‘గజిబిజి తోటలు’ పెంచుతున్నారు...
ABN , Publish Date - Apr 27 , 2025 | 10:06 AM
ఈ వరసంతా గులాబీలు... ఆ పక్కన లిల్లీలు, అటువైపు బీర, టమాటా పాదులు... అని చెప్పుకునే రోజులు పోయాయి. ఇప్పుడు సరికొత్త ట్రెండ్ ‘ఖయాస్ గార్డెనింగ్’... అంటే గజిబిజి గందరగోళపు తోటలన్నమాట. రంగుల పూల మొక్కలు, కూరగాయల తీగలు, వన మూలికలు... అన్నీ ఒకచోటే. ఆయా నగరాల్లోని ఆధునిక జీవనవిధానం తోటల తీరుతెన్నులనూ మార్చేస్తోంది.

‘గార్డెనింగ్’పై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ఇంటి తోట, మిద్దెతోట, కిచెన్ గార్డెనింగ్, కంటెయినర్ గార్డెనింగ్ ... ఇలా ఎన్నెన్నో రకాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. తోటలో మొక్కలను కూడా సొంత బిడ్డలుగా ప్రేమిస్తూ, వాటి కోసం ఎంతోకొంత సమయాన్ని కేటాయిస్తున్నవారు చాలామందే ఉన్నారు.
ఉన్న కొద్ది స్థలం, సమయంలో... ఎక్కువ పర్యవేక్షణ, పని లేకుండా మొక్కలు చకచకా పెరిగి... ఒకేచోట రకరకాల పూలు, పండ్లు, కూరగాయలను పెంచడమే ‘ఖయాస్ గార్డెనింగ్’. ఇందులో ఇలా చేయాలి, అలా చేయాలి అన్న పద్ధతులు లేవు, పంచవర్ష ప్రణాళికలూ లేవు. ఇలాంటి మట్టిలో... ఈ తరహా విత్తనాలే అన్న నియమ నిబంధనలు లేవు. మనకు ఎలా తోస్తే అలా, ఇంటి ముందు ఖాళీస్థలం, పెరడు, బాల్కనీ, ఆఖరుకు పూలకుండీలో అయినా ఈ తరహా తోటలని పెంచుతూ ట్రెండీగా మార్చారు ప్రకృతి ప్రేమికులు. దీన్నే ‘వైల్డ్ ప్లాంటింగ్’ ట్రెండ్ అని కూడా పిలుస్తున్నారు.
అంతా కలగాపులగం...
ఇంటి గూళ్లలో, ప్యాకెట్లలో మిగిలిపోయిన రకరకాల విత్తనాలను కలిపి, కలగాపులగం చేసి, తోటలో ఒకేచోట నాటి చూడండి. కొన్నిరోజుల తరవాత ఆశ్చర్యం కలిగించేలా విభిన్నమైన పూలు, కాయల మొక్కలు పెరుగుతూ ఆ ప్రదేశానికే కొత్త అందాన్ని తీసుకువస్తాయి. ఒకవేళ ఇంట్లో పాత విత్తనాలు లేకపోతే మార్కెట్లో దొరికే చిన్నాపెద్దా మొక్కలు, పూలు, కూరగాయల విత్తనాలని తీసుకువచ్చి వాటిని కలిపేసి... భూమిలో పాతడమే. ఈ తరహా తోటపనికి పెద్దగా స్టాటిస్టిక్స్ అవసరం లేదు కానీ, కనీస పరిజ్ఞానం అవసరం. పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, వనమూలికలు... ఏవైనా సరే పెరగాలంటే రోజుకి కనీసం ఆరు గంటల సూర్యరశ్మి కావాలి. కాబట్టి చక్కటి వెలుతురు వచ్చే చోట ఇలాంటి తోటలు పెంచవచ్చు. ఉన్న కొద్ది ప్రదేశంలో అయినా ఇలాంటి ప్రయోగాలు చేస్తే మార్పు కనిపిస్తుంది. అపార్ట్‌మెంట్లలో ఉండేవాళ్లు వెడల్పాటి పూల కుండీల్లో ఈ తరహా ‘గజిబిజి తోట’లకు శ్రీకారం చుట్టవచ్చు. ఇందులో గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలివి...
- మరీ భూమి లోపలికి నాటాల్సిన విత్తనాలు ఈ తరహా తోటలకు పనికి రావు.
