ఇవి గ్రహాంతర గృహాలు కాదు...
ABN , Publish Date - Jun 08 , 2025 | 01:50 PM
మండువా ఇళ్ల గురించి వినే ఉంటారు. డ్యూప్లెక్స్ విల్లాలను చూసే ఉంటారు. కానీ బంతిలా గుండ్రంగా ఉండే ఇళ్లను ఎక్కడైనా చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అలాంటి నివాసగృహాలు నెదర్లాండ్స్‌లో ఉన్నాయి.

మండువా ఇళ్ల గురించి వినే ఉంటారు. డ్యూప్లెక్స్ విల్లాలను చూసే ఉంటారు. కానీ బంతిలా గుండ్రంగా ఉండే ఇళ్లను ఎక్కడైనా చూశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా అలాంటి నివాసగృహాలు నెదర్లాండ్స్‌లో ఉన్నాయి. గోళాకారంలో ఉన్న ఈ నిర్మాణాలను చూస్తే అవి మనుషులు నివసించే ఇళ్లని ఎవరూ అనుకోరు. అంతరిక్షనౌకలను పోలి ఉండే ఆ ఇళ్లను ఎవరు నిర్మించారు? ఎందుకు నిర్మించారు?
ఒకదాని పక్కన ఒకటి వరుసగా యాభై నిర్మాణాలు. గోళాకారంలో ఉన్న వాటిని చూస్తే గ్రహాంతరవాసుల కోసమా అనే అనుమానం వస్తుంది. వాటిలో మనుషులు నివసించడం సాధ్యమేనా అనిపిస్తుంది. అలాంటి ఇళ్లను ఇంతకుముందు ఎక్కడా చూసి కూడా ఉండరు. ఈ బంతుల్లాంటి ఇళ్లు నెదర్లాండ్స్‌లో కనిపిస్తాయి. 1968లో నెదర్లాండ్స్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతో గృహ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందించాలని నిర్ణయించింది. ఇందుకోసం బొల్వోనిజెన్ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఆ తరువాత ఇంటి డిజైన్ బాధ్యతలను ప్రముఖ ఆర్కిటెక్ట్ డ్రిస్ క్రెయిజ్‌క్యాంప్‌నకు అప్పగించింది. అతను గోళాకారంలో ఇంటి నిర్మాణం బాగుంటుంది అని డిజైన్ చేసి ఇచ్చాడు. అది కొత్తగా అనిపించడంతో ప్రభుత్వం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మూడు అంతస్తుల మేడ
గోళాకారంలో ఉంది కదా లోపల మనుషులు ఎలా నివసిస్తారని సందేహం రావచ్చు. బయటి నుంచి చూస్తే గ్లోబ్‌లా ఉంది కానీ లోపలికి అడుగుపెడితే మూడంతస్తుల మేడ కనిపిస్తుంది. డిజైన్‌కు అనుమతి రావడంతో 1980లో ప్రభుత్వం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. ఇంటి బయటి వైపు గోళాకారపు నిర్మాణాన్ని సిమెంటుతోనే నిర్మించారు. దృఢంగా ఉండటం కోసం ఫైబర్ గ్లాస్‌ను ఉపయోగించారు. ఒక్కో గోళం చుట్టు కొలత 18 అడుగులు ఉంటుంది. ఇక కిటికీలు కూడా గుండ్రంగా ఉంటాయి. ఒక్కో ఇంటికి 11 కిటికీలు ఏర్పాటు చేశారు. బెడ్‌రూమ్‌ను కింది అంతస్తులో ఏర్పాటు చేస్తే మధ్యలో బాత్ రూమ్, పై అంతస్తులో లివింగ్‌రూమ్, కిచెన్ నిర్మించారు. ఈ గ్లోబ్‌హౌజ్‌లో మరో స్పెషల్ ఉంది. అదేమిటంటే... ఈ ఇంటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు విడదీసి, మరోచోటుకు తరలించుకోవచ్చు.
కూల్చాల్సిన పనిలేదు. డిస్‌అసెంబుల్డ్ చేయవచ్చు. ఈ ఇంట్లో ఉంటే అంతరిక్ష నౌకలో నివసిస్తున్నామనే భావన కలుగుతుంది. కిటికీల నుంచి 360 డిగ్రీల కోణంలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. లివింగ్ రూమ్‌లోని కూర్చుని ప్రకృతిని వీక్షించడం మధురానుభూతిని అందిస్తుంది. ఈ గ్లోబ్‌లాంటి నిర్మాణాలను డిజైన్ చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ప్రజలను ప్రకృతి దగ్గరకు తీసుకురావడమే అని చెప్పారు ఆర్కిటెక్ట్ క్రెయిజ్‌క్యాంప్. అయితే స్థానికులు మాత్రం ఆర్కిటెక్ట్ ఆలోచనను స్వాగతించలేదు. యాభై ఇళ్లు నిర్మించిన తరువాత ప్రభుత్వం ఆ డిజైన్‌ను పక్కన పెట్టింది. ఈ ఇళ్లను డిజైన్ చేసిన క్రెయిజ్‌క్యాంప్ 2014లో మరణించారు. ఈ బంతుల్లాంటి ఇళ్లను చూసేందుకు వచ్చే పర్యాటకుల సంఖ్య మాత్రం భారీగా ఉంది. ఇప్పటికీ ఈ గ్లోబ్ హౌజ్‌లలో ప్రజలు నివసిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి
Read Latest Telangana News and National News