Share News

‘పులి వితంతువుల’ ప్రేరణాత్మక ప్రయాణం

ABN , Publish Date - Apr 20 , 2025 | 01:16 PM

అరణ్యాలు సముద్రాన్ని చుంబించే చోట... ప్రకృతి సాహసాన్ని, ప్రమాదాన్ని కథలుకథలుగా గుసగుసలాడుతుంది. బురద లోతుల్లో చిక్కుకుపోయిన మడ అడవుల వేర్లు, ఆకాశం వంక ఆశావహంగా చూస్తాయి. జీవించే కనీస హక్కు కోల్పోతున్న వ్యాఘ్రాలు, వితంతువులు తిరగబడి ధిక్కరించే జీవన అభయారణ్యం పశ్చిమ బెంగాల్‌లోని ‘సుందర్బన్స్‌’. అక్కడ పులుల దాడుల్లో భర్తలను కోల్పోయి ‘పులి వితంతువులు’గా ముద్రపడి, సమాజం నుంచి అనేక అవమానాలను ఎదుర్కొంటున్న కొందరు మహిళల ప్రేరణాత్మక ప్రయాణ విశేషాలివి...

‘పులి వితంతువుల’ ప్రేరణాత్మక ప్రయాణం

సుందర్బన్స్‌ అనేది గంగా డెల్టాలోని మడ అడవుల (మ్యాన్‌ గ్రోవ్‌ ) ప్రాంతం. ఇది బంగాళాఖాతంలో గంగ, బ్రహ్మపుత్ర, మేఘన నదుల సంగమం ద్వారా ఏర్పడిన వనక్షేత్రం. 10,277 చదరపు కిలోమీటర్లు విస్తరించిన సుందర్బన్స్‌ ప్రపంచంలోని అతి పెద్ద మడ అడవులలో ఒకటి. రాయల్‌ బెంగాల్‌ టైగర్‌, గంగా, ఇరావడి డాల్ఫిన్లు, అరుదైన మొసళ్ళ జాతులు, స్థానిక నది టెర్రపిన్‌ (ఒక జాతి తాబేళ్లు - బటగుర్‌ బాస్కా) వంటి ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోతున్న జాతులకు నివాసంగా సుందర్బన్స్‌ సార్వత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పాంథేరా టైగ్రీస్‌ జాతులకు ఇది ప్రపంచంలోని ఏకైక మడ అడవుల నివాస స్థలం.

పులుల దాడులు...

చారిత్రాత్మకంగా, ఈ ప్రాంతంలో నివసించే డెల్టా సమాజం మనుగడ కోసం వనరులను ేసకరించడానికి అడవిలోకి చొచ్చుకుపోవలసి ఉంటుంది. ఇది తరచూ మానవ-జంతు సంఘర్షణకు దారితీస్తుంది. ఈ క్రమంలో చాలామంది పులుల దాడులకు గురవుతారు. భారత ప్రభుత్వ నివేదికల ప్రకారం, ప్రతీ సంవత్సరం పులుల దాడుల్లో సుమారు 36 మంది మరణిస్తున్నారు. పులుల ఆవాసాలు తగ్గిపోవడం, నీటి లవణీయత పెరగడం, ఆహార వనరులు తగ్గడం, మానవుల - పులుల మధ్య సంఘర్షణ పెరగడానికి దోహదం చేసి, సులభంగా మనుషులు పులులకు ఆహారంగా మారుతున్నారు.


సుందర్బన్స్‌ నివాసులైన పురుషులు తేనెను సేకరించడానికి పులుల దాడులకు, పాము కాట్లకు వెరవక ధైర్యంగా ప్రమాదకరమైన నీళ్లలోకి దిగి నడిచే సాహసవీరులు. కేవలం తేనెను సేకరించటానికి మొసళ్ళు, పాములు, న్యూమాటోఫోర్స్‌ (మడ అడవుల ముళ్ళ వేర్లు) నిండిన చిత్తడి, బురద నీటి గుండానడుస్తారు. తరచుగా జీవనోపాధి కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారు. అయితే పులుల దాడుల్లో భర్తలు మరణించిన తర్వాత ఒంటరివాళ్ళైన వారి భార్యలను సమాజం వెలివేస్తుంది.

book9.jpg

అపశకునాలుగా ముద్ర...

