విమానంలో ఫేమస్.. అక్కడే పెళ్లి.. తర్వాత..
ABN , Publish Date - Jul 27 , 2025 | 01:46 PM
విమానయానం గురించి సోషల్‌మీడియాలో చెబుతూ పాపులర్ అయిన సామ్ చూయి... విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే ఫియోనాను ప్రేమించాడు. వాళ్లిద్దరూ తమ పెళ్లి విమానంలోనే జరగాలనుకున్నారు.

విమానయానం గురించి సోషల్‌మీడియాలో చెబుతూ పాపులర్ అయిన సామ్ చూయి... విమానంలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసే ఫియోనాను ప్రేమించాడు. వాళ్లిద్దరూ తమ పెళ్లి విమానంలోనే జరగాలనుకున్నారు.
చార్టెర్డ్ బోయింగ్ 747 విమానంలో, బంధు మిత్రుల నడుమ, ఆకాశంలో వేల అడుగుల ఎత్తులో జూలై 12న ‘స్కై వెడ్డింగ్’ చేసుకున్నారు. వధూ వరులతో పాటు, బంధుమిత్రులతో నిండిపోయిన విమానం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లోని ఫుజైరా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరి, గల్ఫ్, ఒమన్‌ల మీదుగా సుమారు గంటన్నరపాటు ఆకాశంలో చక్కర్లు కొట్టింది. ఈ సమయంలోనే పెళ్లి తంతు ముగిసింది.
పెళ్లి కోసం విమానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సుమారు 100 కుర్చీలను తొలగించి, విమానం లోపల వేదికలా మార్చారు. బ్రైడల్ వాక్, డ్యాన్స్‌ఫ్లోర్ కూడా ఏర్పాటుచేశారు. గానాబజానాతో సందడి చేశారు. ఆకాశంలో పెళ్లి చేసుకునేందుకు సామ్ చూయి జంట విమాన ఫీజుల కోసం బాగానే ఖర్చుపెట్టినప్పటికీ ‘జీవిత కాలపు అనుభవం’ అంటూ మురిసిపోతోంది. ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన సుమారు 10 లక్షల మంది ఫాలోవర్స్ ‘కలను పండించుకున్నందుకు కంగ్రాట్స్’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.