జంతువులకూ వంతెనలున్నాయి..
ABN , Publish Date - Apr 27 , 2025 | 11:09 AM
రోడ్డు మీదో, వీధుల్లోనో వాహనంపై వేగంగా దూసుకుపోతుంటే... అకస్మాత్తుగా ఏ కుక్కో, లేగదూడో అడ్డంగా వస్తే కంగారుపడి, దానికేమయ్యిందోనని ఆందోళన చెందుతాం. మరి అడవుల గుండా సాగే జాతీయ రహదారుల్లో వాహనాల టైర్ల కింద పడే జంతువుల మాటేంటి? వాటి కోసం ఏం చేయలేమా? అంటే... ఇదిగిదిగో... జంతువుల కోసమే ఇలా ప్రత్యేకంగా వంతెనలు నిర్మించారు. అలాంటి కొన్ని వంతెనలివి...

మనుషుల కోసమే కాదు, జంతువుల కోసమూ కొన్ని వంతెనలు ఉన్నాయి. జంతువులు ప్రమాదాల బారిన పడకుండా ఉండటం కోసం కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేకంగా వంతెనలు నిర్మించారు. ఆయా ప్రదేశాల్లోని జంతువులు క్షేమంగా రోడ్డు దాటేందుకు అనువుగా నిర్మించిన వంతెనలను చూస్తే ముచ్చటేస్తుంది.
ఉడుతల కోసం...
ఉడుతలు, కొండముచ్చులు జాగ్రత్తగా రహదారి దాటడం కోసం కనోపి వంతెనలు కేరళ, తమిళనాడు సరిహద్దులోని ‘చిన్నార్ వైల్డ్‌లైఫ్ శాంక్చరీ’లో కనిపిస్తాయి. ఈ అభయారణ్యంలో అద్భుతమైన ఎకోసిస్టమ్ కనిపిస్తుంది. అరుదైన ఔషధమొక్కలు విరి విగా కనిపిస్తాయి. అలాగే ఉడుతలు, కొండ ముచ్చులు, ఇతర జంతువులకు ఈ అభయా రణ్యం ఆవాసంగా ఉంది. అయితే ఆ ప్రాంతం గుండా ఉన్న జాతీయ రహదారి జంతువుల పాలిట శాపంగా మారింది.
వేగంగా వెళ్లే వాహనాల కింద పడి చాలా జంతువులు మరణించాయి. ఇందులో జాతీయ రహదారి 15 కి.మీ మేర ఉంటుంది. జంతువులు తరుచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో అధికారులు 19 చోట్ల కనోపీ వంతెనల్ని నిర్మించారు. అధికారుల ఆలోచన సత్ఫలి తాలు ఇచ్చింది. జంతువులు రోడ్డు దాటేందుకు వంతెనలు చక్కగా ఉపయోగ పడ్డాయి. వంతెనలు నిర్మించాక రోడ్డుపైకి జంతువులు వెళ్లడం తగ్గిపోయింది. వాషింగ్టన్ లోని లాంగ్‌వ్యూ ప్రాంతంలోనూ ఉడుతల కోసం నిర్మించిన ‘నట్టీ న్యారో బ్రిడ్జ్’లు కనిపిస్తాయి. ఆ ప్రాంతంలో ఉడుతల కోసం ఏకంగా 9 వంతెనలు నిర్మించారు. కార్ల కింద పడి ఉడుతలు చనిపోతుండటంతో అధికారులు న్యారో బ్రిడ్జీలు ఏర్పాటు చేశారు.
తొలి జాతీయ రహదారి...
బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్... నాగ్‌పూర్- ముంబయిని కలిపే ఎక్స్‌ప్రెస్ వే ఇది. ఈ రహదారిపై జంతువుల కోసం 9 గ్రీన్ వంతెనలు, 17 అండర్‌పాస్‌లను నిర్మించారు. జంతువుల కోసం వంతెనలు నిర్మించిన మొట్ట మొదటి జాతీయ రహదారి ఇది. జంతువులు రోడ్డుపైకి రాకుండా ‘లియోపార్డ్ ప్రూఫ్ ఫెన్సింగ్’ను నిర్మించారు. ఇక్కడ జాతీయ రహదారి 120 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. రోడ్డు దాటాలంటే జంతువులకు చాలా కష్టం. అయితే వంతెనలు కట్టాక వాటికి ఇబ్బంది లేకుండా పోయింది. 9 వంతెనలు మొక్కలతో నిండుగా, అడవిని తలపిస్తూ ఉంటాయి. దాంతో జంతువులు జంకు లేకుండా వంతెనపై నుంచి రోడ్డు దాటుతుంటాయి.
