Share News

AI Revolution: కృత్రిమమేధ.. ఇక అన్నీ అద్భుతాలే..

ABN , Publish Date - Apr 27 , 2025 | 12:05 PM

పురాణాల్లో విన్నట్టు... చందమామ కథల్లో చదివినట్టు... హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్టు... ఎన్నెన్నో అద్భుతాలు నిజంగా జరిగితే...? ఆశ్చర్యంగా ఉన్నా.. అవన్నీ మన కళ్లముందు ఆవిష్కృతమవుతున్న రోజులివి. నిద్ర లేచిందగ్గర్నుంచీ రాత్రి పడుకునేదాకా... అడుగడుగునా సాంకేతికత మన వెన్నంటే ఉంటోంది. ఒక వస్తువైనా, సేవ అయినా ‘ఏఐ’ని అదనంగా చేర్చితే దాని విలువ ఎన్నో రేట్లు పెరుగుతోంది.

AI Revolution: కృత్రిమమేధ.. ఇక అన్నీ అద్భుతాలే..
AI

అరచేతిలోనే అఖండ విశ్వం చూడొచ్చు!

అనారోగ్యానికి గురైతే అరనిమిషంలో వైద్య సాయం పొందొచ్చు!

రోజుల సమయం పట్టే పనులు క్షణాల్లోనే పూర్తి చేసుకోవచ్చు!

చరిత్రలో మిగిలిపోయిన ఎన్నో మిస్టరీలను చేధించవచ్చు!

మన జీవనశైలిలో ప్రతి అంశంలోకి సాంకేతికత వచ్చి చేరుతోంది. ఇటీవలికాలంలో కృత్రిమమేధ (ఏఐ) మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మా‘నవ’ జీవనంలో ఈ సరికొత్త సాంకేతిక ప్రభావంపై ఈవారం కవర్‌స్టోరీ.

పురాణాల్లో విన్నట్టు... చందమామ కథల్లో చదివినట్టు... హాలీవుడ్‌ సినిమాల్లో చూపించినట్టు... ఎన్నెన్నో అద్భుతాలు నిజంగా జరిగితే...? ఆశ్చర్యంగా ఉన్నా.. అవన్నీ మన కళ్లముందు ఆవిష్కృతమవుతున్న రోజులివి. నిద్ర లేచిందగ్గర్నుంచీ రాత్రి పడుకునేదాకా... అడుగడుగునా సాంకేతికత మన వెన్నంటే ఉంటోంది. ఒక వస్తువైనా, సేవ అయినా ‘ఏఐ’ని అదనంగా చేర్చితే దాని విలువ ఎన్నో రేట్లు పెరుగుతోంది. విద్య నుంచి వైద్యం వరకూ, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకూ ఏఐ, మెటావర్స్‌ సాంకేతికత విస్తరిస్తూ మన జీవనవిధానాన్ని నెక్ట్స్‌ లెవల్‌కు తీసుకెళ్తున్నాయి. ఇవి కేవలం మన పనితీరును మాత్రమే కాదు, వ్యక్తిగత జీవితం, సమాచారం, ఆరోగ్యం, వినోదం, విద్య, ఉద్యోగ అవకాశాలు వంటి అనేక రంగాలను సమూలంగా మార్చేస్తున్నాయి. ఏఐ - ఒక ఊహామాత్రంగా మొదలై, నేడు మానవ జీవితంలో అంతర్భాగమైంది. మెటావర్స్‌ - ఇంటర్నెట్‌ విప్లవానికి తదుపరి మైలురాయి. ఈ రెండూ కలసి భవిష్యత్తులో మన జీవనశైలిని ఊహించనంత వేగంగా మార్చబోతున్నాయి.


