Nathdwara: ముఖేష్ అంబానీ భారీ ప్రకటన.. నాథ్‌ద్వారాలో రూ.50 కోట్లతో 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్'
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:46 PM
రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీనాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, భారత్‌లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇవాళ ఒక అద్భుత ప్రకటన చేశారు. నేడు (ఆదివారం) రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న నాథ్‌ద్వారా లోని శ్రీనాథ్‌జీ ఆలయాన్ని అంబానీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన, స్వామి వారి భోగ్ ఆరతి దర్శనం చేసుకుని, గురు శ్రీ విశాల్ బావా సాహెబ్ ఆశీస్సులు అందుకున్నారు.
ఈ సందర్భంగా ముకేష్ అంబానీ ఒక ముఖ్య ప్రకటన చేశారు. 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్' ప్రాజెక్ట్ చేపట్టాలని తలంచినట్టు చెప్పారు. ఆలయానికి వచ్చే యాత్రికులు, వృద్ధ వైష్ణవుల కోసం ఆధునిక 'యాత్రి ఏవం వరిష్ఠ సేవా సదన్' నిర్మాణం చేపడతామని తెలిపారు.
ఈ సేవా సదన్ లో 100కు పైగా గదులు, 24 గంటల మెడికల్ యూనిట్, నర్సింగ్, ఇంకా ఫిజియోథెరపీ సేవలు. వీటితోపాటు, సత్సంగ్-ప్రవచన హాల్, పుష్టిమార్గ్.. సంప్రదాయం ప్రకారం థాల్-ప్రసాద వ్యవస్థతో డైనింగ్ రూమ్ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయని తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ.50 కోట్లకు పైగా అవుతుందని, దీనిని మూడేళ్లలోపు సిద్ధం చేస్తామని కూడా ముఖేష్ అంబానీ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పుష్టిమార్గ్ సంప్రదాయంలో సేవ, ఇంకా భక్తి స్ఫూర్తితో నిర్మితమవుతుందని, వైష్ణవులుగా గర్వపడేందుకు ఇది సహకరిస్తుందని అంబానీ అన్నారు.
కాగా, ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ సహకారంతో ఈ ఆలోచన ఊపందుకోవడం విశేషం. రూ. 50 కోట్లతో నిర్మించే సేవా సదన్ ప్రకటనతోపాటు, అదనంగా శ్రీ నాథ్‌ద్వారా టెంపుల్‌కు ముఖేష్ అంబానీ ఇవాళ రూ.15 కోట్లు విరాళంగా అందజేశారు. ఇలా.. ముఖేష్ అంబానీ వ్యాపార రంగంతోపాటు, అనేక సామాజిక సేవల్లోనూ తామేంటో చూపిస్తూ ముందుకు సాగుతున్నారు.

ఇవి కూడా చదవండి..
గుజరాత్‌లో ముగ్గురు ఉగ్రవాద అనుమానితుల అరెస్ట్
పిల్లలకు వారు తుపాకులిస్తే.. మేం ల్యాప్‌టాప్ ఇస్తున్నాం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి