Share News

Locker: లక్షలు ఆర్జిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులు.. వీడియో వైరల్ కావడంతో షాక్

ABN , Publish Date - Jun 12 , 2025 | 07:10 PM

ముంబైలోని అమెరికా కాన్సులేట్ కార్యాలయం వద్ద ఓ ఆటో డ్రైవర్ నిర్వహిస్తున్న లాకర్ సర్వీసుకు బ్రేకులు పడ్డాయి. అనుమతి లేకుండా అతడు నిర్వహిస్తున్న సర్వీసుకు పోలీసులు ఫుల్ స్టాప్ పెట్టారు.

Locker: లక్షలు ఆర్జిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులు.. వీడియో వైరల్ కావడంతో షాక్
Mumbai auto driver locker

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలోని అమెరికా కాన్సులేట్‌కు వచ్చే విజిటర్స్‌కు లాకర్ సర్వీసు అందిస్తున్న ఆటో డ్రైవర్ జీవితం తలకిందులైంది. అతడి వీడియో వైరల్ కావడంతో లక్షల ఆదాయం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట కలకలం రేపుతోంది.

కాన్సులేట్ కార్యాలయానికి వచ్చే వారి లగేజీని లోపలికి అనుమతించరు. దీంతో, విజిటర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఈ విషయాన్ని గమనించిన ఆటో డ్రైవర్.. స్థానికంగా లాకర్ సర్వీసును ప్రారంభించారు. విజిటర్స్ లగేజీని భద్రపరుస్తూ నెలకు రూ.8 లక్షల వరకూ సంపాదించడం ప్రారంభించాడు. ఒక్కో విజిటర్ నుంచి రూ.1000 చార్జీ తీసుకునేవారు.


ఓ స్టార్టప్ సంస్థ కోఫౌండర్‌ కూడా ఈ లాకర్ సర్వీసును వినియోగించుకున్నారు. అనంతరం, సదరు ఆటో డ్రైవర్‌ వ్యాపార దక్షతను ప్రశంసిస్తూ నెట్టింట పోస్టు పెట్టారు. అవకాశాలు గుర్తించి ఆదాయా మార్గాలుగా మలుచుకోవడంలోనే వ్యాపార దక్షత దాగుందని అన్నారు. ఎమ్‌బీయే డిగ్రీలు ఏవీ చదవకపోయినా ఆటో డ్రైవర్ ఈ సూత్రాన్ని జీవితానుభవం ద్వారా నేర్చుకున్నారని ప్రశంసిస్తూ పోస్టు పెట్టారు. ఇది వైరల్ కావడంతో ఆటో డ్రైవర్‌పై పోలీసులు దృష్టి సారించారు.

ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నందున లాకర్ సర్వీసును మూసివేశారు. తొలుత ఆటో డ్రైవర్‌‌తో పాటు అతడికి సహకరిస్తున్న 12 మందిని పిలిపించి మాట్లాడారు. అనంతరం, లాక్ సర్వీసుకు ఫుల్ స్టాప్ పెట్టారు. ‘కాన్సులేట్ ప్రాంతంలో భద్రతా కారణాల రీత్యా పార్కింగ్‌కు అనుమతి లేదు. ప్యాసెంజర్లను దింపేందుకు మాత్రమే ఆటో డ్రైవర్లకు అనుమతి ఉంది’ అని ఓ అధికారి అన్నారు.


లాకర్ సర్వీసు నిర్వహించేందుకు సదరు డ్రైవర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని తెలిపారు. ఏదైనా వస్తువు పోయిన సందర్భంలో భద్రతా పరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ‘ఆటో డ్రైవర్‌కు ప్రయాణికులను తరలించేందుకు అనుమతి ఉంది. లాకర్ సర్వీసు నిర్వహించేందుకు కాదు. కాబట్టి, ఈ విషయంలో ఎంక్వైరీ చేశాం. అతడు సర్వీసును ఆపేశాడు’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

ఇన్‌స్టాలో ఇద్దరు ఫాలోవర్లు తగ్గడంతో ఆగ్రహం.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు

ఏసీ గది బుక్ చేయని వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు

Read Latest and Viral News

Updated Date - Jun 12 , 2025 | 07:16 PM