‘మరో’ మనిషి

అజయ్‌ ఇంటికి ఇద్దరు ఫ్రెండ్స్‌ వచ్చారు. ‘‘చిట్టీ.. రెండు కాఫీలు పట్రా’’ అన్నాడు. కొద్దిసేపట్లోనే చిట్టీ కాఫీ కప్పులు తీసుకువచ్చి టేబుల్‌పై పెట్టింది. ఆ కాఫీలు తీసుకొచ్చింది మనిషి కాదు... ఒక రోబో. అవును.. ఇంతకాలం పరిశ్రమలకే పరిమితమైన రోబోలు మన ఇంట్లో పనులు చేసి పెడుతున్నాయి. వంటలు చేసేందుకు కూడా సిద్ధమైపోతున్నాయి. నార్వేకు చెందిన ‘తీగీ’ అనే కంపెనీ గత ఏడాది ఆగస్టులోనే ‘నియో బేటా’ అనే రోబోను ఇంటి పనుల కోసం విడుదల చేసింది. ఇది సాక్సులు అందివ్వడం, బ్యాగులు ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనులు చేసేది. అయితే తాజాగా విడుదల చేసిన ‘నియో గామా’ రోబో ఇంట్లో అన్ని పనులతో పాటు కాఫీ కూడా పెట్టిచ్చేదాకా ఎదిగింది. ఈ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం ఏజిలిటీ, ఆప్టట్రానిక్‌, బోస్టన్‌ డైనమిక్స్‌, ఫిగర్‌, టెస్లా... తదితర కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఇంట్లో వాక్యూమ్‌ క్లీనర్ల రూపంలో రోబోలు ఇంటిని శుభ్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ రోబోల పనితీరుని ఏఐ ఆధారంగా కోడ్‌ రూపొందించి తయారు చేస్తారు. పూర్తి అటానమీ ఉన్నా, దాని యజమాని కమాండ్స్‌ మేరకు పనిచేస్తాయి. చుట్టుపక్కల ఉన్నవారిని, వస్తువులను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాయి. అందువల్ల వాటిని ఉపయోగించేవారికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇవి కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేస్తూ అచ్చంగా మనుషుల మాదిరిగానే పనులను చేస్తాయి.


book5.2.jpg

అమెరికాకు చెందిన ఫిగర్‌ కంపెనీ నిర్మించిన హెలిక్స్‌ రోబోలను Vision-Language&Action (VLA) నమూనాలో తయారు చేశారు. దీనిని కమాండ్‌ చేసిన వెంటనే ఇంట్లోని వస్తువులను అందిస్తుంది. కొన్ని వస్తువులను ఉంచి మనకు ఏది కావాలో చెబితే దాన్నే అందివ్వడం దీని ప్రత్యేకత. ఈ కంపెనీ నుంచే మనిషితో మాట్లాడే మర మనుషులు కూడా రానున్నట్లు సమాచారం. హ్యుమనాయిడ్‌ రోబోలకు రానున్న కాలంలో విపరీతమైన డిమాండ్‌ ఉంది. వీటి మార్కెట్‌ లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంటుందని టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అంచనా వేశారు. వృద్ధులకు ఇళ్లలోనూ ఆస్పత్రుల్లోనూ ఆత్మీయ సహాయకుని పాత్ర పోషించే రోబోలకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటా మంచి గిరాకీ ఉందట.


వార్తలు చదువుతూ...

‘‘బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే.. మీ మేధస్సు నన్ను పుట్టించింది. ఇక నుంచి నేను వార్తలు చదువుతాను’’ అంటూ ఏఐ యాంకర్‌లు చక్కని హావభావాలతో టీవీల్లో వార్తలు చదివి వినిపిస్తున్నాయి. సమాచారం సేకరించేందుకు, రాసేందుకు, ప్రసారం చేసేందుకు జర్నలిస్టులకు కృత్రిమ మేధ ఎంతో సహాయకారిగా ఉంటోంది. వార్తలు అందించడంలోనూ, చదవడంలోనూ కొత్త అనుభూతికి లోనయ్యే సమయం ఆసన్నమైందంటున్నారు టెక్‌ నిపుణులు. పూర్తిస్థాయి ఏఐతో కూడిన న్యూస్‌ ప్లాట్‌ఫామ్‌ యాప్‌లు రూపొందిస్తున్నారు. ఇక న్యూస్‌ యాంకర్లు కాకుండా... ఏఐ యాంకర్లు ఆయా భాషల్లో స్పష్టంగా వార్తలు చదువుతారు.


ఆరోగ్యమస్తు...

రానున్న కాలంలో వైద్య రంగంలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకంగా మారుతోంది. సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, అలా్ట్రసౌండ్‌ స్కాన్‌ లాంటివాటిని నిశితంగా పరిశీలించడానికి డాక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఏఐ ఆ పనిని సులభతరం చేయడమే గాక, కంటికి కనపడని అత్యంత సూక్ష్మమైన తేడాలను కూడా గుర్తించి కచ్చితత్వంతో కూడిన రిపోర్టులు అందిస్తుంది. క్యాన్సర్‌లాంటివి రాకముందే హెచ్చరిస్తుంది. భవిష్యత్‌లో మనల్ని ఎటాక్‌ చేయబోతున్న వ్యాధిని ముందే గుర్తిస్తుంది. జన్యుక్రమాన్ని విశ్లేషించి అవసరమైన జాగ్రత్తలూ సూచిస్తుంది. సర్జరీ చేసే సమయంలో వైద్యుల కంటికి కనిపించని అతి సూక్ష్మ రక్తనాళాలను పొరపాటున కత్తిరించే ప్రమాదం ఉంటుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వాడినప్పుడు వాటిని గుర్తించి అప్రమత్తం చేస్తుంది. మెదడు సర్జరీల్లో ఏఐ పాత్ర చాలా కీలకమవుతుంది. చికిత్స సమయం కూడా తగ్గుతుంది.

book5.4.jpg


ఇంతకుముందు ఒక కొత్త ఔషధాన్ని కనుగొనడానికి రెండు దశాబ్దాలకు పైగా పట్టేది. ఇప్పుడు ఏఐని వినియోగించి కేవలం రెండేళ్లలోనే కొత్త మందును కనిపెట్టడానికి వీలవుతున్నది. పక్షవాతం రోగికి మెదడులో ఏఐతో కూడిన న్యూరోలింక్‌ అనే చిప్‌ను పెట్టడం వల్ల కాళ్లు చేతులు కదుపుతాడు. ‘అపోలో’ ఈ ఏడాది ప్రారంభంలోనే మైక్రోసాఫ్ట్‌ సంస్థతో కలిసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ బేస్డ్‌ రిస్క్‌ స్కోర్‌ (ఏఐసీవీడీ) విధానాన్ని ఆవిష్కరించింది. దీనితో రాబోయే పదేళ్ళలో ఒక మనిషికి హృద్రోగ సమస్య వస్తుందా రాదా అని తేల్చేయొచ్చట! మెటావర్స్‌ సాంకేతికతతో రోగి తన గుండె ఆరోగ్యాన్ని తానే నేరుగా చూసేలా ‘డీప్‌ ఎక్స్‌’ అని మరో టెక్నాలజీనీ తీసుకొచ్చింది.


ఆన్‌లైన్‌లో ఉచిత వైద్యసాయం

అనుకోకుండా ఒక వ్యక్తి జారి పడి, మోకాలుకు గట్టి దెబ్బ తగిలింది. ఆసుపత్రికి తీసుకెళ్లే పరిస్థితి లేదు.. మరెలా? ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్‌ఫోన్‌లో గాయం ఫొటోను తీసి మెడికల్‌ ఏఐకి అప్‌లోడ్‌ చేస్తే చాలు. దానిలోని ఏఐ వ్యవస్థలు ఇమేజ్‌ను విశ్లేషించి ఎలా శుభ్రం చేయాలో, ఎలా ఉండాలో చెబుతాయి. ఎప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లాలో కూడా సూచిస్తాయి. అలాగే ఏదో జబ్బు చేసింది. పరీక్షల రిపోర్టు వచ్చింది. కానీ అది అర్థం కావటం లేదు. ఎటూ తేల్చుకోలేక పోతుంటే, రిపోర్టును ఫొటో తీసి అప్‌లోడ్‌ చేస్తే చాలు.. భారతీయ భాషల్లో తేలికగా ఆ రిపోర్టు అర్థమయ్యేలా వివరిస్తుంది.