తాబేళ్ల నడకదారి...
తాబేళ్ల నడక అందరికీ తెలిసిందే. అవి రోడ్డు దాటాలంటే చాలా సమయం పడు తుంది. అందుకే వాటి కోసం అమెరికాలో టన్నెల్స్ నిర్మిస్తే, జపాన్‌లో ప్రత్యేకమైన కాలువలు నిర్మించారు. జపాన్‌లోని కోబ్ పట్టణంలో ఉన్న ‘సుమో ఆక్వాలైఫ్ పార్కు’లో తాబేళ్లు పుష్కలంగా ఉన్నాయి. అవి పార్కు పక్కనే ఉన్న రైల్వే ట్రాక్‌ను దాటే ప్రయత్నం చేసేవి. ఆ క్రమంలో రైలు కింద పడి చని పోయేవి. దీన్ని నివారించడం కోసం ఆక్వాలైఫ్ పార్క్ అధికారులతో కలిసి వెస్ట్ జపాన్ రైల్వే కంపెనీ అధికారులు ప్రత్యేక కాలువల్ని నిర్మించారు. వీటిని ‘ఎకో డక్ట్స్’ అని, ‘వైల్డ్‌లైఫ్ క్రాసింగ్స్’ అని పిలుస్తుంటారు. అమెరికాలోని విస్కాన్సిన్ ప్రాంతంలోనూ తాబేళ్ల కోసం ప్రత్యేకంగా నిర్మించిన టన్నెల్స్‌ను చూడొచ్చు. అమెరికాలో తాబేళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి కారణం రోడ్డు ప్రమాదాలేనని గుర్తించిన యూనివర్సిటీ పరిశోధకులు విస్కాన్సిన్ స్టేట్ ఏజెన్సీ అధికారులతో కలిసి నీటి కొలనులు ఉన్న ప్రాంతంలో టన్నెల్స్ నిర్మించారు. ఈ ఆలోచన అద్భుతమైన ఫలితాలను అందించింది.
పీతలూ దాటేస్తాయి...
జంతువుల కోసం వంతెనలు నిర్మించడం మామూలే. కానీ హిందూ మహాసముద్రంలో ఉన్న క్రిస్‌మస్ ఐలాండ్‌లో పీతల కోసం వంతెన నిర్మించారు. ప్రతీ ఏటా మొదటి వర్షం పడగానే క్రిస్‌మస్ ఐలాండ్‌లోని కొన్ని లక్షల పీతలు అడవిలో నుంచి సముద్రం వైపు వలసపోతుంటాయి. గుడ్లు పెట్టడం కోసం పీతలన్నీ మైగ్రేట్ అవుతుంటాయి. అయితే ఈ క్రమంలో రహదారులు దాటుతూ వాహనాల కింద చాలా పీతలు చనిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన అఽధికారులు పీతలు సురక్షితంగా రోడ్డు దాటేందుకు ప్రత్యేకంగా వంతెన నిర్మించారు. ప్రపంచంలో నిర్మించిన ఏకైక ‘క్రాబ్ బిడ్జ్’ ఇదే. క్రాబ్ మైగ్రేషన్ సమయంలో దీవిలో ఆ దారిగుండా వాహనాలు వెళ్లకుండా ఆపేస్తారు. కొన్ని చోట్ల దారి మళ్లిస్తారు.
- బ్రెజిల్‌లో కోతులు రోడ్డు దాటడం కోసం ప్రత్యేకంగా తాళ్లతో వంతెన ఏర్పాటు చేశారు.
- సింగపూర్‌లో ‘మండాయ్ వైల్డ్‌లైఫ్ బ్రిడ్’ అడవిని తలపిస్తుంది. ఆరు వరుసల జాతీయ రహదారిని దాటడం కోసం చెట్లు, పొదలతో సహజసిద్ధంగా కనిపించేలా వంతెన నిర్మించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లిక్కర్ దందాల కవితకు రాహుల్ పేరెత్తే అర్హత లేదు
పొన్నం చొరవతో స్వస్థలానికి గల్ఫ్ బాధితుడు
జాతీయ మహిళా సాధికారత కమిటీ సభ్యురాలిగా డీకే అరుణ
Read Latest Telangana News and National News