Viral Video: యువతి ప్రేమ పెళ్లి.. రోడ్డున పడ్డ రెండు కుటుంబాలు..
ABN , Publish Date - Apr 11 , 2025 | 10:29 AM
Naka Chandravadni Viral Video: దీంతో హర్షిత, ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ పెళ్లి కారణంగా రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ప్రేమ పెళ్లిళ్లకు పెద్దలు అడ్డుగా ఉండటం అన్నది సర్వ సాధారణం. అలాంటప్పుడు కొంతమంది ప్రేమికులు పెద్దలకు ఎదురు చెప్పలేక.. వేరే వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంతమంది ఏళ్ల పాటు ఆగి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది పెద్దలను ఎదురించి, ప్రేమించిన వాళ్లతో వెళ్లిపోతున్నారు. తాజాగా, మధ్య ప్రదేశ్‌కు చెందిన ఓ యువతి ప్రేమించిన వాడి కోసం కన్నతండ్రిని ఎదురించింది. ఇంట్లోంచి వెళ్లిపోయి ప్రియుడ్ని పెళ్లి చేసుకుంది. సీన్ కట్ చేస్తే యువతీ, యువకుడి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుందని తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో యువతి కుటుంబం .. యువకుడి కుటుంబంపై దాడి చేసింది.
ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లోని నాక చంద్రవంశీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. నాక చంద్రవంశీకి చెందిన హర్షిత అనే యువతి, ఆనంద్ అనే యువకుడు ప్రేమించుకున్నారు. హర్షిత ప్రేమ విషయంలో ఇంట్లో తెలిసింది. ఈ పెళ్లికి హర్షిత తండ్రి రిషిరాజ్ జైశ్వాల్ ఒప్పుకోలేదు. దీంతో హర్షిత, ప్రియుడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. కోర్టు ద్వారా 15 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలియగానే రిషిరాజ్ తీవ్రంగా కలత చెందాడు. కన్న కూతురు తన మాట వినకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన దగ్గర ఉన్న లైసెన్స్ గన్‌తో కాల్చుకుని చనిపోయాడు.
రిషిరాజ్ మరణంతో అతడి కుటుంబం కోపం కట్టలు తెంచుకుంది. యువకుడి ఇంటి దగ్గరకు వెళ్లారు. యువకుడి కుటుంబసభ్యులపై దాడికి దిగారు. యువకుడి తండ్రి గులాబ్ ప్రజాపతిని ఇంట్లోంచి బయటకు లాక్కుని వచ్చి మరీ కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు రిషిరాజ్ ఇంటికి వెళ్లారు. గన్ స్వాధీనం చేసుకున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువతి కుటుంబసభ్యులు గులాబ్ ప్రజాపతిని కొడుతున్న దృశ్యాల తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ దాడిపై కూడా కేసు నమోదైంది. వైరల్‌గా మారిన వీడియో ఆధారంగా పోలీసులు నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు.
ఇవి కూడా చదవండి
ఈ ఆలయంలో ప్రసాదంగా చైనీస్ న్యూడిల్స్.. కారణం ఏంటంటే..
Kangana Ranaut: కరెంట్ బిల్ వివాదంలో హీరోయిన్ కంగనా రనౌత్