల్లి ‘ఐబీరియన్ లింక్స్’. పోర్చుగల్, స్పెయిన్‌తో పాటు నైరుతి ఐరోపా దేశాల్లో కనిపిస్తుంది. మగ పిల్లులు సగటున 12 నుంచి 14 కిలోల వరకు, ఆడ పిల్లులు 9 నుంచి 10 కిలోల బరువుంటాయి. కాళ్లు దృఢంగా ఉండి, పదునైన పంజాతో పాటు చిన్న, మొండి తోక, నిక్కబొడుచుకున్న చెవులతో ఉంటుంది. శరీరంపై ముదురు మచ్చలు ఉంటాయి. కుందేళ్లను వేటాడతాయి. నక్కలు, తోడేళ్లు, అడవి కుక్కలు వీటికి ప్రధాన శత్రువులు. 2021లో చేపట్టిన సర్వేలో 1111 ఐబీరియన్ లింక్స్ ఉన్నట్టు వెల్లడయింది. 25 ఏళ్ల క్రితం వీటి సంఖ్య 100 మాత్రమే ఉండేది. అధికారులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇవ్వడంతో వాటి సంఖ్య పెరిగింది.
పిల్లి కోసం ప్రత్యేక దినోత్సవం
‘వరల్డ్ అరేబియన్ లియోపార్డ్ డే’ గురించి ఎప్పుడైనా విన్నారా? ఏటా ఫిబ్రవరి 10న ఈ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అరేబియన్ ద్వీపకల్పంలో మిగిలి ఉన్న ఒకే ఒక్క పెద్ద పిల్లి ఇది. 20 నుంచి 30 కిలోల బరువుంటాయి. జీవితకాలం 14 నుంచి 19 ఏళ్లు. పందులు, నక్కలు, పాములు, బల్లులను ఆహారంగా తీసుకుంటుంది. చిరుతపులికి చెందిన ఉపజాతులలో అరేబియన్ లియోపార్డ్ కూడా ఒకటి. సౌదీ అరేబియా, ఒమన్, యెమన్, ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం 100 నుంచి 120 వరకు మాత్రమే ఉన్నాయన్నది అధికారుల అంచనా.
నది పేరుతో...
రెండు దేశాల సరిహద్దుల్లో ప్రవహించే ఓ నది పేరు పిల్లికి పెట్టడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రష్యా, చైనా సరిహద్దుల్లో ‘అముర్’ నది ప్రవహిస్తుంది. ఈ నది పేరుని అంతరించిపోయే దశలో ఉన్న పెద్ద పిల్లి జాతుల్లో ఒకటైన ‘అముర్ లియోపార్డ్’కు పెట్టారు. చిరుతపులికి చెందిన ఎనిమిది ఉపజాతులలో అముర్ లియోపార్డ్ ఒకటి. ఇవి సగటున 36 కేజీల బరువుంటాయి. కుందేళ్లను ఆహారంగా తీసుకుంటాయి. పరిశోధకులు ఈ పిల్లిని ‘సైలెంట్ కిల్లర్’’ అని పిలుస్తారు. ఇవి తూర్పు రష్యా, ఉత్తర చైనాలో కొండ ప్రాంతాలలో కనిపిస్తాయి. పిల్లి ఎముకలు దేనికీ పనికిరావు అని అంటారు. కానీ అముర్ లియోపార్డ్ ఎముకలు మాత్రం చాలా ఖరీదైనవిగా గుర్తింపు పొందాయి. ఎందుకంటే వీటి ఎముకలను సంప్రదాయ ఔషధ తయారీలో వాడుతుంటారు. ఈ పిల్లి అందమైన మచ్చల చర్మాన్ని కలిగి ఉంటుంది. ఇవి వాటి బరువు కన్నా మూడు రెట్లు ఎక్కువ బరువున్న జంతువులను వేటాడతాయి. జింక, పందిని వేటాడతాయి. అవి దొరక్కపోతే కుందేళ్లు, ఎలుకల్ని తింటాయి. వేటగాళ్ల ఉచ్చుకు బలైపోతుండటం వల్ల ఈ పిల్లి అంతరించిపోయే స్థితికి చేరుకుంది.
తల చదునుగా...
‘ఫ్లాట్ హెడెడ్ క్యాట్’ తల (పుర్రె భాగం) చదునుగా ఉంటుంది. అందుకే ఆ పేరు స్థిరపడింది. ఇది తీక్షణమైన దృష్టిని కలిగి ఉంటుంది. చేపలను వేటాడి తింటుంది. కళ్లు పెద్దగా, చెవులు చిన్నగా ఉంటాయి. బూడిదరంగు శరీరాన్ని కలిగి ఉంటుంది. నదీ తీరాల వెంట జీవనం సాగిస్తుంది. జీవితకాలం 14 ఏళ్లు. మలేషియా, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లో కనిపిస్తుంది. వ్యవసాయం కోసం అడవులను నరికివేయడం వల్ల ఈ పిల్లి అంతరించిపోయే దశకు చేరింది.
