CM Revanth Reddy: జపాన్ తెలుగు సమాఖ్య కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:01 PM
జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడి తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన తెలంగాణ అనేక రంగాల్లో ముందడుగు వేస్తోందని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రైజింగ్ తెలంగాణ ప్రతినిధి బృందం జపాన్‌లో (Japan) పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించారు.
అనేక రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఐటీ, ఫార్మా రంగంలో సాధించాల్సినంత ప్రగతి సాధించామని అన్నారు. తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణను అందరం కలిసి అభివృద్ధి చేసుకోవాలని పిలుపు నిచ్చారు. టోక్యోలో అభివృద్ధి చేసిన రివర్ ఫ్రంట్ పరిశీలించామని కూడా సీఎం రేవంత్ తెలిపారు.
నీరు మన సంస్కృతికి, అభివృద్ధికి ప్రతీక అని అన్నారు. ఈ సందర్భంగా మూసీ నది గురించి కూడా ప్రస్తావించిన సీఎం నది ప్రక్షాళనకు కొంతమంది అడ్డుపడుతున్నారని అన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో అన్ని సంస్థలకు సెలవులు ఇస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పారు. కేవలం కాలుష్యంతో ఢిల్లీ నగరం స్థంభించే పరిస్థితిని చూసి అందరం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. ఈ కారణంగానే హైదరాబాద్‌లో మూసీ ప్రక్షాళన చేయాలని అన్నారు.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్స్ తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరం చెప్పారు. ఎవరికి చేతనైనంత వారు చేయగలిగింది చేస్తే.. ప్రపంచంతోనే తెలంగాణ పోటీ పడొచ్చని అన్నారు. ఈ దిశగా ఎన్నారైలు తమ ఆలోచనలను రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవాలని సూచించారు. సొంత ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ఉన్న ఆనందం ఏమిటో అందరికీ తెలిసిందేనని అన్నారు.
ఇవి కూడా చదవండి:
నిరాశ్రయులకు టిప్యాడ్ ఆధ్వర్యంలో ఫుడ్ డ్రైవ్
డల్లాస్ ఈద్ మిలాప్ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి డా.పెమ్మసాని
హంగ్‌కాంగ్‌లో వైభవంగా శ్రీ విశ్వావసు నామ ఉగాది వేడుకలు