Leopard Snatches Pet Dog: పోలీస్ స్టేషన్‌లో చిరుత కలకలం.. కుక్కను ఎత్తుకెళ్లిపోయింది..
ABN , Publish Date - Nov 21 , 2025 | 06:57 AM
ఓ చిరుత పులి అటవీ ప్రాంతం నుంచి జనావాసంలోకి వచ్చింది. పోలీస్ స్టేషన్ వద్ద కలకలం సృష్టించింది. కుక్కను నోట కర్చుకెళ్లిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మధ్య కాలంలో వన్య మృగాలు జనావాసాల్లోకి రావటం బాగా పెరిగిపోయింది. పులులు, సింహాలు, చిరుతలు, ఎలుగు బంట్లలాంటి క్రూర మృగాలు గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అలజడి సృష్టిస్తున్నాయి. మనుషులు, సాధు జీవాలపై దాడులకు పాల్పడుతున్నాయి. అడవులకు దగ్గరగా ఉండే గ్రామాల పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. కంటికి కనిపించిన జీవుల్ని చంపి తినేస్తున్నాయి. తాజాగా, ఓ పోలీస్ స్టేషన్‌లో చిరుత కలకలం సృష్టించింది. స్టేషన్‌లోకి చొరబడి కుక్కను ఎత్తుకెళ్లిపోయింది.
ఈ సంఘటన ఉత్తరాఖండ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. నవంబర్ 17వ తేదీన ఓ చిరుత పులి అటవీ ప్రాంతం నుంచి నైనతాల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చింది. చిరుత పులిని చూడగానే స్టేషన్‌లోని కుక్క అరవటం మొదలెట్టింది. చిరుత వేగంగా స్టేషన్‌లోకి వచ్చింది. కుక్క అరుస్తూ చిరుత మీద దాడి చేయడానికి ప్రయత్నించింది. చిరుత బలం ముందు అది ఓడిపోయింది. కుక్కపై దాడి చేసిన చిరుత దాన్ని ఠక్కున అక్కడినుంచి ఈడ్చు కెళ్లిపోయింది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సచిన్ గుప్త అనే వ్యక్తి ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు..‘ఈ మధ్య కాలంలో పులులు, సింహాలు గ్రామాల్లోకి రావటం బాగా పెరిగిపోయింది. ఇలాంటివి చూస్తుంటే చాలా భయం వేస్తుంది’..‘కొంప తీసి ఏఐ వీడియో కాదు కదా.. ఈ మధ్య ఏది నిజమో.. ఏది అబద్దమో కనుక్కోలేని పరిస్థితి ఏర్పడింది’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
జలమండలి అధికారి పేరిట వృద్ధుడికి టోకరా.. రూ.2.30 లక్షలు గోవిందా..
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..