ఇలా వైద్యపరంగా సహాయం తీసుకోవడానికి ముంబైకి చెందిన ఫ్రాక్టల్‌ సంస్థ రూపొందించిన వైద్య.ఏఐ ((https://vaidya.ai))ని ఉచితంగానే వాడుకోవచ్చు. ఇది వెబ్‌సైట్‌, యాప్‌లో అందుబాటులో ఉంది. ప్రధాన భారతీయ భాషల్లో ఇంటరాక్ట్‌ కావొచ్చు. మందులు, ఫుడ్‌ లేబుళ్లు, పోషకాలు వంటి రకరకాల సమాచారాన్ని తేలికగా అర్థమయ్యేలా, సరైన పద్ధతిలో అందిస్తుంది. స్కాన్‌, ఎక్స్‌రే, పరీక్షల రిపోర్టులను అర్థం చేసుకోవటానికి తోడ్పడుతుంది. తెలుసుకున్న సమాచారం ఆధారంగా డాక్టర్‌తో మరింత బాగా చర్చించేందుకు ఉపకరిస్తుంది. డాక్టర్లు ఇచ్చే సూచనలను తేలికగా పాటించడానికి తోడ్పడుతుంది.


వ్యవ‘సాయం’... ఆధునికం...

వ్యవసాయ కూలీలు దొరకడం లేదని తరచూ రైతులు వాపోతుంటారు. దీనికి కూడా పరిష్కారం చూపిస్తోంది ఏఐ. మనిషి అవసరం లేకుండా యంత్రాలు భూమిని చదును చేస్తున్నాయి.. దున్నుతున్నాయి.. నాట్లు వేస్తున్నాయి.. నీళ్లు పెడుతున్నాయి. కలుపు తీస్తున్నాయి.. ఎరువులు వేస్తున్నాయి.. పంట ఎదుగుదలను పరిశీలిస్తున్నాయి.. చీడపీడలను గుర్తిస్తున్నాయి.. క్రిమిసంహారకాలు చల్లుతున్నాయి.. కోతలు కోస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, చైనా, జపాన్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాల్లో వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ వాడుతున్నారు. కంప్యూటర్‌ అంటే ఏమిటో తెలియని రైతుకీ ఆధునిక సాంకేతిక సేవల్ని అందించడం ‘ఏఐ’తో సాధ్యమైంది. మనదేశంలోనూ ఏఐ టెక్నాలజీతో అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది.


ఈ మేరకు హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్డీ)లోని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్టెన్స్‌’కు ఏఐ ఆధారిత ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, విస్తరణ బాధ్యతలను అప్పగించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు దేశాల్లో అన్ని రంగాల్లో కృత్రిమ మేధను వాడుతున్నారు. ప్రకృతి విపత్తులపై రైతులను ముందుగానే అప్రమత్తం చేయడం.. కాలానికి తగిన పంటల సాగు, ఎరువులు, పురుగు మందుల వాడకంలోనూ ఈ సాంకేతికతను వినియోగిస్తున్నారు. అల్గరిథం వాడకం వల్ల కచ్చితమైన విశ్లేషణ లభిస్తుంది. మెషిన్‌ లెర్నింగ్‌తో పంటల నుంచి కలుపు మొక్కలను తొలగించడానికి ఆకుల పరిమాణం, ఆకారం, రంగును కంప్యూటర్‌ విజన్‌ విశ్లేషిస్తుంది, అవసరమయ్యే సలహాలిస్తుంది.

ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో విశాలమైన మైదానాల్లో మేతకు వెళ్లే పశువులకు వాటి చెవుల వెనకాల అగ్గిపెట్టె సైజు పరికరం అమర్చి ఉంటుంది. సౌరశక్తితో పనిచేసే ఆ పరికరం ఆధారంగా పశువు ఎక్కడ ఉంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాంటి మేత తిన్నదీ తదితర సమాచారాన్నంతా యజమాని ఇంటి దగ్గర నుంచే గమనించగలుగుతాడు.