పులుల దాడిలో భర్తలను కోల్పోయిన స్ర్తీలను లేదా ‘పులి వితంతువుల’ను అపశకునాలుగా, దురదృష్టకారకులుగా నమ్ముతారు. వారిని ‘స్వామి ఖేజోలు’ (బెంగాలీ భాషలో భర్తను పొట్టనపెట్టుకున్నవారు)గా ముద్రవేసి సంఘజీవనం నుంచి బహిష్కరిస్తారు. పులుల దాడి వితంతువులను (బాగ్‌ బిధోబా) తరచుగా ఆ ప్రాంతపు సంప్రదాయ వృత్తులైన వ్యవసాయం, చేపలు పట్టడం, పీతల ేసకరణ - ఇవేవీ చేపట్టకుండా నిరోధిస్తారు. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, అడవిలోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత పులి దాడి వల్ల మరణించిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారానికి అనర్హులను చేస్తారు. తత్ఫలితంగా, వితంతువులు సామాజికంగా, ఆర్థికంగా కష్టనష్టాలను ఎదుర్కొంటారు.


పులి వితంతువులను తరచుగా వారి అత్తమామలు ఇంటి నుంచి గెంటివేసి, వారి మగపిల్లలను మాత్రం ఉంచుకుంటారు. ఈ వితంతువులను అపశకునాలుగా నమ్మటం వల్ల డెల్టాలో వారికి పని దొరకడం కష్టమవు తుంది. ఆధారపడటానికి కుటుంబం లేక పోవడం, ప్రభుత్వ సహాయం అందుబాటులో లేకపోవడంతో, పులి వితంతువులు కోల్‌కతా నగరంలో పని మనుషులుగా, కార్మికులుగా అందుబాటులో ఉన్న పనులను చేపట్టవలసి వస్తుంది. చాలా మంది మహిళలు మోసపు మాటలు నమ్మి నగరానికి చేరుకుంటారు.

book9.3.jpg

నగరంలోని వ్యభిచారగృహాల్లోకి నెట్టివేశాక బలవంతంగా లేక రాజీపడి లైంగిక వృత్తిలో మగ్గిపోతారు. సుందర్బన్స్‌ ప్రాంతం నుంచి ఆసియాలో అతి పెద్ద రెడ్‌ లైట్‌ ఏరియా అయిన సోనాగ్చీ, కోల్‌కతాలోని హర్కట్టా గోలీకి మహిళల అక్రమ రవాణా ప్రతి సంవత్సరం పెరుగుతోంది. హాఫ్‌పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ప్రజారోగ్య నిపుణుడు, సెక్స్‌ వర్కర్ల హక్కుల కార్యకర్త డాక్టర్‌ సమ్ర్జిత్‌ జానా మాట్లాడుతూ ‘సుందర్బన్స్‌ నుంచి ఏటా 700 మంది కార్మికులు ఈ పరిశ్రమలో చేరుతున్నార’ని చెప్పారు.


పులి వితంతువులకు ఆపన్నహస్తం

ముంబైకి చెందిన నీతి గోయెల్‌ 2022లో, ఈ ప్రాంతాన్ని మొదటిసారి పర్యటించినప్పుడు టైగర్‌ వితంతువుల జనాభా 3 వేల కన్నా ఎక్కువగా ఉందని విని నిర్ఘాంతపోయింది. ‘‘అక్కడ పులులు ఉన్నాయని తెలిసి కూడా మీరు అడవుల్లోకి ఎందుకు వెళతారు?’’ అని ఆమె అడిగింది. ‘‘మరి మేము తేనెను ఎలా సేకరించగలం? తేనె అమ్మకపోతే సంపాదించలేం. పులి మమ్మల్ని చంపుతుంది లేదా ఆకలి మమ్మల్ని చంపుతుంది’’ అని వాళ్ళు చెప్పటం ఆమెను గాఢంగా ప్రభావితం చేసింది.

