Share News

Bitter Gourd Recipe: కాకరకాయతో భలే రుచిగా..

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:05 AM

కాకరకాయలకు తొడిమలు తీసి మధ్యలో చాకుతో సన్నని గాటు పెట్టాలి. చెంచా సహాయంతో లోపల ఉన్న గింజలను తీసివేయాలి.

Bitter Gourd Recipe: కాకరకాయతో భలే రుచిగా..

utki.jpgగుత్తి కాకరకాయ

కావాల్సిన పదార్థాలు

  • లేత కాకరకాయలు- పావు కేజీ, పసుపు- అర చెంచా, ఉప్పు- రెండు చెంచాలు, మెంతులు- పావు చెంచా, జీలకర్ర- అర చెంచా, ధనియాలు- ఒక చెంచా, నువ్వులు- రెండు చెంచాలు, నూనె- ఆరు చెంచాలు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, చింతపండు- అయిదు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు- ఎనిమిది, కారం- మూడు చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు

తయారీ విధానం

  • కాకరకాయలకు తొడిమలు తీసి మధ్యలో చాకుతో సన్నని గాటు పెట్టాలి. చెంచా సహాయంతో లోపల ఉన్న గింజలను తీసివేయాలి. ఒక గిన్నెలో ఒక చెంచా ఉప్పు, పావు చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కాకరకాయలకు పట్టించి అరగంటసేపు అలాగే ఉంచాలి. తరవాత కాకరకాయలను ఒక్కోదాన్ని చేత్తో గట్టిగా పిండి రసాన్ని తీసివేయాలి.

  • స్టవ్‌ మీద గిన్నెపెట్టి కాకరకాయలు వేసి అవి మునిగేవరకూ నీళ్లు పోసి ఉడికించాలి. అవి సగానికి పైగా ఉడికిన తరవాత పళ్లెంలోకి తీయాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి మెంతులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి ఎర్రగా వేపాలి. వాటిని పళ్లెంలోకి తీసి చల్లార్చాలి. అదే గిన్నెలో మూడు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేపాలి. చింతపండు కూడా వేసి రెండు నిమిషాలు మగ్గించాలి. తరవాత స్టవ్‌ మీద నుంచి దించాలి. మిక్సీలో మెంతులు, నువ్వులు తదితరాలు వేసి మెత్తని పొడి చేయాలి. తరవాత ఉల్లిపాయలు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పావు చెంచా పసుపు, కారం, ఒక చెంచా ఉప్పు, కరివేపాకు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ పేస్టుని గిన్నెలోకి తీసి బాగా కలపాలి. ఉప్పు సరిచూడాలి. దీన్ని చేత్తో కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉడికించిన కాకరకాయల లోపల నిండుగా నింపాలి.

  • స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి మూడు చెంచాల నూనె వేసి వేడి చేయాలి. ఇందులో కాకరకాయలను పేర్చి మూతపెట్టి బాగా వేగనివ్వాలి. అయిదు నిమిషాల తరవాత కాకరకాయలను జాగ్రత్తగా తిప్పుతూ అన్నివైపులా ఎర్రగా వేపాలి. తరవాత పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారు చేసుకున్న గుత్తి కాకరకాయ వేడి అన్నంలోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

  • కాకరకాయలను నేరుగా నీటిలో కాకుండా ఆవిరి మీద ఉడికిస్తే వాటిలో పోషకాలు నిలుస్తాయి.

  • నువ్వులకు బదులు పల్లీలు వేసుకోవచ్చు.

  • కాకరకాయలను చిన్న మంటమీద ఎర్రగా వేపాలి. లేకపోతే చేదుగా అనిపిస్తాయి. దోరగా వేగితేనే వాటికి కమ్మదనం వస్తుంది.


tykj.jpg

కాకరకాయ చికెన్‌

కావాల్సిన పదార్థాలు

  • చికెన్‌- పావు కేజీ, కాకరకాయలు- మూడు, ధనియాల పొడి- ఒక చెంచా, టమాటా ముక్కలు- ఒక కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- తగినంత, నూనె- అయిదు చెంచాలు, కారం- రెండు చెంచాలు, పసుపు- పావు చెంచా, ఉప్పు- ఒకటిన్నర చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- రెండు

తయారీ విధానం

కాకరకాయలను సన్నని పొడవైన ముక్కల్లా కోయాలి. స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేపి పళ్లెంలోకి తీయాలి. ఇదే గిన్నెలో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేపాలి. తరవాత చికెన్‌ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మగ్గించాలి. పది నిమిషాల తరవాత కారం, టమాటా ముక్కలు వేసి కలపాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తరవాత ఒక గ్లాసు నీళ్లు పోసి మరిగించాలి. తరవాత వేయించిన కాకరకాయ ముక్కలు, ధనియాల పొడి వేసి నెమ్మదిగా కలపాలి. రెండు నిమిషాల తరవాత కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ కాకరకాయ చికెన్‌ కూర... వేడి అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది.