- అన్ని తోటల మాదిరిగానే ఇందులో కూడా మొదట మట్టిని చదును చేసి, కొద్దిగా ఎరువు వేసి ముందు పెద్దవి, ఆ తరవాత చిన్న సైజు విత్తనాలను చల్లాలి. లేదా రెండింటినీ కలిపే చల్లవచ్చు.
- ఒకే తరహా నీళ్లు, వెలుతురూ అవసరమైన మొక్కల విత్తనాలను ఎంచుకుంటే మంచిది.
- నాటిన లేదా చల్లిన తర్వాత విత్తనాలు మట్టిని బాగా పట్టుకున్నాయో లేదో చూడాలి. ఎందుకంటే తేలికైన విత్తనాలు గాలికి ఎగిరే ప్రమాదమూ లేకపోలేదు.
ఇలాంటి జాగ్రత్తలతో నాటిన విత్తనాలు మొలకెత్తాక పని సగం పూర్తయినట్లే. క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే చాలు... అవే సహజంగా పెరుగుతాయి. ఒకవేళ పెద్ద మొక్కలు చిన్నవాటికి అడ్డుగా అనిపిస్తే... వాటి మధ్య కాస్త ఎడం ఏర్పరిస్తే అన్నీ సులువుగా పెరుగుతాయి. మొక్కలు కాస్త పెద్దయ్యాక ఒకదానికి ఒకటి ఆసరా అందించినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే గజిబిజి తోటల పెంపకంలో మొక్కల ఎదుగుదల పూర్తిగా ప్రకృతే చూసుకుంటుంది... అచ్చం అడవిలో ఉన్నట్టు. ఒకేచోట వైవిధ్యభరితమైన మొక్కలు, పూలను చూడడం వల్ల మనసు ఆహ్లాదభరితంగా మారుతుందని సైకాలజిస్టులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ చేకూరుతుంది. అందుకే గార్డెన్ థెరపీలో ఇటీవల కాలంలో గజిబిజి తోటలు ముందుంటున్నాయి.
సోషల్ మీడియాలో...
యుకేలో 2023లో జరిగిన ‘చెల్సియా ఫ్లవర్ షో’లో తొలిసారి ‘ఖయాస్ గార్డెనింగ్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇన్‌ఫ్లూయెన్సర్లు ఈ తోటలపై అనేక ప్రత్యేక కథనాలు చేశారు. దాంతో బిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి ‘ఖయాస్ గార్డెనింగ్’ వీడియోలు.
తోటల పెంపకం గురించి పరిజ్ఞానం లేని వాళ్లు కూడా వీటిని సులభంగా పెంచవచ్చు. అలాగే ఈ తోటల నిర్వహణకు ఖర్చు తక్కువ. సమయం పెద్దగా కేటాయించాల్సిన అవసరం లేదు. ఇంకా తోట పరికరాలు, పనిముట్లతో పెద్దగా పనీ లేదు. అందుకే నవతరం ఈ తోటల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. మొక్కలు పెంచాలనే కాస్త ఆసక్తితో... విత్తనాలు తగిన ప్రదేశంలో చల్లితే చాలు... ఇక మిగతాదంతా ఆటోమేటిక్‌గా జరుగుతుంది. కొన్ని రోజులకే చక్కని తోట ప్రత్యక్షమవుతుంది. అందుకే ఈ తోటలను కొందరు ‘లేజీ గార్డెన్లు’ అంటున్నారు. గత రెండేళ్ల నుంచి నిత్యం వార్తల్లో ఉండడం వల్ల 2025 గార్డెనింగ్ ట్రెండ్స్‌లో ‘ఖయాస్ గార్డెనింగ్’ ప్రథమ స్థానంలో నిలిచింది. మన దేశంలో కూడా ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. ఆధునిక ఉరుకుల పరుగుల జీవనంలో ఈ ట్రెండ్ మరింత ఊపందుకుంటుందని చెబుతున్నారు గార్డెనింగ్ నిపుణులు. ఉరుకులు పరుగుల నగర జీవితాలకు ఒకరకంగా గజిబిజి తోటలు చక్కని ఆటవిడుపు. విశాలమైన ఖాళీ స్థలం ఉన్న ఇండిపెండెంట్ ఇళ్లలో, అపార్ట్‌మెంట్లలో... అన్ని తరహా మొక్కలు, చెట్లు ఒకేచోట పెరగడం వల్ల ప్రతీరోజూ ఒక మినీ అడవిని చూసిన అనుభూతి కలుగుతోంది. అందుకే మొక్కల ప్రేమికులతో పాటు సామాన్యులు కూడా వీటివైపు మొగ్గుచూపుతున్నారు. ఈమధ్యనే మొదలైన ఈ నయా ట్రెండ్ రానున్న కాలంలో ఏమేరకు ఎదుగుతుందో వేచిచూడాలి.