పెళ్లి వేడుకల్లో సైతం...

కాలం చేసిన ఆత్మీయులు పైలోకం నుంచి వచ్చి.. భూలోకంలో జరుగుతున్న పెళ్లిలో సందడి చేసి.. వధూవరులను ఆశీర్వదిస్తే ఎలా ఉంటుంది? అయినవారితో కలిసి వారు కూడా భోజనం చేస్తే.. ఈ ఊహ ఎంతో గొప్పగా ఉంది కదూ. అలాంటి ఊహలను నిజంచేస్తోంది ఏఐ. ఆ వీడియోలను ఏఐ సహయంతో రూపొందించి, వేడుకల్లో ప్రదర్శించి అతిథులను ఆశ్చర్యపరచడం కొత్త ట్రెండ్‌. ఇంట్లో శుభకార్యం చేస్తున్న సమయంలో, కొత్త జంటలు పెళ్లి రోజు వేడుకల్లో, అభిమానించే వ్యక్తుల పుట్టిన రోజు వేడుకల్లోనూ ఈ వీడియోలను ప్రదర్శిస్తూ కుటుంబసభ్యుల హావభావాలను, భావోద్వేగాలను వీడియోలో బంధిస్తున్నారు. ఆయా వ్యక్తుల రూపంతో పాటు, స్వరాన్నీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసి.. మాట్లాడుతున్నట్టు, ఆశీర్వదిస్తున్నట్లు భావన కల్పిస్తున్నారు. వీటిని వీఆర్‌ హెడ్‌సెట్‌లో చూడొచ్చు, ప్రత్యేక ఎల్‌ఈడీ తెరలపై ప్రదర్శిస్తున్నారు. ఇటీవల ఓ వ్యక్తి పుట్టిన రోజు వేడుకల్లో ఏఐ వీడియో ప్రదర్శించడంతో కొన్నేళ్ల క్రితం చనిపోయిన వాళ్ల నాన్న.. కృత్రిమంగా వీడియోలో ప్రత్యక్షం కావడంతో ఆయన ఆనందానికి అవధుల్లేవు. జీవితంలో మరుపురాని బహుమతి అంటూ కంటతడి పెట్టుకున్నారు.


ఛార్జింగ్‌, నెట్‌ లేని ఫోన్‌...

‘టెస్లా’ ఫోన్‌ గురించి ఎలాన్‌మస్క్‌ అధికారికంగా ప్రకటించలేదు, కానీ ఆ ప్రాజెక్టు ఇతర స్మార్ట్‌ఫోన్లకు భిన్నంగా ఉండే అవకాశముంది. టెస్లా స్మార్ట్‌ఫోన్‌కు ఇంటర్నెట్‌ అవసరం లేదు. స్పేస్‌ఎక్స్‌ ఉపగ్రహంతో నేరుగా ఇది పనిచేస్తుందట. సోలార్‌ ఎనర్జీ ద్వారా ఆటోమేటిక్‌గా ఛార్జ్‌ అవుతుంది అనే ప్రచారం జరుగుతోంది. టెస్లా స్మార్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు గతంలో పుకార్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది టెస్లా ఫోన్‌కు విద్యుత్‌ అవసరం లేకుండా సౌరశక్తితో ఛార్జ్‌ చేయవచ్చని బాగా ప్రచారం జరిగింది.


ఏ దేశానికైనా గంటలోపే...