జాగ్రత్తలు

  • కాకరకాయ ముక్కలను చక్రాల్లా కూడా కోసుకోవచ్చు.

  • ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేసుకుంటే కూర కమ్మగా ఉంటుంది.

  • చికెన్‌ ముక్కలను మరీ మెత్తగా మగ్గించకూడదు.

  • పసుపు, ఎరుపు రంగులు కలగలిసిన టమాటాలను తీసుకుంటే కాకరకాయ ముక్కల చేదు తగ్గుతుంది.


tyj.jpg

కాకరకాయ నిల్వ పచ్చడి

కావాల్సిన పదార్థాలు

  • కాకరకాయలు- అర కేజీ, చింతపండు- 80 గ్రాములు, బెల్లం- చిన్న ముక్క, మెంతులు- ముప్పావు చెంచా, ఆవాలు- రెండు చెంచాలు, జీలకర్ర- రెండు చెంచాలు, నువ్వుల నూనె- రెండు కప్పులు, వెల్లుల్లి రెబ్బలు- పది, ఇంగువ- పావు చెంచా, ఎండుమిర్చి- రెండు, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉప్పు- ముప్పావు కప్పు, కారం- ఒక కప్పు, పసుపు- ఒక చెంచా

తయారీ విధానం

  • కాకరకాయలను మంచినీళ్లతో కడిగి అరగంటసేపు ఆరబెట్టాలి. తరవాత మరీ సన్నగా కాకుండా కొద్దిగా లావుపాటి చక్రాలుగా తరిగి పలుచని గుడ్డ మీద పరచి తేమ లేకుండా ఆరనివ్వాలి. వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా దంచి ఉంచుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు వేసి శుభ్రంగా కడగాలి. అది మునిగేవరకూ నీళ్లు పోసి బెల్లం వేసి కలపాలి. ఈ గిన్నెను స్టవ్‌ మీద పెట్టి చింతపండు మెత్తబడే వరకూ అంటే కనీసం అయిదు నిమిషాలపాటు ఉడికించాలి. తరవాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి.

  • స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి మెంతులు, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్రలను విడివిడిగా వేయించి ఒక పళ్లెంలోకి తీయాలి. వీటిని చల్లార్చాలి. తరవాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేసి చిన్న గిన్నెలోకి తీయాలి. ఈ మిక్సీ గిన్నెలోనే చింతపండు మిశ్రమం వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని జల్లి గంటెలో వేసి చెంచాతో అదుముతూ మెత్తని గుజ్జును గిన్నెలోకి వడబోయాలి.

  • స్టవ్‌ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నువ్వుల నూనె పోసి వేడి చేయాలి. ఇందులో కాకరకాయ ముక్కలు వేసి పెద్ద మంట మీద దోరగా వేపాలి. కొద్దిగా రంగు మారడం మొదలవగానే కాకరకాయ ముక్కలను పళ్లెంలోకి తీయాలి. తరవాత ఈ నూనెలోనే కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి దోరగా వేపాలి. తరవాత ఇందులో చింతపండు గుజ్జు వేసి కలిపి తడి పోయేవరకూ వేపాలి. తరవాత స్టవ్‌ మీద నుంచి దించి చల్లార్చాలి.

  • మరో పెద్ద గిన్నెను తీసుకుని అందులో మెంతి-ఆవ పిండి, ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలపాలి. తరవాత వేయించిన కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. వెంటనే చల్లారిన చింతపండు గుజ్జు మిశ్రమం కూడా వేసి బాగా కలపాలి. ఈ పచ్చడి మీద మూతపెట్టి రెండు రోజులపాటు ఊరనివ్వాలి. తరవాత ఉప్పు సరిచూసుకుని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇలా తయారు చేసిన కాకరకాయ పచ్చడి...... వేడి అన్నం, చపాతీ, పుల్కా, బ్రెడ్‌లోకి రుచిగా ఉంటుంది. ఇది రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది.

Updated Date - Jul 12 , 2025 | 12:06 AM