Jiya Autism Story: అమ్మ వేసిన గెలుపు బాట
ABN , Publish Date - May 17 , 2025 | 05:48 AM
ఆటిజం ఉన్న జియాను ఈతలో నిపుణురాలిగా తీర్చిదిద్దిన తల్లి సంకల్ప గాథ ఇది. తల్లి ప్రేమ, పట్టుదలతో జియా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 39 స్వర్ణపతకాలు గెలుచుకుంది.

సంకల్పం
జియా రాయ్... పదహారేళ్ల ఆటిజమ్ అమ్మాయి. గత ఏడాది... ఇంగ్లిష్ చానల్‌ను ఈదేసింది. ప్రపంచ రికార్డు నెలకొల్పింది. విజయం జియాదే..! కానీ... దాని వెనుకనున్న అసలు కష్టం... ఆమె తల్లి రచనా రాయ్‌ది. అందరిలా తన బిడ్డను సమున్నతంగా నిలబెట్టడం కోసం...వృత్తిని వదిలేసి... ఎన్నిటినో త్యాగం చేసి... స్విమ్మింగ్ నేర్చుకున్నారు 44 ఏళ్ల రచన.అమ్మగానే కాదు... ఒక స్నేహితురాలిగా... ఉపాధ్యాయురాలిగా... అన్నిటికీ మించి మంచి కోచ్‌గా కూతుర్ని ఉన్నతంగా తీర్చిదిద్దారు.
‘‘ఉన్నది ఒకటే జీవితం. దాన్ని ఎంత హుందాగా, ఎంత అర్థవంతంగా జీవించామన్నదే ముఖ్యం. ఇన్నేళ్ల నా ప్రయాణంలో నాకు అర్థమైంది ఇది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం మాది. ఓ పాఠశాలలో ఆర్గానిక్ కెమిస్ట్రీ బోధించేదాన్ని. మావారు మదన్ రాయ్ నేవీలో అధికారి. 2008లో మాకు పాప పుట్టింది. జియా అని పేరు పెట్టుకున్నాం. మా ఆకాంక్షలకు ప్రతిరూపం తను. కానీ రెండేళ్లు తిరిగే సరికి జియా ప్రవర్తనలో మార్పు కనిపించింది. తను బొమ్మలతో ఆడుకొనే తీరు మాకు వింతగా అనిపించేది. వైద్యులను సంప్రతిస్తే... జియాకు ఆటిజమ్ అని చెప్పారు. ఆటిజమ్ గురించి మాకు ఏమాత్రం అవగాహన లేదు. అప్పటికి వైద్యులు, సన్నిహితుల ద్వారా మాకు తెలిసింది ఏంటంటే... జియాకు నిరంతరం థెరపీలు చేయిస్తుండాలని, జీవితాంతం తను వేరొకరిపై ఆధారపడక తప్పదని.
కెరీర్ అనేది లేదన్నారు...
ఆటిజమ్ గురించి నేను, మావారు పరిశోధించాం. చాలా విషయాలు అవగాహనకు వచ్చాయి. మా అమ్మాయి పరిస్థితి కంటే నన్ను బాగా బాధించింది... ఇరుగుపొరుగు వారి వ్యాఖ్యలు. జియా ఎంతసేపూ మాపైనే ఆధారపడాలని, తనకు అసలు కెరీర్ అనేదే లేదని కొందరు అనేవారు. అవి నాలో పట్టుదల పెంచాయి. భగవంతుడు మనకు ఈ జీవితాన్ని ప్రసాదించాడు. అంటే ఆయన దృష్టిలో దానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుందనేది నా ప్రగాఢ విశ్వాసం.
ఉద్యోగం వదిలేసి...
నేను, మావారు కలిసి మా అమ్మాయికి మాటలు నేర్పించే ప్రయత్నం చేశాం. స్కూల్లో పని చేస్తూనే ఇంటి దగ్గర ట్యూషన్స్ చెప్పేదాన్ని. ఇంటి పనితో పాటు ఇవన్నీ చూసుకొంటూనే, జియాకు కావల్సినవి సమకూర్చేదాన్ని. క్షణం తీరిక లేకపోయినా ఏ రోజూ భారంగా భావించలేదు. అయితే జియాపై మరింత శ్రద్ధ పెట్టాలన్న ఉద్దేశంతో 2011లో ఉద్యోగం వదిలేశాను. ఇంటి దగ్గర ట్యూషన్లు కొనసాగించాను.
