EV Scooter buried: ఎలక్ట్రిక్ వాహనంపై ఫ్రస్ట్రేషన్.. ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టి..
ABN , Publish Date - Aug 01 , 2025 | 10:33 PM
తన ఈవీ స్కూటర్‌ను రిపేర్ చేయడంలో షోరూమ్ విఫలమైనందుకు ఓ రాజస్థాన్ వ్యక్తి వినూత్న నిరసనకు దిగారు. వాహనాన్ని ఏడడుగుల లోతున్న గొయ్యిలో పాతిపెట్టారు.

ఇంటర్నెట్ డెస్క్: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. డబ్బు ఆదా, పర్యావరణ పరిరక్షణకు అవకాశం ఉండటంతో అనేక మంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఈ వెహికిల్స్ ఆశించిన స్థాయిలో పని చేయక కొందరు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇక రిపేర్ల సమయంలో ఈవీ వాహన సంస్థల నుంచి సరైన స్పందన లేక చిర్రెత్తుకొచ్చి తమ వాహనాలను మూలన పడేస్తున్నారు. తన ఈవీ స్కూటీ పదే పదే పాడవుతుండటంతో విసిగిపోయిన ఓ యూజర్ తాజాగా ఎవ్వరూ చేయని పని చేశారు. భారీ గొయ్యి తవ్వి వాహనాన్ని పాతిపెట్టాడు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
జాతీయ మీడియా కథనాల ప్రకారం, జోధ్‌పూర్ జిల్లాకు చెందిన సదరు కస్టమర్ కొంత కాలం క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేశాడు. దాదాపు 2 వేల కిలోమీటర్ల తరువాత వాహనంలో సమస్యలు మొదలయ్యాయి. సమస్య పరిష్కారం కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా ఉపయోగం లేకపోయింది. ఆ వాహనాన్ని తయారు చేసిన కంపెనీ సమస్యను పరిష్కరించలేకపోయింది. సర్వీస్ సెంటర్‌కు ఇచ్చిన ప్రతిసారీ రిపేరింగ్ కోసం నెలల తరబడి సమయం పట్టేది. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం లభించేది కాదు. దీంతో, విసిగిపోయిన ఆ కస్టమర్ చివరకు ఊహించని పని చేశాడు.
తన ఇంటి ముందు ఏడడుగుల లోతు వరకూ పెద్ద గొయ్యి తవ్వి అందులో తన వాహనాన్ని పాతిపెట్టాడు. చిరాకు ఎక్కువై ఇలా చేసినట్టు స్థానికులకు తెలిపాడు. దీంతో, ఈ ఉదంతం స్థానికంగా సంచలనానికి దారి తీసింది. అయితే, పలువురు ఈ-వాహనాల కస్టమర్లు గతంలో ఇలాంటి పనులు అనేకం చేశారు. కొందరు తమ ఎలక్ట్రిక్ స్కూటీలను షోరూమ్‌ల ముందు తగలబెట్టారు. మరికొందరు వాటిని అందరూ చూస్తుండగా ధ్వంసం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలపై జనాల్లో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో ఈ ఘటనలను చూస్తే అర్థమవుతోందని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
వామ్మో.. నడి రోడ్డు మీద ఈ రోబో ఏం చేస్తోందో చూస్తే..
ఈ వంటమనిషికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కూడా సాటిరాలేరు.. మహిళా లాయర్ పోస్టు వైరల్