93 Year Old Man: పెళ్లై 70 ఏళ్లు.. భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు..
ABN , Publish Date - Jun 18 , 2025 | 03:13 PM
93 Year Old Man: ఇద్దరికీ పెళ్లై 70 ఏళ్లు పైనే అయింది. పెళ్లై 70 ఏళ్లు అయినా.. నడవడానికి కూడా ఇబ్బందిపడే వయసులో ఉన్నా.. షిండేకు మాత్రం భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు.

93 ఏళ్ల ఓ వృద్ధుడ్ని భార్య ఓ కోరిక కోరింది. మంగళసూత్రం కొనిపించమని అడిగింది. ఆ పెద్దాయన భార్య కోరికను కాదనలేకపోయాడు. రూపాయి రూపాయి కూడ బెట్టిన డబ్బంతా తీసుకుని షాపు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఓ కళ్లు చెమర్చే సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర, జల్నా జిల్లాలోని అంభోరా జహంగీర్ గ్రామానికి చెందిన నివృత్తి షిండే, శాంతాబాయి భార్యాభర్తలు. షిండే వయసు 93 సంవత్సరాలు, శాంతాబాయి వయసు 85 పైనే ఉంటుంది. ఇద్దరికీ పెళ్లై 70 ఏళ్లు పైనే అయింది. పెళ్లై 70 ఏళ్లు అయినా.. నడవడానికి కూడా ఇబ్బందిపడే వయసులో ఉన్నా.. షిండేకు మాత్రం భార్య మీద ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు. భార్య మంగళసూత్రం కావాలని అడిగితే కాదనలేకపోయాడు. కొద్దిరోజుల క్రితం భార్యను వన్ గ్రామ్ గోల్డ్ షాపుకు తీసుకెళ్లాడు.
పల్లెటూరి దుస్తుల్లో ఉన్న వారిని చూసి షాపు వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారు. సాయం కోసం లోపలికి వస్తున్నారని అనుకున్నారు. ‘ఏం కావాలి’ అని షాపు సిబ్బంది అడగ్గా.. ‘నా భార్యకు మంగళసూత్రం కావాలి. చూపించండి’ అని అన్నాడు. షాపు ఓనర్ ఆశ్చర్యపోయాడు. ఎమోషనల్ కూడా అయ్యాడు. కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రాన్ని ఇచ్చేశాడు. షాపు ఓనర్ మాట్లాడుతూ.. ‘భార్యాభర్తలు షాపులోకి వచ్చారు. 1,120 నా చేతిలో పెట్టి, తన భార్య కోసం మంగళసూత్రం కావాలన్నాడు.
నేను ఎమోషనల్ అయ్యాను. కేవలం 20 రూపాయలు మాత్రమే తీసుకుని మంగళసూత్రం ఇచ్చేశాను’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో గోపిక జ్యువెలరీ షాపు ఖాతాలో పోస్టు అయింది. వీడియో కాస్తా వైరల్ అయింది. కోటికి పైగా వ్యూస్ తెచ్చుకుంది. ఇక, గ్రామస్తులు.. వృద్ధజంట గురించి మాట్లాడుతూ.. వాళ్లు ఎప్పుడూ కలిసే తిరుగుతూ ఉంటారని చెప్పారు. కొడుకు ఉన్నా కూడా.. అతడి దగ్గర కాకుండా వేరేగా ఉంటున్నారని అన్నారు.
ఇవి కూడా చదవండి
వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..
రాజా హత్యకేసులో వెలుగుచూసిన మరో కొత్తపేరు