Share News

వెదురు వైపు చూస్తున్నారు..

ABN , Publish Date - Jun 15 , 2025 | 12:22 PM

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని అందరూ చెప్పేమాట. అనేక వ్యాధులకు కారణమదే. అందుకే ఇటీవల ప్లాస్టిక్‌ బదులుగా వెదురుతో చేసిన వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. పర్యావరణంపై అవగాహన ఉన్నవారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కావునే రకరకాల వెదురు ఉత్పుత్తులు వెలుగుచూస్తున్నాయి.

వెదురు వైపు చూస్తున్నారు..

ప్లాస్టిక్‌తో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని అందరూ చెప్పేమాట. అనేక వ్యాధులకు కారణమదే. అందుకే ఇటీవల ప్లాస్టిక్‌ బదులుగా వెదురుతో చేసిన వస్తువులకు గిరాకీ పెరుగుతోంది. పర్యావరణంపై అవగాహన ఉన్నవారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. కావునే రకరకాల వెదురు ఉత్పుత్తులు వెలుగుచూస్తున్నాయి.

వెదురుతో స్ట్రాలు

కూల్‌డ్రింక్‌, జ్యూస్‌, కొబ్బరిబొండాం... ఏది తాగాలన్నా ప్లాస్టిక్‌ స్ట్రా ఉపయోగిస్తాం. భూమి, సముద్రాల కాలుష్యంలో ప్లాస్టిక్‌ స్ట్రాలదే అతి పెద్ద పాత్ర. అందుకే వాటి స్థానంలో పర్యావరణహితమైన వెదురు స్ట్రాలు ఉపయోగిస్తే మేలు. బ్యాంబూ స్ట్రాలు రీయూజబుల్‌ మాత్రమే కాకుండా బయోడీగ్రేడబుల్‌ కూడా. అవి సముద్రజీవులకు ఎలాంటి హాని చేయవు.


చలువ అద్దాలు

వెదురుతో చేసిన సన్‌గ్లాసెస్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్లాస్టిక్‌, మెటల్‌ఫ్రేమ్స్‌కు బదులుగా బ్యాంబూతో చేసిన ఫ్రేమ్స్‌ పర్యావరణ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాంబూ సన్‌గ్లాసెస్‌ హానికరమైన యూవీ కిరణాల నుంచి రక్షణ కల్పించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదపడుతున్నాయి. ఎక్కువకాలం మన్నికగా ఉండే బ్యాంబూ రకాన్ని ఈ అద్దాల ఫ్రేమ్‌ తయారీలో వాడతారు. క్యాజువల్‌ ఔటింగ్స్‌, అవుట్‌డోర్‌ అడ్వెంచర్స్‌కు వెళ్లే సమయంలో ఈ బ్యాంబూ సన్‌గ్లాసెస్‌ నప్పుతాయి. వీటితో పర్యావరణం పట్ల మీకున్న చిత్తశుద్ధి ఎదుటివారికి తెలుస్తుంది.

book7.2.jpg

యోగా మ్యాట్స్‌

ఈ మధ్య బాగా పాపులర్‌ అవుతున్న బ్యాంబూ ఉత్పత్తుల్లో యోగా మ్యాట్‌ కూడా ఉంది. సహజసిద్ధమైన బ్యాంబూ ప్యానెల్స్‌తో తయారుచేసిన ఈ యోగా మ్యాట్స్‌ సౌకర్యవంతంగా ఉండటం, హానిరహిత మెటీరియల్‌తో తయారైనది కావడంతో.. యోగా ప్రేమికులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. కర్బన ఉద్గారాలను తగ్గించాలని కోరుకునే పర్యావరణ ప్రియులకు మేలైన ఎంపికగా ఈ మ్యాట్‌ ఉంటోంది.


వెదురు గడియారాలు

లెదర్‌ బెల్ట్‌తో తయారైన వాచ్‌లు ధరించడం అందరూ చేసేదే. ట్రెండీగా కనిపించాలంటే బ్యాంబూ వాచ్‌ పెట్టుకోవాల్సిందే. మణికట్టుపై వెదురుతో తయారైన గడియారం నేచురల్‌ బ్యూటీగా కనిపించడంతో పాటు నలుగురిలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతుంది.

book7.3.jpg

బ్యాంబూ బ్యాగ్‌

ప్రకృతికి ఎక్కువ నష్టం కలిగించేవి ప్లాస్టిక్‌ బ్యాగులే. వాటి వాడకాన్ని తగ్గించాలంటే వెదురు బ్యాగులను ఉపయోగించడం మంచి ఆప్షన్‌. ప్రకృతిని సంరక్షించుకోవాలని కోరుకునేవారు ఈ బ్యాగుల వాడకాన్ని ఇష్టపడుతున్నారు.

స్టోరేజ్‌ బాక్స్‌లు

బొమ్మలు, పుస్తకాలు, బట్టలు.... ఇలా ఇంట్లో వస్తువులు సర్దుకోవడానికి బ్యాంబూ బాక్స్‌లు చక్కగా పనికొస్తాయి. ఇవి రకరకాల సైజుల్లో, ఆకృతుల్లో లభిస్తున్నాయి. విరివిగా దొరికే ప్లాస్టిక్‌ బాక్స్‌లకు ఇవి ప్రత్యామ్నాయం. ఇంట్లో ఎకోఫ్రెండ్లీ వాతావరణం ఉండాలని కోరుకునేవారికి ఇవి మంచి ఆప్షన్‌.


వెదురు ఆకులతో టీ

బ్యాంబూతో బుట్టలు, బ్యాగ్‌లు, వాచ్‌లు మాత్రమే కాదు. టీ కూడా తయారుచేసుకోవచ్చు. వియత్నాంకు చెందిన ‘ఓసియన్స్‌ రిపబ్లిక్‌’ అనే సంస్థ వెదురు ఆకులతో టీ తయారుచేస్తోంది. నాణ్యమైన లేత వెదురు ఆకులను సేకరించి, ప్రాసెస్‌ చేసి టీ పొడిని అందిస్తోంది. ఒత్తిడి నుంచి రీఫ్రెష్‌ కావాలని కోరుకునే ప్రకృతి ప్రేమికులు ఈ టీని ట్రై చేయవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి.

భలే బాటిల్స్‌

ఇంట్లో ఫ్రిజ్‌ తెరిస్తే రకరకాల ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌ కనిపిస్తాయి. ప్లాస్టిక్‌ హానికరం అని తెలిసి కూడా ఎందుకు ఉపయోగించడం? ప్లాస్టిక్‌ బదులుగా బ్యాంబూ బాటిల్స్‌ను ఎంచుకోవడం తెలివైన పని. తేలికగా ఉండటంతో పాటు మన్నికగా ఉంటాయి. ఆరోగ్య స్పృహ ఉన్నవారు వీటిని ఎంచుకుంటున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 12:22 PM