పిల్లలను దూరంగా తీసుకువెళ్లేవారు...
ఏడాది తరువాత మాకు అబ్బాయి పుట్టాడు. నాకు పని భారంతో పాటు బాధ్యతలు కూడా పెరిగాయి. దీంతో ట్యూషన్స్ కూడా మానేశాను. మరోవైపు జియా ప్రవర్తన చూసి చుట్టుపక్కల వారు ‘మీ అమ్మాయి పిచ్చిదానిలా ఉంది’ అంటూ తమ పిల్లలను జియాకు దూరంగా తీసుకువెళ్లేవారు. స్కూల్లో చేర్పిద్దామంటే... పాఠశాల యాజమాన్యాలు ‘ప్రత్యేక పాఠశాలకు తీసుకువెళ్లండ’ని అనేవారు. చివరకు ఒక స్కూల్లో అడ్మిషన్ ఇచ్చారు.
మలుపు తిప్పిన ఈత...
బడికి అయితే వెళుతోంది కానీ... అందరూ జియాను జాలిగా చూడడం మొదలుపెట్టారు. అదే సమయంలో పాఠశాలలో ఈత పోటీలు జరిగాయి. అప్పటికే ఈతలో ప్రవేశం ఉండటంవల్ల జియా ఆ పోటీల్లో పాల్గొంది. విశేషమేమంటే... అందులో స్వర్ణ పతకం గెలిచింది. తోటి విద్యార్థులు చప్పట్లతో అభినందించారు. నా కళ్లు చెమర్చాయి. జియా జీవితాన్ని, తన పట్ల ఇతరుల ఆలోచనా విధానాన్ని సమూలంగా మార్చేసిన ఘట్టం అది. నాకు అర్థమైందేంటంటే... స్విమ్మింగ్ ద్వారా తనకు ఈ సమాజంలో తగిన గౌరవం లభిస్తుందని.
సవాళ్లు లేని ప్రయాణం లేదు...
జీవితంలో సవాళ్లు లేని ప్రయాణం అంటూ ఉండదు. జియా విషయంలో అడుగడుగునా ఎన్నో అడ్డంకులు, సమస్యలు. ఈత నేర్పిద్దామని ముంబయిలోని స్విమ్మింగ్ స్కూల్స్ చుట్టూ తిరిగాను. ఎవరూ తనను చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కొంతమంది శిక్షకులు ముందుకు వచ్చినా... తనకు అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. ఇక లాభం లేదని నేనే ఈత నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. అప్పటివరకు నేను ఈత కొట్టిందిలేదు. కూతురు కోసం మొదటిసారి కొలనులోకి దిగాను.
అద్భుత విజయాలు ఎన్నో...
2019లో... తొలిసారి జియా జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. స్వర్ణ పతకం గెలిచింది. అది మొదలు ఎన్నో పతకాలు సాధించింది. గత ఏడాది ఇంగ్లిష్ చానల్‌ను అతిపిన్న వయసులో, అతితక్కువ సమయంలో ఈదిన ఆటిజమ్ బాలికగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2022లో ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్’, మరుసటి ఏడాది ‘నేషనల్ అవార్డ్ ఫర్ డిజేబిలిటీ’ అందుకుంది. మొత్తంగా కెరీర్లో ఇప్పటివరకు 39 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. తన విజయాలు చూసినప్పుడు నా గుండె ఆనందంతో ఉప్పొంగుతుంది. ఈ విజయాలు జియాకు మాత్రమే కాదు... ఒక తల్లిగా నాకూ ఎంతో గర్వకారణం. ఒకసారి గుడికి వెళ్లినప్పుడు... జియా చేతులు జోడించి నా ముందు నిలుచుంది. అది గమనించిన ఒకావిడ... ‘తన మనసులో మీరు, ఆ భగవంతుడు ఒక్కటే అని మీ అమ్మాయి భావిస్తోంది’ అన్నారు. ఆ మాటలకు నా నోట మాట రాలేదు. నా కూతుర్ని గట్టిగా హత్తుకుని ఏడ్చేశాను. ప్రతిభకు పదును పెడితే ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి వైకల్యం అడ్డు కాదని చెప్పడానికి జియా జీవితానికి మించిన రుజువు ఇంకేం కావాలి!’’