Share News

Doomsday Fish: నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?

ABN , Publish Date - Jun 18 , 2025 | 06:08 PM

Doomsday Fish: కొద్దిరోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్ సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Doomsday Fish: నీటిపైకి ఓర్ చేప.. ప్రళయం రాబోతోందా?
Doomsday Fish

ఓర్ ఫిష్.. చాలా పొడువుగా.. చూడ్డానికి ఎంతో అందంగా కనిపించే ఈ చేప సముద్రపు అట్టడుగుల్లో నివసిస్తూ ఉంటుంది. సముద్రపు అడుగుల్లో ఉండే ఈ చేప అత్యంత అరుదుగా బయటకు వస్తుంది. ఈ చేప నీటి ఉపరితలం మీదకు వచ్చిందంటే చాలు.. మీడియాలో, సోషల్ మీడియాలో రచ్చ మొదలవుతుంది. ఎందుకంటే.. ఈ చేప నీటిపైన కనిపిస్తే ఏదో కీడు జరుగుతుందన్న నమ్మకం ఉంది. అందుకే ఈ చేపను డూమ్స్‌డే చేప అని కూడా పిలుస్తారు. డూమ్స్‌డే అంటే ప్రళయదినం అని అర్థం ఉంది. యుద్ధాలు, కరువులు, భూకంపాలు వచ్చే ముందు ఈ చేప నీటి ఉపరితలం మీదకు వస్తుందని కొన్ని ప్రాంతాల ప్రజల నమ్మకం.


2025, మే నెల నుంచి ఇప్పటి వరకు ఈ డూమ్స్‌డే చేప నాలుగు సార్లు నీటి ఉపరితలం మీదకు వచ్చింది. తాజాగా, తమిళనాడుకు చెందిన జాలర్లుకు ఈ చేప చిక్కింది. అది దాదాపు 30 అడుగుల పొడవు ఉంది. దాన్ని పట్టుకోవడానికి ఏడు మంది కష్టపడాల్సి వచ్చింది. ఓర్ చేప తమిళ జాలర్లకు చిక్కిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. త్వరలో ఏదో విపత్తు రాబోతోందంటూ నెటిజన్లు భయపడుతున్నారు.


కొద్దిరోజుల క్రితం తస్మానియాలోనూ ఓర్ ఫిష్ కనిపించింది. సిబిల్ రాబర్ట్ సన్ అనే వ్యక్తి తస్మానియా సముద్ర తీరంలో ఆ చేపను చూశాడు. మూడు మీటర్ల పొడువు ఉన్న ఆ చేపకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పుడు కూడా పెద్ద చర్చ జరిగింది. న్యూజిలాండ్ సముద్ర తీరంలో అయితే ఏకంగా రెండు చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. ఆ రెండూ చనిపోయి ఉన్నాయి. వాటిలో ఒకటి తల లేకుండా ఉంది. వాటిని చూసిన జనం ఏదో విపత్తు రాబోతుందంటూ భయపడిపోయారు.


ఇవి కూడా చదవండి

కమల్ కౌర్ హత్య.. పోస్టుమార్టం రిపోర్టులో బయటపడ్డ కీలక విషయాలు..

పెళ్లై 70 ఏళ్లు.. భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు..

Updated Date - Jun 18 , 2025 | 06:23 PM