Man Protests Broken Roads: మురికి నీళ్లలో పడిపోయిన కూతురు.. తండ్రి చేసిన పనికి అందరూ షాక్..
ABN , Publish Date - Aug 03 , 2025 | 03:00 PM
Man Protests Broken Roads: ఓ బాలిక ఉదయం ఇంటినుంచి స్కూలుకు బయలుదేరింది. వర్షం కారణంగా నీటితో నిండి ఉన్న గుంటల రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే బాలిక కాలుజారి మురికి నీటిలో పడిపోయింది.

వర్షాకాలం వచ్చిందంటే.. ఇండియాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వర్షం పడ్డా చాలు.. రోడ్ల మీద ఉండే గుంతలు నీటితో నిండిపోతాయి. వాహనదారులు ఆ రోడ్లపై వెళ్లాలంటే నరకం చూడాల్సి వస్తుంది. ఒక్కోసారి ప్రమాదాలకు కూడా గురి అవుతూ ఉంటారు. తాజాగా, ఓ బాలిక గుంటలు పడ్డ రోడ్డుపై నడుస్తూ.. మురికి నీటిలో జారి పడింది. ఆ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. రోడ్డుపై వినూత్న రీతిలో నిరసన తెలియ జేశాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది.
ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కాన్పూర్, బర్రా 8 ఏరియాకు చెందిన ఓ బాలిక ఉదయం ఇంటినుంచి స్కూలుకు బయలుదేరింది. వర్షం కారణంగా నీటితో నిండి ఉన్న గుంటల రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే బాలిక కాలుజారి మురికి నీటిలో పడిపోయింది. బట్టలు మొత్తం పాడవటంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయింది. తండ్రికి జరిగిన సంగతి చెప్పింది. అతడికి పట్టరాని కోపం వచ్చింది. ఓ చాప, దిండు తీసుకుని కూతురు పడిపోయిన చోటుకు వెళ్లాడు. అక్కడి గుంటల రోడ్డుపై.. అది కూడా మురికి నీటిలో చాప వేశాడు.
తర్వాత దానిపై పడుకుని నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డుపై వెళుతున్న వారు షాక్ అయ్యారు. ఆగి మరీ చూస్తూ ఉండిపోయారు. మరికొంతమంది వీడియో తీయటం మొదలెట్టారు. ఆ వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఇది రాజకీయాల కోసం చేయటం లేదు. ఇది అవసరం. ప్రతీ రోజూ మా పిల్లలు ఈ మురికి నీటిలో జారి పడటం.. జనాలు గాయాలపాలవ్వటం చూస్తూ ఊరుకోలేము. చాలా కంప్లైంట్లు ఇచ్చినా.. ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. రోడ్లను బాగు చేయటం లేదు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు చేశాడు. ఇక, స్థానికులు కూడా ఆ వ్యక్తితో జత కలిశారు. నిరసనలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
అరటిపండు తొక్క అందానికి నిధి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..
వరదల తాకిడికి వారణాసి-ప్రయాగ్‌రాజ్ అతలాకుతలం.. అఖిలేష్ యాదవ్ ఆగ్రహం