Share News

Fashions: ఇప్పుడు రవికే.. ఓ ఆభరణం

ABN , Publish Date - Oct 12 , 2025 | 09:40 AM

పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ అంటేనే ధగధగల మెరుపులు. ‘ఎత్నిక్‌’ లుక్‌ లో మెరిసిపోవాలని చూస్తారు అతివలు. ఖరీదైన మగ్గం బ్లౌజులతో పాటు, నగల నగిషీలకు ఆకాశమే హద్దు. ఫంక్షన్లను బట్టి బ్లౌజులు ఎన్నయినా మార్చొచ్చుగానీ, నగలను అంత సులువుగా మార్చలేరు కదా.

Fashions: ఇప్పుడు రవికే.. ఓ ఆభరణం

పండగలు, పెళ్లిళ్ల సీజన్‌ అంటేనే ధగధగల మెరుపులు. ‘ఎత్నిక్‌’ లుక్‌ లో మెరిసిపోవాలని చూస్తారు అతివలు. ఖరీదైన మగ్గం బ్లౌజులతో పాటు, నగల నగిషీలకు ఆకాశమే హద్దు. ఫంక్షన్లను బట్టి బ్లౌజులు ఎన్నయినా మార్చొచ్చుగానీ, నగలను అంత సులువుగా మార్చలేరు కదా. ఈ సమస్యకు చక్కని పరిష్కారం ‘బిజ్యుయెలరీ’ బ్లౌజులు... వాటి హంగుల ట్రెండ్స్‌ మీ కోసం...

పెళ్లి, పేరంటం, పూజలు, పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవం ... ఇలా సందర్భం ఏదైనా.. కార్యక్రమం ఏదైనా సాంప్రదాయ దుస్తులకే పెద్దపీట వేస్తారు భారతీయ మహిళలు. ఆ రోజు ధరించాల్సిన చీర, నగలను ముందుగానే సిద్ధం చేసుకుంటారు.


చీరకట్టుకు సరిపోయేలా మ్యాచింగ్‌ హారం, గాజులు, లోలాకులు, వంకీలు, పాపిడబిల్ల, వడ్డాణం, పట్టీలు... అన్నీ సెట్‌ చేసుకుంటారు. అదే రెండు మూడు రోజుల వేడుక అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి... ఇలా పూట పూటకు మార్చే చీరతో పాటు జ్యుయెలరీ కూడా సెట్‌ అయ్యేలా ప్రణాళికలు వేసుకుంటారు. ఇకపై ఇలాంటి ఖరీదైన ప్లానింగ్‌కు కాస్త విరామం ఇవ్వొచ్చు. బంగారం, వెండి రేట్లు ఆకాశాన్ని తాకడంతో... వాటికి ప్రత్యామ్నాయంగా ఆభరణాల రవికెలు (‘బిజ్యుయెలరీ’ బ్లౌజులు) ట్రెండింగ్‌లో నిలిచాయి. ఈ బ్లౌజుల మెరుపుల వల్ల అసలు నగల అవసరమే రాదని చెబుతున్నారు ఫ్యాషన్‌ పండితులు. ముత్యాలు, రత్నాలు, మాణిక్యాలు... లాంటి విలువైన రాళ్లని పొదిగి, బ్లౌజ్‌నే అతి పెద్ద నగలా తీర్చిదిద్దితే... ఇక వేరే నగలెందుకు?


బంగారం ధర పెరగడంతో...

సాదా జాకెట్ల కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు అన్నీ వర్క్‌ బ్లౌజ్‌లే. ఎంబ్రాయిడరీ, మగ్గమ్‌, కుందన్‌, మిర్రర్‌, జర్దోజీ వర్క్‌ల బ్లౌజ్‌ల మెరుపులు బాగా ఊపందుకున్నా యి. అన్ని రకాల చీరలు, ఓణీలతో నప్పే ఈ బ్లౌజుల వల్ల లుక్‌ గ్రాండ్‌గా మారుతుంది. ఇంతవరకూ ఓకే. అయితే నగల దగ్గరకి వచ్చే సరికి తర్జన భర్జన. చోకర్‌, నెక్లెస్‌, లాంగ్‌ చెయిన్లు సాధారణంగా ఉంటాయి. ప్రతీ వేడుకకు అవే రిపీట్‌ చేయడం మామూలే. అందుకే కొన్ని ఫంక్షన్ల తరవాత ‘ఎప్పుడూ అవేనా?’ అనే అసంతృప్తి వచ్చేస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తవి కొనుక్కోవాలంటే కష్టమే. పైగా బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది. ఇలాంటి అయోమయంలో వెలుగులు నింపేందుకు కొత్తగా వచ్చాయి ఆభరణాలు పొదిగిన జాకెట్లు.