అమెరికాకు వెళ్లాలంటే దాదాపు 18 నుంచి 24 గంటలు విమానంలో ప్రయాణించాలి. అలాంటిది అమెరికాకు ఓ సీరియల్‌ ఎపిసోడ్‌ చూసే టైమ్‌లోనే వెళ్లిపోతే... అంటే కేవలం 40 నిమిషాల్లో అక్కడ అడుగుపెడితే... అసలా ఊహే ఎంతో అందంగా ఉందని అనుకుంటున్నారు కదా. ఇదే నిజం చేస్తానంటున్నారు మస్క్‌. అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్‌కో నుంచి ఢిల్లీకి 40 నిమిషాల్లో చేరుకోవచ్చంటున్నారు. స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ప్రయాణ మార్గాన్ని సులభతరం చేయడం, తక్కువ టైమ్‌లో ఎక్కువ దూరం ట్రావెల్‌ చేసేలా ఎలాన్‌ మస్క్‌ ఒక ప్రాజెక్ట్‌కు డిజైన్‌ చేశారు. ఇప్పటికే అనేకసార్లు స్టార్‌షిప్‌ను పైకి వదిలి ప్రయోగాలు చేశారు. ఆ పనిలోనే స్పేస్‌ఎక్స్‌ బిజీగా ఉందిప్పుడు.


సినిమా తీసేయొచ్చు...

ఒక సినిమా తీయాలంటే కొన్ని వందల మంది పని చేయాలి. ఒక సినిమా పూర్తి చేసేందుకు సాధారణంగా 3 నెలల నుంచి ఏడాదిన్నర వరకు సమయం పట్టొచ్చు. కానీ కృత్రిమ మేధ ఎంట్రీ ఇస్తూ కొత్త ‘సినిమా’ చూపిస్తానంటోంది. మీరు అడగాలేగానీ సినిమా తీసి పెట్టలేనా అంటోంది. అవును నిజమే! సినిమా తీయాలనుకునే వారి అభిరుచులకు తగ్గ ఐడియా ఇస్తుంది. కథ, స్ర్కీన్‌ ప్లే, మాటలు రాస్తుంది. మ్యూజిక్‌ అందిస్తుంది, పాట పాడుతుంది. గ్రాఫిక్స్‌, యానిమేషన్‌ కూడా రూపొందిస్తుంది. అంతేనా.. పాత్రధారులను సైతం మనం అనుకున్నట్టు రూపొందిస్తుంది! కథకు తగ్గట్టు యాక్షన్‌ చెబుతుంది. ఇంకేముంది ప్రతీ సీన్‌ ఊహలకు అనుగుణంగా తయారవుతుంది. వందల కోట్ల రూపాయలతో తీసే సినిమాను అతి తక్కువ ఖర్చులోనే పూర్తి చేసే రోజులు సమీప భవిష్యత్‌లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు!


‘నిప్పు, విద్యుత్‌ ఎలాగైతే మానవజాతి గతిని మార్చాయో అలాగే కృత్రిమమేధ కూడా’ అంటారు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌. మనిషీ, యంత్రమూ చేయీ చేయీ కలిపి ఆడుతూ పాడుతూ పనిచేసే రోజులు ఇప్పటికే వచ్చేశాయంటారాయన. కృత్రిమమేధ సాయంతో యంత్రాలు ఇప్పుడు చదవగలవు, రాయగలవు, మాట్లాడగలవు. ‘మనిషి చేసే ఎన్నో పనుల్ని అవి చేయగలుగుతున్నాయి కాబట్టి వాటికి ఆ పనులు అప్పజెప్పి మనుషులు అంతకన్నా పై స్థాయిలో... సృజనాత్మకత, ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌ అవసరమైన పనులు చేసుకోవాల’న్నది నిపుణుల సూచన. అంటే, ఇక ముందు ఏఐ అన్ని రంగాల్లోనూ మనకు కుడి భుజంగా మారనుందన్న మాట!

- ముద్దం నరసింహస్వామి, 99498 39699


ఈ వార్తలు కూడా చదవండి

లిక్కర్‌ దందాల కవితకు రాహుల్‌ పేరెత్తే అర్హత లేదు

పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్‌ బాధితుడు

జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ

యువతితో షాకింగ్ డాన్స్..

Read Latest Telangana News and National News

Updated Date - Apr 27 , 2025 | 12:33 PM