Mumbai Cook Salary: ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:42 PM
తమ ఇంట్లో చేసే వంటమనిషికి భారీగా జీతమిస్తున్నామంటూ ముంబైకి చెందిన ఓ లాయర్ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆమె చెబుతోంది అబద్ధమంటూ జనాలు మండిపడుతున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: ఒకప్పుడు ఉద్యోగాల్లో మంచి జీతాలు ఉండేవి. ఇప్పుడు ఏఐ రాకతో మనిషి మేధో సామర్థ్యాలకు ఇక విలువ ఉండదన్న భయాలు పెరుగుతున్నాయి. భవిష్యత్తులో కాయకష్టం చేసుకునే వారికే డిమాండ్ ఉంటుందని అనేక మంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముంబై లాయర్ తన వంటమనిషికి ఎంత జీతం ఇస్తోందీ చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. అయితే, జనాలు మాత్రం ఆమె మాటలను కొట్టి పారేస్తున్నారు. అంతా పచ్చి అబద్ధమంటూ రంకెలేస్తున్నారు.
ఆయుషీ దోషీ అనే మహిళా లాయర్ ఎక్స్ వేదికగా ఈ పోస్టు పెట్టారు. తన ఇంట్లో వంట చేసే వ్యక్తికి నెలకు రూ.18 వేలు ఇస్తుంటామని తెలిపారు. అతడిని తాము ‘మహారాజ’ అని పిలుస్తామని అన్నారు. తన ఇంట్లో కేవలం అరగంట పాటు వంట చేసి వెళ్లిపోతాడని తెలిపారు. తాముంటున్న కాంప్లెక్స్‌లోని మరో 10-12 ఇళ్లల్లో వంట చేస్తాడని తెలిపారు. ఎంత మంది ఉన్నారనేదాన్ని బట్టి ఒక్కో ఇంట్లో అరగంట పాటు ఉంటాడని తెలిపారు. ఇలా అతడు చేతి నిండా సంపాదిస్తున్నాడని అన్నారు. అతడికి ప్రయాణ ఖర్చులు లేవని, ఫుడ్, టీలు వంటివన్నీ ఉచితమేనని అన్నాడు. చెప్పాపెట్టకుండా జాబ్ మానేసినా అతడిని అడిగేవారు లేరని చెప్పారు. నోటీస్ పీరియడ్స్, అనవసర మర్యాదలు పాటించాల్సిన అవసరం లేకుండా స్వేచ్ఛగా గడుపుతున్నారని చెప్పారు. లాయర్ అయిన తాను మాత్రం చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నానని అన్నారు.
ఇక ఈ పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. మహిళా లాయర్ మాటలను అనేక మంది కొట్టి పారేశారు. ఆమె చెప్పినదంతా పచ్చి అబద్ధమని అన్నారు. ‘ఏంటి అరగంట పనికి 18 వేల జీతమా. అతడేమైనా ఏఐతో పని చేస్తున్నాడా? ఇంతకంటే పెద్ద అబద్ధం లేదు. అసలు అంత తక్కువ సమయంలో వంట చేయడం సాధ్యమేనా? ముంబైలో నా స్నేహితులు చాలా మంది ఉన్నారు. అక్కడ స్థానిక మహిళలు చాలా తక్కువ జీతానికే అద్భుతమైన వంటలు చేస్తుంటారు’ అని ఓ వ్యక్తి అన్నారు. ఈ కుక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను మించిపోయారే అంటూ మరొకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వంటమనిషికి రూ.18 వేలు అంటే నమ్మశక్యంగా లేదు. గుర్‌గావ్‌లోనే 4 వేల నుంచి 6 వేలు ఇస్తున్నాము’ అని మరో వ్యక్తి అన్నారు.
ఇలా విమర్శలు ఎక్కువ కావడంతో ఆయుషీ స్పందించక తప్పలేదు. ఇలాంటి సందర్భాల్లో సాటి ముంబై వాసులు తనకు మద్దతుగా ముందుకు వచ్చి వాస్తవం వివరించాలని నెట్టింట అభ్యర్థించారు. ‘ఇదే వంటమనిషి 12 మంది ఉన్న కుటుంబానికి ఒక రోజు వంట చేసేందుకు రూ.2.5 వేలు తీసుకుంటాడు. నేనేమీ వ్యూస్ కోసం ఇలాంటి పోస్టు పెట్టలేదు. కాస్మోపాలిటన్ నగరాల్లో చాలా చోట్ల పరిస్థితి ఇలాగే ఉంది’ అని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్‌తో ఈ పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇవీ చదవండి:
టీసీఎస్‌లో జాబ్ శాశ్వతం అనుకున్నాం..ఇది అస్సలు ఊహించలేదు.. టెకీ ఆవేదన
తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్