book5.2.jpg

మీ ఇష్టానికి తగినట్లు మెడ చుట్టూ లేదా చేతులు, నడుము, బ్యాక్‌సైడ్‌.. ఇలా ఆభరణాల బంగారు రేకులు, పూసలు, ముత్యాలను జాకెట్లకు పొదిగి... ఎలిగెంట్‌ లుక్‌ను తీసుకువస్తున్నారు డిజైనర్లు. ఇక పెళ్లికూతురు ‘బిజ్యుయెలరీ’ బ్లౌజులో ఎంతగా మెరిసిపోతుందో వేరే చెప్పక్కర్లేదు. ఒక్క బ్లౌజ్‌ ఎన్నో ఆభరణాలకు చెక్‌ పెడుతుంది. పైగా నగల్లాగా పోగొట్టుకుంటామనో, దొంగల భయమో ఉండదు.

ఇషా అంబానీ వంటి కుబేరుల కూతుళ్లతో పాటు బాలీవుడ్‌ తారలు ఆలియా భట్‌, జాన్వీ కపూర్‌, భూమి పెడ్నేకర్‌ లాంటి బాలీవుడ్‌ తారలు నగల రవికెల్లో అద్భుతంగా కనిపిస్తూ ఈ ట్రెండ్‌ను మరింత పాపులర్‌ చేశారు.


ఆమె వల్లే...

నిజానికి వివిధ రాళ్లు, పూసలతో జాకెట్లను రూపొందించడం ఎప్పటి నుంచో ఉంది. అయితే 2024లో అనంత్‌ అంబానీ, రాధికా మర్చెంట్ల వివాహంలో ఇషా అంబానీ ధరించిన బ్లౌజ్‌ ఫ్యాషన్‌ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. డిజైనర్లు అబు జానీ, సందీప్‌ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన ‘బిజ్యుయెలరీ’ బ్లౌజుతో ఆమె ప్రత్యక్షమయ్యింది. అందులో పొదిగిన ఆభరణాలలో ఇషా సొంత నగలనూ కొన్నింటిని ఉపయోగించారు. ‘బిజ్యుయెలరీ’ బ్లౌజు కుట్టడం ఆషామాషీ కాదు. మొదట రవికె డిజైన్‌ గీస్తారు. ఆ తరవాత ఆభరణాలను తొలిగించి అందులోంచి పసిడి భాగాలు, రాళ్లు, ముత్యాలు తదితరాలన్నింటినీ వేరు చేస్తారు. బ్లౌజ్‌ పీస్‌ను కత్తిరించి దాని మీద డిజైన్‌కు తగినట్టుగా ఆభరణాల భాగాలను అతికిస్తారు లేదా బంగారు, వెండి జర్దోజీ దారాలతో కుడతారు. ఆ తరవాతే దాన్ని బ్లౌజ్‌గా కుట్టి తుదిమెరుగులు దిద్దుతారు. దీనికి డిజైనింగ్‌ నైపుణ్యంతో పాటు... ఎంతో నైపుణ్యం, శ్రద్ధ, ఓపిక అవసరం. అందుకే వీటి ధరలు వేలల్లో కొన్నిసార్లు లక్షల్లో ఉంటాయి. రవికెలో ఉపయోగించే ఆభరణాలపై ఈ రేటు ఆధారపడి ఉంటుందంటున్నారు డిజైనర్లు.


బ్లౌజులతోనే ఆగలేదు...

ఇటీవల లగ్జరీ డిజైనర్‌వేర్‌ ఐటిఆర్‌హెచ్‌ ‘జాదూ’ పేరున నగలతో చేసిన బ్లౌజుల కలెక్షన్‌లను సోషల్‌ మీడియాలో విడుదల చేసింది. విలువైన పూసలు, అద్దాలు, కుందన్‌లు, ముత్యాలతో చేసిన ఈ జాకెట్లు ట్రెండింగ్‌లో నిలిచాయి.

