Bengaluru Man's Viral Post: ఏటా రూ.60 లక్షల ఆదాయం.. ఇండియాలో ఉండాలో వద్దో తెలియట్లేదు.. యువకుడి ప్రశ్నకు భారీ స్పందన
ABN , Publish Date - Apr 27 , 2025 | 03:20 PM
భారీగా పన్నులు చెల్లిస్తున్నా కనీస మౌలికవసతుల లేమి భారత్‌లో ఇబ్బంది పెడుతోందని ఓ వ్యక్తి అన్నారు. ఇన్ని అవస్థలు పడే బదులు విదేశాలకు వెళ్లిపోవాలా అంటూ నెటిజన్లను ప్రశ్నించాడు. దీనికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఉండాలో వద్దో తెలీట్లేదంటూ బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. రెడిట్‌లో అతడీ పోస్టు పెట్టాడు. తను బెంగళూరులో భార్యతో కలిసి ఉంటున్నట్టు చెప్పుకొచ్చాడు. తమ కుటుంబ ఆదాయం ఏటా రూ.60 లక్షలని అన్నాడు.
‘‘స్థూలంగా చూస్తే మేము హ్యాపీగా ఉన్నామనే అనిపిస్తుంది. కానీ ఇక్కడ జీవన నాణ్యత చూస్తుంటే అసలు స్వదేశంలో ఉండటం దండగ అని అనిపిస్తోంది. మౌలిక వసతులు దిగదుడుపుగా ఉన్నాయి. నేను హొరెమావులో ఉంటాను. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్లాలంటే 40 నిమిషాలు పడుతోంది. ఆఫీసుకు వెళ్లేటప్పటికే అలసిపోతున్నాను. ఏ రోడ్డు చూసినా ఏదోక ఇబ్బంది. నిర్మాణ పనులు ఎల్లప్పుడూ సాగుతూనే ఉంటాయి. దీనికి ఎవరు బాధ్యత వహించాలి?’’
‘‘మనం భారీగా పన్నులు చెల్లిస్తున్నా తిరిగొచ్చేదేమీ ఉండటం లేదు. ఆదాయంలో 30 నుంచి 40 శాతం పన్నులకే పోతోంది. మరి మనకు తిరిగి ఏమి వస్తోంది. ఉచిత వైద్యం లేదు, నాణ్యమైన విద్య లేదు, కనీసం మంచినీరు సరిగా వస్తుందన్న నమ్మకం కూడా లేదు. అధిక పన్నులు వసూలు చేసే జర్మనీ, కెనడా లాంటి దేశాల్లో వైద్యం ఫ్రీ, నాణ్యమైన విద్య లభిస్తుంది, మౌలిక వసతులు సక్రమంగా ఉంటాయి. మంచి నాణ్యమైన జీవనం లభిస్తుంది’’
‘‘భారత్‌లో ఎక్కడ చూసినా అపరిశుభ్ర పరిసరాలు, దుమ్మూధూళి.. ధ్వని కాలుష్యం. రోడ్ రేజ్ సర్వ సాధారణంగా మారింది. ప్రశాంతంగా రోడ్డుపై నడిచే అవకాశమే లేదు. స్వచ్ఛమైన గాలి లేదు. రాత్రి 7 తరువాత నా భార్యను బయటకు పంపించాలంటేనే భయమేస్తోంది. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయాలు మాత్రం పెరగట్లేదు’’ అంటూ తన ఆవేదన వెళ్లబోసుకున్నాడు.
తాను నిజంగా దేశం కోసం పాటుపడదామని అనుకున్నానని, కానీ ఇక్కడి వ్యవస్థలన్నీ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ఒక్కోసారి తనకు అనిపిస్తుందని తెలిపాడు. ప్రజలు చెల్లించే పన్నులన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి చేరుతున్నాయన్న అభిప్రాయం కలుగుతోందని అన్నాడు. పరిస్థితులు బాగుపడతాయని అనుకోవడం నా అత్యాశేనా అని ప్రశ్నించాడు.
జనాల నుంచి ఈ పోస్టుకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది అతడితో ఏకీభవించారు. తాము విదేశాలకు వెళ్లి హ్యాపీగా ఉన్నామని చెప్పుకొచ్చారు. రాజకీయాలే దేశాన్ని నాశనం చేస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. దేశంలో ఉండి పోరాడితే ఫలితం రాకుండా ఉండదని మరికొందరు అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి:
సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలపై పాక్ ప్రజలు ఏమంటున్నారంటే..
మాజీ బాయ్‌ఫ్రెండ్ అప్పులు తీర్చి.. అతడి తల్లిదండ్రుల భారం మోస్తూ..
అకస్మాత్తుగా కూలిన నాలుగు అంతస్తుల భవనం.. సీటీటీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు