Agra: ఏసీ గది బుక్ చేయని వరుడు.. పెళ్లి రద్దు చేసుకున్న వధువు
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:34 PM
పెళ్లి సమయంలో వరుడి కుటుంబం ఏసీ గది బుక్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు చివరకు పెళ్లిని రద్దు చేసుకుంది. ఆగ్రాలో ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో యువ జంటల్లో సహనం తగ్గిపోతోంది. చిన్న చిన్న తగాదాలకు కూడా బంధాలను తెంచుకునేందుకు వెనకాడటం లేదు. తమ ఇష్టాయిష్టాల విషయంలో అసలు ఏమాత్రం రాజీ పడటంలేదు. చిన్న తేడా వచ్చినా సరే అవతలి వారికి నిర్మొహమాటంగా గుడ్‌బై చెప్పేస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణగా ఆగ్రాలో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, పెళ్లి సందర్భంగా వరుడి కుటుంబం వధువు కోసం ఓ గది బుక్ చేసింది. అయితే, గదిలో ఉన్న వధువు ఏసీ లేదని గుర్తించి తీవ్ర ఆగ్రహానికి గురైంది. వేడి కూడా ఎక్కువగా ఉండటంతో ఉక్క పోతను భరించలేకపోయింది. ఏసీ ఉన్న మరో గది బుక్ చేయాలని వరుడి కుటుంబాన్ని కోరింది. కానీ వారు మాత్రం వధువు డిమాండ్‌ను నిరాకరించారు. చివరకు రెండు కుటుంబాల మధ్య వాగ్వాదం మొదలైంది. చివరకు ఇది తీవ్ర రూపం దాల్చడంతో వరుడు తీవ్ర ఆగ్రహానికి లోనై వధువు, ఆమె కుటుంబంపై నోరు పారేసుకున్నాడు.
అతడి రియాక్షన్‌ను సహించలేపోయిన వధువు వెంటనే పెళ్లి రద్దు చేసుకుంది. అతడిని వివాహమాడేది లేదంటూ అప్పటికప్పుడు పెళ్లి వేదికను వీడింది. మరికొద్ది సేపట్లో పెళ్లి అనంగా ఇదంతా జరగడంతో అతిథులందరూ షాకయిపోయారు.
వివాదం పెద్దది కావడంతో పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. వధువుకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వధువు వరుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కనీస అ వసరాలు తీర్చలేని, మర్యాదగా వ్యవహరించలేని వాడితో జీవితం నరకంగా మారుతుందని పోలీసులకు చెప్పింది. అతడిని పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పింది. పోలీసులు ఆమెకు ఎంతగా నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తన నిర్ణయాన్ని మార్చుకునేదే లేదని ఆమె స్పష్టం చేసింది.
‘ఎన్ని ప్రయత్నాలు చేసిన వివాదం సద్దుమణగలేదు. ఈ క్రమంలో వధువు కుటుంబం వరుడి కుటుంబం పెట్టిన పెళ్లి ఖర్చులు తిరిగిచ్చేందుకు ఒప్పుకుంది. ఆ తరువాత చెల్లింపులు కూడా పూర్తవడంతో అంతా వెళ్లిపోయారు’ అని వధువు కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మీడియాకు తెలిపారు. వరుడు ఇష్టా రీతిన నోరు పారేసుకోవడంతో సర్దుకుపోలేకపోయామని వధువు కుటుంబం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
ఇన్‌స్టాలో ఇద్దరు ఫాలోవర్లు తగ్గడంతో ఆగ్రహం.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు
సింధూరం పెడుతుండగా వణికిన వరుడి చేతులు.. వధువుకు డౌటొచ్చి..