ఇవన్నీ ఖరీదైన ఆభరణాలతో మాత్రమే చేయవచ్చని అనుకుంటే పొరపాటే. ‘జంక్‌’ జ్యుయెలరీతో అల్లిన బ్లౌజ్‌లూ అందరికీ అందుబాటులోకి వచ్చేలా చేశారు ఫ్యాషన్‌ పండితులు. అక్కడితో ఆగకుండా ఈ ట్రెండ్‌ చెప్పులు, కళ్లద్దాలు, జీన్స్‌ తదితరాలకీ వచ్చేసింది. పండగల వేళ అసలైన తళుకుబెళుకులతో మెరిసిపోవడం ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. నగలను మర్చిపోయి, ఈ ‘బిజ్యుయెలరీ’ బ్లౌజులతో మురిపించడం నయా ట్రెండ్‌. సెలబ్రిటీల సొగసుకు అబ్బురపడిపోయి అమ్మాయిలు వారినే ఫాలో అవుతున్నారు.


book5.3.jpg

అబ్బో... ఎన్ని రకాలో?

ఎంత ఖరీదైన చీరకైనా రవికెతోనే పూర్తి అందం వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు పుట్టుకొస్తున్నాయి. ‘బిజ్యుయెలరీ’ బ్లౌజు కోసం ట్రెండింగ్‌లో ఉన్న కొన్ని డిజైన్లు ఇవి...

- నెక్లెస్‌ బ్లౌజ్‌: హైనెక్‌, లోనెక్‌, బోట్‌ నెక్‌ల డిజైన్‌తో పాటు చోకర్‌ నెక్‌, హెవీ పోల్కా నెక్‌ అన్నవి ‘బిజ్యుయెలరీ’ బ్లౌజుల్లో మామూలై పోయాయి. రాళ్లు, ముత్యాలు, కుందన్లతో ఈ మెడ డిజైన్లను రూపొందిస్తున్నారు.

-


టెంపుల్‌ ‘బిజ్యుయెలరీ’: రాధాకృష్ణులు, లక్ష్మీదేవి లాంటి ఆలయ అచ్చులను బ్లౌజ్‌ల డిజైన్లలో భాగంగా తయారు చేస్తున్నారు. ఇది ముఖ్యంగా పెళ్లికూతుర్లకు బాగా సెట్‌ అయ్యే డిజైన్‌.

- కుందన్‌: బంగారు, పచ్చ, గులాబీ రంగుల కుందన్లను చేతులకు, మెడకు, వీపు డిజైన్లలో వాడుతున్నారు. జర్దోజీతో అల్లే ఈ బ్లౌజ్‌లు ఏ ఫంక్షన్లలో అయినా ప్రత్యేకంగా నిలుస్తాయి. బంగారు కుందన్లతో నెక్లెస్‌ ధరించిన లుక్‌ కచ్చితంగా వస్తుంది.

- బ్యాక్‌ నెక్‌: ‘బిజ్యుయెలరీ’ బ్యాక్‌ నెక్‌ బ్లౌజ్‌ రాయల్‌ వెడ్డింగ్‌లకు సరిగ్గా నప్పుతుంది. ముత్యాలు, విలువైన రాళ్లు, బీడ్స్‌తో బ్లౌజ్‌ వెనక భాగాన్ని ఆకర్షణగా డిజైన్‌ చేయడం నేడు ఫ్యాషన్‌గా మారింది.


గుర్తుంచుకోండి...

- ‘బిజ్యుయెలరీ’ బ్లౌజులు అన్నీ ఫ్యాన్సీ డిజైన్లు. చాలా అరుదైన సందర్భాలలో వీటిని ధరిస్తే బాగుంటుంది.

- చీర, దాని టెక్చర్‌కు తగిన డిజైన్లను ఎంచుకోవడం మంచిది. అప్పుడే ఎలిగెంట్‌ లుక్‌ వస్తుంది.

- ఆభరణాలు పొదగడం వల్ల బ్లౌజ్‌ చాలా హెవీ లుక్‌తో ఉంటుంది. కాబట్టి చీర లేదా లెహంగా సింపుల్‌గా ఉంటే మంచిది.

- ఖరీదైన వస్తువులు వద్దనుకుంటే జంక్‌ జ్యుయెలరీ, పెండెంట్లు, ముత్యాలు, విరిగిన చెవి పోగుల భాగాలను బ్లౌజ్‌ డిజైనింగ్‌లో వాడవచ్చు.

- ఇలాంటి భారీ డిజైన్ల బ్లౌజ్‌లు ధరించినప్పుడు సన్నని గాజులు, చెవి పోగులు చాలు.


ఈ వార్తలు కూడా చదవండి..

పసిడి ధరలకు రెక్కలు.. నేటి ధరలు చూస్తే..

విమానంలో పగిలిన అద్దం.. 76 మందికి తప్పిన ముప్పు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 12 , 2025 | 09:40 AM