ఎలాంటి విత్తనాలు?
గజిబిజి తోటల్లో ఎలాంటి విత్తనాలనైనా కలగాపులగంగా కలిపేసి నాటితే మన ఊహకు అందని తోటలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అయితే పూలు, మూలికలు, కూరగాయలకు చెందిన విత్తనాలను కలిపి ఒకేచోట చల్లడం మంచిది. ఉదాహరణకు పొద్దుతిరుగు, చామంతి, డైసీలు ఓచోట, తులసి, పుదీనా, వాము లాంటివి కాస్త దూరంలో చల్లడం మంచిది. అయితే ఇలాంటి తోటలు పెంచాలనుకున్నప్పుడు కాలాన్ని దృష్టిలో పెట్టుకోవడం మరవొద్దు. సరైన కాలంలో విత్తనాలు నాటితే తొందరగా ఫలితం కనిపిస్తుంది.
ఆసక్తికి కారణాలివే...
కొత్తతరం గజిబిజి తోటల వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. జీవవైవిధ్యానికీ ఇవి ఎంతో సహాయపడతాయి. వీటి పెంపకం పట్ల చాలామంది ఆసక్తి చూపడానికి కొన్ని కారణాలున్నాయి. అవేమిటంటే...
- కొద్దిగా సమయం చాలు: తోటలంటే ఇష్టమే కానీ సమయం అస్సలు లేదు అనే వాళ్లకి గజిబిజి తోటలు చక్కటి పరిష్కారం. ఓసారి విత్తనాలను చల్లేసి, రోజూ కాసేపు వాటిని చూసి, కాస్త నీళ్లు పడితే చాలు. అంతకు మించిన నిర్వహణ పనులు పెద్దగా ఏమీ ఉండవు. కొంతకాలానికి ఈ తోటలే చక్కటి నేస్తాలుగా మారతాయి.
- కాస్త నీరే: ఈ తరహా తోటల్లో మొక్కల సాంద్రత ఎక్కువ. అంటే తక్కువ స్థలంలో ఊహించని విధంగా దట్టమైన మొక్కలుంటాయి. మామూలు తోటల్లా ఒక్కో మొక్క కోసం కుండీల్లో విడిగా నీళ్లు పోసే అవసరం లేదు. అన్నింటికీ ఓసారి పడితే చాలు.
- నామమాత్రపు నిర్వహణ: సాధారణ తోటల మాదిరిగా భారీ పరికరాలు, ల్యాండ్ స్కేప్ లాంటివి వీటికి అవసరం లేదు. అలాగే ఎండకాలం చిన్న మొక్కలు చనిపోతాయనే భయమూ లేదు. ఎందుకంటే పెద్ద మొక్కల ఆకులు నీడలో అవి సురక్షితంగా ఉంటాయి. అలాగే వర్షాకాలంలో కూడా. ఈ తోటల పెరుగుదలలో ప్రకృతిదే ప్రధాన పాత్ర.
- జీవ వైవిధ్యం: అడవుల్లో పొంతన లేని చెట్లన్నీ కలిసి పెరిగి, వనానికే చిక్కని అందాన్ని తీసుకువస్తాయి. అచ్చం అలాంటి చిన్నపాటి వన్యప్రపంచాన్ని గజిబిజి తోటలు ఇళ్లల్లో సృష్టిస్తాయి. అందుకే వీటికి ‘అడవి తోటలు’ అని కూడా పేరుంది. ఇంతటి వైవిధ్యం నేలతల్లి పోషణలో సహాయపడుతుంది. అన్ని మొక్కలూ, చెట్లూ బలంగా పెరగడానికి దోహదపడతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ దందాల కవితకు రాహుల్ పేరెత్తే అర్హత లేదు
పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్ బాధితుడు
జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ
Read Latest Telangana News and National News