Health Alert: రీసైకిల్డ్ ప్లాస్టిక్‌తో ప్రమాదం...
ABN , Publish Date - Jul 08 , 2025 | 12:18 AM
ప్లాస్టిక్ వాడడం మంచిది కాదని అందరికీ తెలుసు. అయినా ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు.

రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌లో ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపించే విష రసాయనాలు ఉన్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ వివరాలివీ...
ప్లాస్టిక్ వాడడం మంచిది కాదని అందరికీ తెలుసు. అయినా ప్లాస్టిక్ వాడకం తగ్గడం లేదు. ఈ వస్తువుల వాడకం తీవ్రస్థాయికి చేరడంతో ప్లాస్టిక్ ఉత్పత్తిని తగ్గించడం కోసం రీసైక్లింగ్ విధానాన్ని వాడుకలోకి తీసుకొచ్చారు. అయితే ప్లాస్టిక్‌లోని 80 రకాల రసాయన సమ్మేళనాలు, విష పదార్థాలు రీసైకిల్ ప్రక్రియలో మరింత విషపూరితంగా మారి ఆ ఉత్పత్తులలోకి చేరతాయనే ఒక అధ్యయనం, జోర్నల్ ఆఫ్ హజార్డస్ మెటీరియల్స్‌లో తాజాగా ప్రచురితమైంది. రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులు ఆ విష రసాయనాలను నీటిలోకి విడుదల చేస్తున్నాయనీ, ఆ రసాయనాలు ఊబకాయాన్నీ, క్యాన్సర్ల ముప్పునూ పెంచుతాయనీ పరిశోధకులు పేర్కొంటున్నారు. అలాగే హార్మోన్ల స్రావాలను తీవ్రంగా ప్రభావితం చేయడంతో పాటు పిల్లల్లో ఎదుగుదలను నిరోధించడం, శరీరం శక్తిని ఖర్చు చేసే వేగాన్ని దెబ్బ తీయడం, పునరుత్పత్తి వ్యవస్థను నిర్వీర్యం చేయడం లాంటి ముప్పులను పెంచుతాయని పరిశోధకులు కొన్ని ప్రయోగాల ద్వారా కనిపెట్టడం జరిగింది. ఇందుకోసం వారు ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సేకరించిన రీసైకిల్డ్ ప్లాస్టిక్ పెల్లెట్స్‌ను 48 గంటల పాటు నీళ్లలో నానబెట్టారు. ఆ తర్వాత జెబ్రాఫిష్ లార్వేను ఐదు రోజుల పాటు ఆ నీళ్లకు బహిర్గతం చేశారు. ఈ ప్రయోగంలో, ఆ లార్వేలోని లిపిడ్ మెటబాలిజం, అంతఃస్రావ గ్రంథుల పనితీరుల్లో అవకతవకలు చోటు చేసుకోవడాన్ని వాళ్లు గమనించడం జరిగింది. కాబట్టి ప్లాస్టిక్, రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వాడకానికి వీలైనంత దూరంగా ఉండడం ఉత్తమం.