13 Rupees Shirt Offer: బట్టల షాపు బంపర్ ఆఫర్.. రూ. 13కే షర్ట్.. ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు..
ABN , Publish Date - Nov 08 , 2025 | 03:36 PM
ఓ వ్యక్తి తన బట్టల షాపు ప్రమోషన్ కోసం ఎవ్వరూ ఊహించని ఆఫర్ పెట్టాడు. కేవలం 13 రూపాయలకే అన్ని రకాల షర్ట్స్ అమ్ముతున్నట్లు ప్రకటించాడు. దీంతో వందలాది మంది షాపు దగ్గరకు చేరుకున్నారు. అంతమందిని చూసి షాపు యజమాని బిక్కచచ్చిపోయాడు.
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత స్వీయ ప్రచారాలు ఎక్కువైపోయాయి. తమ బిజినెస్‌ను ప్రమోట్ చేసుకోవటానికి చిన్న వ్యాపారులు సోషల్ మీడియాను ఓ ఆయుధంలా ఉపయోగించుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేసి సక్సెస్ అయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే, కొన్ని సార్లు అతి ప్రమోషన్ల కారణంగా ఇబ్బందులపాలు కావాల్సి వస్తుంది. పంజాబ్‌కు చెందిన ఓ బట్టల వ్యాపారి తన షాపు ప్రమోషన్ కోసం ఓ బంపర్ ఆఫర్ పెట్టాడు. కేవలం 13 రూపాయలకే షర్ట్ అమ్ముతున్నట్లు ప్రకటించాడు.
దీంతో జనం పెద్ద ఎత్తున షాపు దగ్గరకు చేరుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే. ఆ వివరాల్లోకి వెళితే.. లుథియానాకు చెందిన ఇంద్రదీప్ సింగ్ అనే వ్యక్తికి ‘స్టైల్ ఫ్యాషన్ వరల్డ్’ అనే బట్టల షాపు ఉంది. అతడు తన షాపునకు సంబంధించిన ప్రమోషన్ల కోసం సోషల్ మీడియాను ఎంచుకున్నాడు. తరచుగా మంచి మంచి ఆఫర్స్ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే గురు నానక్ జయంతి సందర్భంగా అందరూ నోరెళ్ల బెట్టే ఆఫర్ పెట్టాడు. కేవలం 13 రూపాయలకే డెనిమ్, చెక్స్, డిజైనర్ షర్ట్స్ అమ్ముతున్నట్లు ప్రకటించాడు.
ఆఫర్ తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 13 రూపాయల షర్ట్స్ కోసం జనం పెద్ద ఎత్తున షాపు దగ్గరకు చేరుకున్నారు. అది కూడా షాపు తెరవక ముందే వందల సంఖ్యలో జనం గుమిగూడిపోయారు. దీంతో రచ్చ మొదలైంది. రోడ్డుపై జనం తోసుకోసాగారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకోసాగారు. ఇక, ఆ జనాన్ని చూసి సింగ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. కొంతమందికి మాత్రమే షర్ట్స్ అమ్మి షాపు క్లోజ్ చేశాడు. ఈ సంఘటనపై సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను 13 రూపాయలకే షర్ట్స్ అమ్ముతానని చెప్పాను.
అది కూడా మొదటి 50 కస్టమర్లకు మాత్రమే అమ్ముతానని చెప్పాను. కానీ, 70 మందికి అమ్మాను’ అని చెప్పాడు. ఇక, జనం మాత్రం అతడు అబద్ధం చెబుతున్నాడని అంటున్నారు. వీడియోలో ఎంత మందికి షర్ట్స్ ఇస్తాడో సంఖ్య చెప్పలేదని మండిపడుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తప్పుడు ఆఫర్లతో జనాన్ని తప్పుదోవపట్టించాడా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఫీజు రీయింబర్స్‌మెంట్ అడిగితే వీధి రౌడీలాగా మాట్లాడుతారా.. సీఎం రేవంత్‌పై కవిత ఫైర్
అందుకే తిలక్‌ను పక్కన పెట్టాం: సూర్యకుమార్ యాదవ్