Shubhanshu Shukla Quarantine: భారతీయ ఆస్ట్రోనాట్ శుభాన్షూ శుక్లాకు క్వారంటైన్.. కారణం ఇదే
ABN , Publish Date - May 26 , 2025 | 01:03 PM
మరో రెండు వారాల్లో అంతరిక్ష యాత్ర నిర్వహించనున్న శుభాన్షూ శుక్లా క్వారంటైన్‌లోకి వెళ్లారు. యాత్రకు మునుపు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుందా ఈ జాగ్రత్త తీసుకున్నారు.

మానవ సహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలన్న భారత కల సాకారమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వద్ద శిక్షణ పొందుతున్న భారతీయ ఆస్ట్రోనాట్ శుభాన్షూ శుక్లా త్వరలో యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. జూన్ 8న స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లతారు.
అంతరిక్షయాత్ర చేపట్టే ముందు వ్యోమగాములకు క్వారంటైన్ తప్పనిసరి. ఆస్ట్రొనాట్స్ పూర్తి ఆరోగ్యంతో యాత్ర ప్రారంభించేలా శాస్త్రవేత్తలు ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ క్రమంలో శుభమ్ శుక్లా కూడా క్వారంటైన్‌లోకి వెళ్లారు.
యాత్రకు సుమారు 14 రోజుల ముందు ఈ క్వారంటైన్ ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో ఆస్ట్రొనాట్స్.. తమ కుటుంబాలు సహా సాధారణ జనాలకు దూరంగా ఉంటారు. చివరి నిమిషంలో ఎటువంటి ఇన్‌ఫ్లెక్షన్లు సోకకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. అస్ట్రోనాట్స్‌కు ఉన్న ఇన్ఫెక్షన్స్‌తో ఐఎస్ఎస్‌లోని వారికి కూడా ప్రమాదం కాబట్టి శాస్త్రవేత్తలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. ఈ సమయంలో పరిశుభ్రత విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తారు. చేతులను శుభ్రంగా కడుక్కోవడం, రూమ్ వెంటిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉంటారు.
వైద్యులు నిత్యం వారి ఆరోగ్యంపై ఓ కన్నేసి ఉంచుతారు. తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారికి అనారోగ్యం కలిగిందీ లేనిదీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఈ సందర్భంగా చాలా తక్కువ మంది సిబ్బంది మాత్రమే ఆస్ట్రొనాట్స్‌ను సమీపించగలుగుతారు. మిషన్ గురించిన చర్చలు, శిక్షణ కార్యక్రమాలను కూడా ఐసోలేషన్‌లోనే నిర్వహిస్తారు. ఐసోలేషన్‌లో ఉండగా ఆస్ట్రొనాట్స్‌కు ఏదైనా అనారోగ్యం కలిగితే వారిని ఇతర వ్యోమగాములకు దూరంగా మరో చోటుకు తరలిస్తారు.
యాక్సియమ్ -4 మిషన్‌లో శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. భారతీయ వ్యోమగామి అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ యాత్రతో శుభమ్ శుక్లా గడించే అనుభవం భారత్ చేపట్టే గగన్‌యాన్ అంతరిక్ష యాత్రకు ఉపయోగపడనుంది. భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రయోగాలకు గట్టి పునాది అవుతుంది.
ఇవీ చదవండి:
జైలు నుంచి విడుదలయ్యాక ఊరేగింపు.. కర్ణాటక అత్యాచార నిందితుల అరెస్టు
సాటి సైనికుడిని కాపాడే క్రమంలో ఆర్మీ ఆఫీసర్ మృతి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి