Humaira Asghars Last Rites: నటి గొప్ప మనసు.. తోటి నటి హుమైరా అంత్యక్రియలు చేస్తానంటూ..
ABN , Publish Date - Jul 12 , 2025 | 12:46 PM
Humaira Asghars Last Rites: హుమైరా అస్గర్ 9 నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అభిప్రాయపడ్డాడు. 2024 అక్టోబర్ నెలలో ఆమె చనిపోయి ఉండొచ్చని అన్నాడు.

ప్రముఖ పాకిస్థానీ నటి హుమైరా అస్గర్ కరాచీలోని అద్దె ఇంట్లో కుళ్లిన స్థితిలో శవమై కనిపించిన సంగతి తెలిసిందే. పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె శవానికి పోస్టుమార్టం పూర్తయింది. పోలీసులు హుమైరా శవాన్ని ఆమె కుటుంబానికి అప్పగించాలని చూశారు. అయితే, హుమైరా తండ్రి ఇందుకు నిరాకరించాడు. తమకు, తమ కూతురికి సంబంధాలు ఎప్పుడో తెగిపోయాయని ఆయన అన్నాడు. హుమైరాకు అంత్యక్రియలు నిర్వహించటం కుదరదని తేల్చి చెప్పాడు.
దీంతో హుమైరా శవం మార్చురీ రూములో అనాథ శవంలా మిగిలిపోయింది. ఇలాంటి సమయంలో తోటి నటి మంచి మనసు చాటుకుంది. హుమైరా శవానికి అంత్యక్రియలు చేయడానికి ముందుకు వచ్చింది. పాకిస్తాన్ నటి సోన్యా హుస్సేన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఆ వీడియోలో .. ‘రేపటి వరకు వేచి ఉండమని అధికారులను వేడుకుంటున్నాను. వారి కుటుంబం నుంచి ఎవ్వరూ ముందుకు రాకపోతే.. నేను అంత్యక్రియలు నిర్వహిస్తాను. ఒక సోదరిగా ఆమె అంత్యక్రియలు చేస్తాను. థాంక్యూ’ అని అంది. అయితే, మరుసటి రోజు హుమైరా కుటుంబం కరాచీ చేరుకుంది. పోలీసులు హుమైరా సోదరుడికి మృతదేహాన్ని అప్పగించారు. ఇందుకు సంబంధించిన అప్‌డేట్ కూడా ఆమె తన ఇన్‌స్టాలో ఇచ్చింది.
9 నెలల క్రితమే మరణం..
హుమైరా అస్గర్ 9 నెలల క్రితమే చనిపోయి ఉండొచ్చని ఆమె మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన ఫోరెన్సిక్ పాథాలజిస్ట్ అభిప్రాయపడ్డాడు. 2024 అక్టోబర్ నెలలో ఆమె చనిపోయి ఉండొచ్చని అన్నాడు. ఎక్కువ కాలం అవ్వటంతో శవం బాగా కుళ్లిపోయి ఉందని చెప్పాడు. ఎముకలు కూడా బాగా పాడయ్యాయని, తాకితే విరిగిపోతున్నాయని అన్నాడు. మెదడు కూడా పూర్తిగా కుళ్లిపోయిందని, శరీరంలోని ఇతర అవయవాలు నల్లటి కుప్పలా మారిపోయాయని వెల్లడించాడు. అయితే, ఆమె మరణానికి గల కారణం ఏంటో తెలియరాలేదని అన్నాడు. మొత్తానికి హుమైరా మరణం మిస్టరీగా మారింది.
ఇవి కూడా చదవండి
ఫోన్ దొంగతనం.. కట్ చేస్తే భార్య ఎఫైర్ బయటపడింది..
వీధి కుక్కలకు మహర్దశ.. 2 కోట్లతో కొత్త స్కీమ్..