Actress Humaira Asghar: మిస్టరీగా నటి మరణం.. 9 నెలల తర్వాత బయటపడ్డ శవం..
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:51 PM
Actress Humaira Asghar: హుమైరా తల్లిదండ్రులు ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని, డెడ్ బాడీతో తమకు సంబంధం లేదని హుమైరా తండ్రి తేల్చి చెప్పాడు. అంత్యక్రియలు చేయనని కూడా అన్నాడు.

ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్గర్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన సంగతి తెలిసిందే. అద్దె ఇంట్లో బాగా కుళ్లిన స్థితిలో ఆమె మృతదేహం లభించింది. నటి మృతదేహానికి తాజాగా పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. నటి 9 నెలల క్రితం చనిపోయి ఉండొచ్చని ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అభిప్రాయపడ్డాడు. 2024 అక్టోబర్ నెలలో ఆమె చనిపోయి ఉండొచ్చని అన్నాడు. అందుకే డెడ్ బాడీ బాగా కుళ్లిపోయి ఉందని చెప్పాడు.
హుమైరా మరణంపై డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సయ్యద్ అసద్ రజా మాట్లాడుతూ..‘మేము ఆమె కాల్ డేటా సేకరించాము. ఆమె చివరి ఫోన్ కాల్ 2024 అక్టోబర్ నెలలో రికార్డు అయింది. పొరిగింటి వాళ్లు ఆమెను చివరగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో చూశారు. తర్వాతినుంచి ఆమె కనిపించలేదు. 2024లోనే ఆమె ఇంటికి కరెంట్ కనెక్షన్ కట్ అయింది. బిల్లు కట్టకపోవటంతో కనెక్షన్ కట్ చేశారు’ అని చెప్పారు. మరో అధికారి మాట్లాడుతూ.. ‘ఇంట్లోని జార్లన్నీ దుమ్ముపట్టిపోయి ఉన్నాయి. ఆహారం ఆరు నెలల క్రితమే ఎక్స్‌పైర్ అయింది.
ఫిబ్రవరి నెల వరకు ఆమె ఉండే ఫ్లోర్‌లోని ఇళ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో కొత్త వ్యక్తులు అద్దెకు దిగే సమయానికి దుర్వాసన తగ్గిపోయింది. దానికి తోడు ఆమె ఇంటి బాల్కనీ తలుపులు తెరిచి ఉన్నాయి. గాలి ప్రసారం బాగా జరుగుతోంది. పెద్దగా బయటకు రావటం లేదు. నీటి వాడకం కూడా లేదు. ఇంటి పైపులు తుప్పుపట్టిపోయి ఉన్నాయి’అని వెల్లడించారు. ఇక, హుమైరా తల్లిదండ్రులు ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించారు. తమ కూతురు ఎప్పుడో చనిపోయిందని, డెడ్ బాడీతో తమకు సంబంధం లేదని హుమైరా తండ్రి తేల్చి చెప్పాడు. అంత్యక్రియలు చేయనని కూడా అన్నాడు.
ఇవి కూడా చదవండి
9 మంది ప్రయాణికుల్ని కిడ్నాప్ చేసి, ఆపై హత్య..
టెన్నిస్ ప్లేయర్ హత్య.. ఆ మ్యూజిక్ వీడియోనే కారణం..