Railway Clerk Video: రైల్వే క్లర్క్ దారుణం.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:24 PM
కౌంటర్ ముందు జనాలు పెద్ద క్యూ కట్టినా పట్టించుకోకుండా ఓ రైల్వే క్లర్క్ వ్యక్తిగత ఫోన్ సంభాషణలో మునిగిపోయిన వీడియో ప్రస్తుతం నెట్టింట సంచలనం రేపుతోంది. ఆ క్లర్క్‌పై సస్పెన్షన్ వేటు పడినట్టు రైల్వే అధికారులు తెలిపారు.

ఇంటర్నెట్ డెస్క్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ రైల్వే క్లర్క్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. జనాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో సదరు క్లర్క్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. కర్ణాటకలో బుధవారం ఈ ఘటన వెలుగు చూసింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, రైలు టిక్కెట్లు జారీ చేసే కౌంటర్‌లోని ఓ క్లర్క్ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. కౌంటర్ ముందు భారీ క్యూ ఉన్నా పట్టించుకోకుండా వ్యక్తిగత ఫోన్ సంభాషణలో మునిగిపోయారు. కుర్చీలో కాళ్లు బారుగా చాపి కూర్చుని తాపీగా ఫోన్‌లో మాట్లాడారు. లైన్‌లో నిలబడ్డ కొందరు కస్టమర్‌లు అతడిని ప్రశ్నిస్తే కాసేపు ఆగాలని సూచించారు. చివరకు ఓ కస్టమర్ అతడిని గట్టిగా నిలదీశారు. ‘ఒక్క నిమిషం అన్నారు.. ఇప్పటికే 15 నిమిషాలు అవుతోంది’ అంటూ క్లర్క్‌పై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అతడి వెనకాల ఉన్న ఇతర ప్యాసెంజర్‌లు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పరిస్థితి ముదురుతోందని అర్థం చేసుకున్న టికెట్ క్లర్క్ వెంటనే టిక్కెట్లు ఇవ్వడం ప్రారంభించాడు.
ఇక ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో జనాలు మండిపడ్డారు. క్లర్క్ ప్రవర్తన సిగ్గు చేటని అన్నారు. అనేక స్టేషన్‌లలో సిబ్బంది ఇలాగే ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం సిబ్బందిపై ఓ కన్నేసి ఉంచాలని ఉన్నతాధికారులకు సూచించారు. రైల్వే ఉద్యోగులపై పని భారం ఎక్కువని కొందరు అన్నారు. అయితే, ప్రాథమిక విధులలో ఏమాత్రం నిర్లక్ష్యం తగదని కూడా స్పష్టం చేశారు.
ఈ ఘటనపై స్పందించిన రైల్‌సేవ.. సదరు ఉద్యోగిని సీ మహేశ్‌గా గుర్తించింది. విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు అతడిపై సస్పెన్షన్ వేటు పడిందని కూడా చెప్పింది. ఘటన తమ దృష్టికి రాగానే సంబంధిత స్టేషన్ మాస్టర్‌ను అప్రమత్తం చేసినట్టు వెల్లడించింది. ఆ తరువాత స్టేషన్ మేనేజర్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గుంతకల్ రైల్వే డివిజన్ పరిధిలో ఈ ఘటన జరిగిందని అన్నారు.
ఇవీ చదవండి:
భారత్ ఇంతగా మారిపోయిందా.. మహిళ పోస్టు నెట్టింట వైరల్
తల్లిదండ్రుల మాటలు విని భర్తకు విడాకులిచ్చి తప్పు చేశా.. మహిళ ఆవేదన నెట్టింట వైరల్