Share News

ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే..

ABN , Publish Date - Aug 03 , 2025 | 08:12 AM

ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే కనిపిస్తాయి. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా, ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మా ణాలు చేశారక్కడ. ఇంతకీ ఆ ‘బాటిల్‌ విలేజ్‌’ ఎక్కడుందంటే...

ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే..

ఆ ఊరిలోకి అడుగుపెడితే... నిర్మాణాలన్నీ ఖాళీ సీసాలతోనే కనిపిస్తాయి. సాధారణంగా ఇల్లు కట్టాలంటే ఇటుకలు కావాలి. కానీ ఒక్క ఇటుక కూడా వాడకుండా, ఖాళీ సీసాలతో ఇళ్ల నిర్మా ణాలు చేశారక్కడ. ఇంతకీ ఆ ‘బాటిల్‌ విలేజ్‌’ ఎక్కడుందంటే...

కాలిఫోర్నియాలోని సిమీ వ్యాలీలో నివసించే ట్రెస్సా ప్రిస్‌బ్రేకు పెన్సిళ్లు, బొమ్మలు సేకరించడం హాబీ. దశాబ్దకాలంలో ఆమె 17 వేల పెన్సిళ్లు సేకరించారు. అయితే ఇరుకైన ఇంట్లో వాటిని ఎక్కడ భద్ర పరచాలో ట్రెస్సాకు అర్థం కాలేదు. కొత్తగా ఇంటిని నిర్మిద్దామంటే ఖర్చు ఎక్కువ. ఒకరోజు ఆమె బ్యూనా పార్క్‌లోని నాట్‌ బెర్రీ ఫామ్‌ థీం పార్కులో ఉన్న ‘బాటిల్‌ హౌజ్‌’ను చూశారు. వెంటనే బుర్రలో తళుక్కున ఆలోచన మెరిసింది. తన ఇంటికి సమీపంలో ఉన్న డంప్‌ నుంచి సీసాలు సేకరించడం ప్రారంభించింది. ఇందుకోసం తన చెల్లెలు సహాయం తీసుకుంది. ఇద్దరూ కలిసి మొత్తానికి పది లక్షల సీసాలు సేకరించారు.


book3.2.jpg

పదిలక్షల బాటిళ్లతో...

బాటిళ్ల సేకరణ పూర్తయ్యాక 1956లో తన అరవై ఏళ్ల వయసులో ట్రెస్సా ‘బాటిల్‌ విలేజ్‌’ నిర్మించడం ప్రారంభించారు. ముందుగా పెన్సిళ్ల కోసం బాటిళ్లతో ఒక ‘పెన్సిల్‌ హౌజ్‌’ను నిర్మించారు. సీసాలను పేర్చుతూ మట్టితో గట్టిపరుస్తూ, గోడల్ని కడుతూ మొత్తానికి తను అనుకున్న ఇంటిని నిర్మించారు. ఇంకా సీసాలు మిగిలిపోవడంతో తను సేకరించిన 600 బొమ్మల కోసం మరో స్టోర్‌రూమ్‌ నిర్మించారు. అయినప్పటికీ ఇంకా సీసాలు పడివున్నాయి. వాటితో క్లియోపాత్ర బెడ్‌రూమ్‌, రౌండ్‌ హౌజ్‌, లీనింగ్‌ టవర్‌... ఇలా గ్రామం నిండా రకరకాల నిర్మాణాలు పూర్తి చేశారు. ఆ విధంగా సీసాలతో మొత్తం పదహారు ఇళ్లను నిర్మించారు. అన్నింటిని కలుపుతూ మొజాయిక్‌తో దారులు నిర్మించారు. దాంతో ఆ ఊరు కళాత్మకంగా, అద్భుతంగా తయారయ్యింది. సీసాల నిర్మాణాలను, గ్రామాన్ని చూసేందుకు పర్యాటకులు ఆసక్తిని కనబరిచేవారు. వాళ్ల దగ్గర ప్రవేశ రుసుము తీసుకునేవారు. అయితే ఊరంతా తిరిగిన తర్వాత పర్యాటకులు అంత కన్నా ఎక్కువే ఇచ్చి వెళ్లేవారట.


చారిత్రాత్మక ప్రాంతంగా...

‘బాటిల్‌ విలేజ్‌’లో సుమారు 25 ఏళ్ల పాటు కొత్తవి నిర్మించడం, పాతవి బాగు చేయడం చేశారు. 86 ఏళ్ల వయసులో ట్రెస్సా మరణించారు. 1994లో సంభవించిన భూకంపం వల్ల బాటిల్‌ విలేజ్‌లో కొన్ని నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం సైట్‌ నిర్వహణ బాధ్యతలను ఒక స్వచ్ఛంద సంస్థ చూసుకుంటోంది. కాలక్రమంలో సిమీ వ్యాలీ చారిత్రాత్మక ప్రాంతంగా నేషనల్‌ రిజిస్టర్‌లో నమోదయ్యింది.

Updated Date - Aug 03 , 2025 | 08:12 AM