Auto Rickshaw Driver: రోడ్డుపై బరితెగించిన ఆటో డ్రైవర్.. ప్రాణాలు తీసే స్టంట్..
ABN , Publish Date - May 29 , 2025 | 08:20 PM
Auto Rickshaw Driver: పక్కన వాహనాలు ఉన్నా కూడా ఆటో డ్రైవర్ ఏ మాత్రం తగ్గలేదు. జెట్ స్పీడుతో అక్కడినుంచి దూసుకుపోయాడు. బ్రిడ్జి దాటిన తర్వాత ఆటోను నేలపై ఆనిచ్చాడు.

దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోడ్డు ప్రమాదాల్లో చేయని తప్పుకు.. అభంశుభం తెలియని అమాయకులే ఎక్కువగా బలి అవుతున్నారు. కొంతమంది వాహనదారులు మనుషుల్లా కాకుండా సైకోల్లా ప్రవర్తిస్తున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. ఈ మధ్య కాలంలో వాహనాలతో స్టంట్లు చేసే వారు ఎక్కువయ్యారు. బైకులు, కార్లు, ఆఖరికి ఆటోలతో కూడా స్టంట్లు చేస్తున్నారు. అది కూడా బిజీ రోడ్లపై స్టంట్లు చేస్తూ ఇతరుల్ని ప్రమాదాల్లో పడేస్తున్నారు.
తాజాగా, రాజస్థాన్‌లోని గ్వాలియర్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బ్రిడ్జిపై ఆటోతో స్టంట్ చేశాడు. ఆటోను ఓ వైపు వాల్చి రోడ్డుపై వేగంగా నడిపాడు. నీదమ్ ఓవర్ బ్రిడ్జిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో గురువారం నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలో ఏముందంటే.. ఆటోను డ్రైవర్ కుడి వైపు వాల్చి బ్రిడ్జిపై వేగంగా పోనిస్తూ ఉన్నాడు. ఆటోలో డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నాడు. అతడు ఆటోలోంచి తల బయటకు పెట్టి, చేతిలోని గుడ్డ ముక్కను ఉత్సాహంగా ఊపుతూ ఉన్నాడు.
పక్కన వాహనాలు ఉన్నా కూడా ఆటో డ్రైవర్ ఏ మాత్రం తగ్గలేదు. జెట్ స్పీడుతో అక్కడినుంచి దూసుకుపోయాడు. బ్రిడ్జి దాటిన తర్వాత ఆటోను నేలపై ఆనిచ్చాడు. వైరల్‌గా మారిన వీడియోపై ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆటో నడిపిన వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ప్రాణాలతో ఆడుకోవద్దంటూ హితవు పలుకుతున్నారు.