నదులు, మడ అడవుల అందమైన, విస్తారమైన ఈ భూభాగాన్ని 260కి పైగా పక్షి జాతులు, డాల్ఫిన్లు, నీటితాబేళ్ళు సందర్శిస్తాయి. 2010లో, డబ్ల్యు. డబ్ల్యు. ఎఫ్‌ - ఇండియా సంస్థ సుందర్బన్స్‌ బృందంలో ప్రాజెక్ట్‌ అధికారి చిరంజీబ్‌, సుందర్బన్స్‌ టైగర్‌ రిజర్వ్‌ తటస్థ ప్రాంతంలోని ఫిరిఖలీ సమీపంలో నౌకా యానం చేస్తున్నప్పుడు మొదటిసారి ఒక అసాధారణమైన పులిని చూశాడు. ‘‘ఈ పులి స్వభావం దాని పరిసరాలకు విరుద్థంగా అనిపించింది. మనిషి ఈత వేగాన్ని మించి అత్యంత వేగంగా ఈదుతోంది’’ అని చిరంజీబ్‌ తన నివేదికలో వివరించాడు.


సుందర్బన్స్‌లో ఇంటికి తిరిగిరాని మౌళీల (తేనె సేకరించేవారు) భద్రత ఆందోళనను కలిగిస్తుంది. మౌళీలు ఒక రోజు లోపల తిరిగి రాకపోతే, వారు చనిపోయినట్లు భావిస్తారు.

తటప్రాంతంలోని అరణ్యాలు అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలు. వీటిని అటవీశాఖ సరిహద్దులకు దూరంగా పరిగణిస్తుంది - ప్రభుత్వ పరిహారం ఐదు లక్షల రూపాయలు కూడా ఈ ప్రాంతాన్ని మినహాయించింది - ఎందుకంటే ఇక్కడే జంతువులు దాగి ఉంటాయి. అయితే డెల్టాలోని గిరిజనులకు, మరణం అనేది వారి ఇబ్బందులకు మొదలు మాత్రమే. జంతుశాస్త్రం బోధకుడు, సుందర్బన్స్‌లో మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్న టైగర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం.ఎ. అజీజ్‌ ఈ దాడులు జనాభాపై చూపే మానసిక ఆరోగ్య ప్రభావాన్ని నొక్కి చెప్పారు. బాగ్‌ - బిధోబాలలో (పులి వితంతువులు) అత్యంత సాధారణ ఆందోళన పోస్ట్‌-ట్రామాటిక్‌ స్ర్టెస్‌ డిజార్డర్‌. 72ు ఇటువంటి కేసులు పులుల దాడులకు సంబంధించినవి.

book9.4.jpg

సరిహద్దులుగా ఉండే దీవులతో సహా, సుందర్బన్స్‌ గ్రేటర్‌ లండన్‌ కన్నా ఆరు రెట్లు అధికమైన ప్రాంతాన్ని కలిగి ఉంది. 2008 - 2022 మధ్య ేసకరించిన సమాచారం ప్రకారం ఇక్కడ మానవులపై 275 పులుల దాడులు, పశువులపై 349 దాడులు జరిగాయి. ‘‘సంపాదిస్తున్న పురుషుడు పులి దాడి నుంచి గాయాలతో బయటపడినా లేక మరణించినా, ఇతర కుటుంబ సభ్యులపై పెనుభారం పడుతుంది. వారు ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా క్షోభ పడతారు’’ అని అజీజ్‌ తెలిపారు.


ఇది సౌరవి కథ...

