Bihar Wedding: సింధూరం పెడుతుండగా వణికిన వరుడి చేతులు.. వధువుకు డౌటొచ్చి..
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:32 PM
తనకు సింధూరం పెడుతుండగా వరుడి చేయి వణకడం చూసి షాకయిపోయిన వధువు వెంటనే పెళ్లి రద్దు చేసుకుంది. బిహార్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: బిహార్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనకు నుదుట సింధూరం పెడుతున్న వరుడి చేతులు వణకడాన్ని గమనించిన వధువు అప్పటికప్పుడు పెళ్లి రద్దు చేసుకుంది. వరుడిని పెళ్లాడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో చివరకు వరుడు కుటుంబంతో సహా తిరిగెళ్లిపోయారు.
కైముర్ జిల్లాలో ఈ వింత ఘటన జరిగింది. మీడియా కథనాల ప్రకారం, వరుడు, అతడి కుటుంబసభ్యులు భారీ ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్లారు. ఆ తర్వాత పెళ్లి తంతు ప్రారంభమైంది. భారీ మ్యూజిక్, డ్యాన్స్‌ల నడుమ అక్కడ కోలాహలం నెలకొంది. ద్వార్‌చార్, బార్నాత్ వంటి క్రతువులు సంప్రదాయబద్ధంగా జరిగాయి. చివర్లో వరుడు సింధూర్‌దాన్ కార్యక్రమం ప్రారంభించాడు. ఇందులో భాగంగా వధువు నుదుటిన సింధూరం దిద్దేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అకస్మాత్తుగా అతడి చేతులు వణికాయి. ఇది చూసిన వధువుకు అనుమానం మొదలైంది. వరుడు మానసిక వైకల్యం ఉన్న వాడో లేదా మరేదైనా రోగం వచ్చి ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చేసింది. దీంతో అతణ్ని పెళ్లి చేసుకునేది లేదని తేల్చి చెప్పింది. వధువు కుటుంబం కూడా ఆమె నిర్ణయానికి మద్దతుగా నిలిచింది.
చివరకు రచ్చరచ్చ కావడంతో పోలీసులు కల్పించుకోవాల్సిన వచ్చింది. ఇరు కుటుంబాలను స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేశారు. వధువు కుటుంబం మాత్రం పెళ్లికి ససేమిరా అన్నది. ఇక చేసేదేమీ లేకపోవడంతో వరుడు వెనుదిరిగాడు.
ఇక తామిచ్చిన పెళ్లి ఖర్చులు తిరిగివ్వాలని వధువు కుటుంబం కోరగా అవన్నీ ఖర్చయిపోయాయని వరుడి తండ్రి తేల్చి చెప్పాడు. ‘వారు లక్ష ఇస్తామన్నారు. రూ.90 వేల నగదు ఇచ్చారు. అందులో రూ.30వేలు నగలపై వెచ్చించాము. మరో రూ.20 వేలతో దుస్తులు కొన్నాము. రూ.10వేలు డీజే మ్యూజిక్, రవాణాపై వెచ్చించాము. ఇలా డబ్బంతా ఖర్చయిపోయిందని’ అన్నాడు. తన కుమారుడు ఒత్తిడికి లోనవడంతో చేతులు వణికి ఉండొచ్చని, అంత మాత్రానికే పెళ్లి రద్దు చేసుకోవడం ఏంటని ప్రశ్నించాడు. ఇక స్థానికంగా ఈ ఘటన పెను కలకలానికి దారి తీసింది.
ఇవి కూడా చదవండి:
ఏసీ కోచ్‌లో ఇలా ఎవరైనా చేస్తారా.. ఓ ప్రయాణికుడి ఆవేదన నెట్టింట వైరల్
అదృష్టవంతుడంటే ఇతడే.. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక రూ.15.6 కోట్ల లాటరీ