ఒళ్లంతా జుట్టే...
స్కాటిష్ హైల్యాండ్స్‌లో మాత్రమే కనిపించే అడవి పిల్లి ‘స్కాటిష్’ వైల్డ్‌క్యాట్. సాధారణ పిల్లితో పోలిస్తే ఇది భారీకాయాన్ని కలిగి ఉంటుంది. వీటి జీవితకాలం 15 ఏళ్లు. ఈ వైల్డ్‌క్యాట్ ఒక చదరపు సెంటీమీటరు స్థలంలో 30 వేలకు పైగా వెంట్రుకలు కలిగి ఉంటుంది. కుందేళ్లు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. బుగ్గలు, కాళ్లపై చారలు కలిగి ఉంటుంది.
అక్కడ పవిత్రమైనది...
దక్షిణ అమెరికాలోని ఆండిస్ పర్వతశ్రేణుల్లోని ఎతైన ప్రదేశాలలో ‘ఆండియన్ మౌంటెన్ క్యాట్’ కనిపిస్తుంది. చలిని తట్టుకునేందుకు మందపాటి జుట్టు ఉంటుంది. బొలీ వియా, పెరూ, చిలీ దేశాల్లో కొంతమంది ఆండియన్ క్యాట్‌ని పవిత్ర జంతువుగా విశ్వసిస్తుంటారు. పెరూ, బొలీవియా, చిలీ, అర్జెంటీనాలో ఎక్కువగా చూడొచ్చు.
మంచు ప్రాంతంలో...
హిమాలయ పర్వత శ్రేణుల్లో కనిపించే పెద్ద పిల్లి ‘స్నో లియోపార్డ్’. వీటి సంఖ్య సుమారు పదివేల వరకు ఉంటుందని అంచనా. దృఽడమైన కాళ్లు ఉండటం వల్ల ఎక్కువ దూరం దూకగలుగుతుంది. వీటికి శత్రువు మనిషే అని చెప్పొచ్చు. మృదువైన, మందపాటి జుత్తు కలిగి ఉంటుంది. దీన్ని రగ్గుల తయారీలో వాడతారు. ఇది ఎక్కువగా ఒంటరిగానే గడుపుతుంది. ఈ పిల్లిని వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో చేర్చారు. దీన్ని వేటాడినా, అమ్ముతూ పట్టుబడినా భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లలో ఈ మంచు పిల్లి ఎక్కువగా కనిపిస్తుంది.
బోర్నియా దీవిలో...
ప్రపంచంలోనే నిగూఢమైన పిల్లి జాతులలో ‘బోర్నియో బే’ క్యాట్ ఒకటి. ఎరుపు రంగు శరీరం, పసుపు రంగు కళ్లు, పొడవైన తోక ఉంటుంది. చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. అంతరించిపోతున్న పిల్లి జాతుల్లో ఇదొకటి. బోర్నియోకు చెందిన ఏకైక పిల్లి జాతి బే క్యాట్. ఈ పిల్లి బోర్నియా దీవిలో మాత్రమే కనిపిస్తుంది. అటవీ ప్రాంతంలో ఉంటుంది. ఈ దీవిలో అటవీ విస్తీర్ణం 50శాతానికి పైగా తగ్గడంతో వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. బే క్యాట్ సైతం ఆ జాబితాలో ఉంది.
జపాన్ దీవిలో ...
ఇష్టంగా పెంచుకునే పెట్స్‌కి రకరకాల పేర్లు పెట్టుకుంటుంటారు. కానీ జపాన్‌లోని ‘ఇరియోమోట్’ అని పిలిచే దీవి పేరును ఏకంగా ఒక పిల్లికి పెట్టారు. ఎందుకంటే ఆ దీవిలో మాత్రమే కనిపించే పిల్లి అది. అంతేకాదు ప్రపంచంలోనే అరుదైన పిల్లిగా ఇరియోమోట్ క్యాట్‌కు గుర్తింపు ఉంది. ఈ దీవి చాలా చిన్నగా, తీరానికి దూరంగా ఉంటుంది. ప్రస్తుతం ఆ దీవిలో సుమారు వంద వరకు ఇరియోమోట్ పిల్లులున్నాయి. ఇవి గోధుమ లేదా బూడిద రంగు వెంట్రుకలు, శరీరంపై నల్లమచ్చలతో, లావు తోక కలిగి ఉంటాయి. చిత్తడి నేలలు, చిన్న చిన్న కొండలపై, బీచ్‌లలో ఎక్కువగా కనిపిస్తాయి. రోడ్డు ప్రమాదాలు, కుక్కల దాడుల వల్ల వీటి జాతి అంతరించి పోయే ప్రమాదంలో ఉంది. ఇరియోమోట్ పిల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాల్లో ప్రమాదాలు జరగకుండా అధికారులు సైన్‌బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.