ఈ వితంతువుల శ్రేయస్సు కోసం పని చేసిన నీతి గోయల్‌, భర్తల మరణం తరువాత వారి జీవితం ఘోరంగా మారడాన్ని గమనించింది. వారికి డబ్బు, ఆహారం సమకూర్చటం తాత్కాలిక పరిష్కారమే కాబట్టి, ఆమె వారి సాధికారత సాధనంగా చేపల పెంపకంపై దృష్టి కేంద్రీకరించింది. సౌరవి మండల్‌ (50) అనే మహిళ అక్కడికి వచ్చిన పర్యాటకులకు తన ఇంటి ముందున్న చెరువును గర్వంగా చూపిస్తుంది. 2007లో సౌరవి తన జీవితం ముగిసిందని అనుకుంది. పులి దాడిలో భర్తను, కొడుకును, మొసలి దాడిలో తన కూతురిని కోల్పోయింది. అటువంటి పరిస్థితి అధిగమించి ఇప్పుడు ఎంతో స్థిమితంగా జీవిస్తోంది. చేపల పెంపకం ద్వారా తాను రోజుకు 150 రూపాయలు సంపాదిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటుంది. డెల్టాలో నీతి గోయల్‌ రచించిన 499 విజయగాథలలో సౌరవి కథ ఒకటి. నీతి గోయల్‌ సుందర్బన్స్‌ సమాజంతో కలిసి పనిచేయడం ప్రారంభించినప్పుడు, ఆమె వారి సాధికారతను కాంక్షించింది. ‘‘మీరు చేపల పెంపకం ద్వారా సంపాదించాలను కుంటే, మేము సాయపడగలం. అయితే ముందుగా మీరు మీ ఇళ్ల ముందు చెరువును తవ్వుకోవలసి ఉంటుంది’’ అని వారికి సూచించింది.


3 వేల మంది మహిళలను (డెల్టాలో పులుల వితంతువుల సంఖ్య అంచనా) ఒక తాటి మీదకు తీసుకురావడం సాధ్యం కానప్పటికీ, నీతి గోయల్‌ 100 మంది మహిళలతో ఈ నమూనాను పరీక్షించాలని నిర్ణయించుకుంది. ‘‘వారి నష్టం పరిధి, వారి అవసరాల తీవ్రతను బట్టి మహిళలను ఎంచుకున్నాం’’ అని ఆమె వివరించింది. తరువాతి నాలుగు నెలల్లో, మహిళలు చెరువులు తవ్వడం, వెదురుతో ఆక్సిజన్‌ పైపులను తయారు చేసే విధానం నేర్చుకుని వాటిని ఉపయోగించటం, తమ సంరక్షణకు అప్పగించిన చేపలను పర్యవేక్షించడంలో చక్కని ప్రావీణ్యం సంపాదించారు. నాలుగు నెలల్లో చేపల సంఖ్య ఊహాతీతంగా పెరిగింది. ప్రస్తుతం సుందర్బన్స్‌లోని ఫైవ్‌-స్టార్‌ హోటళ్లలో తయారుచేసే రుచికరమైన వంటకాల్లో ఈ చేపలను వినియోగిస్తున్నారు. టైగర్‌ వితంతువులైన మహిళలు తమ హక్కులను సాధించటం నీతి గోయల్‌ ప్రధాన లక్ష్యం. ‘‘మహిళలకు సాధికారత అవసరం లేదు, వారు ఇప్పటికే సాధికారత సాధించుకున్నారు. వారికి కావలసింది అవకాశం మాత్రమే!’’ అని ఆమె నవ్వుతూ చెప్పింది.


భర్తలు, కుటుంబాల అండదండలు లేని ఈ పులి వితంతువులు జీవనోపాధి కోసం నిరంతరం పోరాడుతున్నారు. చేపల పెంపకం, హస్తకళల వంటి చిన్న స్థాయి పనులు చేసుకుంటూ ఇదివరకన్నా కొంత మెరుగ్గా జీవిక నెట్టుకొస్తున్నారు. వారి భర్తల మరణాలకు ఆర్థిక పరిహారం లేకపోవడం వారి కష్టాలను మరింత పెంచుతోంది. ఈ రోజువారీ సవాళ్లను ఎదుర్కోవడం కష్టమైనా పులి వితంతువులుగా పేరుబడ్డ ఈ మహిళలు అద్భుతమైన సంకల్పబలాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ కుటుంబాలను పోషించడానికి, తమ జీవితాలను పునర్నిర్మించడానికి నిరంతరం శ్రమిస్తున్నారు.

- శ్రీదేవీ మురళీధర్‌


ఈ వార్తలు కూడా చదవండి

పేరు రావాలన్నా పోవాలన్నా మీదే బాధ్యత

రైతులకు మహాప్రసాదం భూభారతి

చంద్రబాబు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు..

సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో జాగ్రత్త

వాట్ యాన్ ఐడియా సర్ జీ...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 20 , 2025 | 01:17 PM