Share News

Delicious: దోసకాయతో పసందుగా

ABN , Publish Date - Jun 21 , 2025 | 01:22 AM

పులుపు, తీపి రుచులు కలగలిసినట్లుండే దోసకాయతో పప్పు, పచ్చడి, కూర ఇలా ఏది చేసినా ఇష్టపడనివారు ఉండరు. టమాటా, చిక్కుడు, వంకాయలతో కలిపి వండితే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది

Delicious: దోసకాయతో  పసందుగా

పులుపు, తీపి రుచులు కలగలిసినట్లుండే దోసకాయతో పప్పు, పచ్చడి, కూర ఇలా ఏది చేసినా ఇష్టపడనివారు ఉండరు. టమాటా, చిక్కుడు, వంకాయలతో కలిపి వండితే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది. అంతేకాదు మాంసాహార వంటకాల్లో కూడా చక్కగా ఇమిడిపోతుంది. ఏడాది పొడవునా లభ్యమయ్యే దోసకాయలతో చేసే విభిన్న రుచులు మీ కోసం...

దోసకాయ చికెన్‌

కావాల్సిన పదార్థాలు

దోసకాయ ముక్కలు- ఒక కప్పు, చికెన్‌- ఒక కప్పు, టమాటా ముక్కలు- అర కప్పు, పచ్చి మిర్చి- అయిదు, కారం- ఒక చెంచా, ఉప్పు- తగినంత, పసుపు- పావు చెంచా, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, గరం మసాలా- అర చెంచా, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, ధనియాల పొడి- ఒక చెంచా, నూనె- నాలుగు చెంచాలు.


తయారీ విధానం

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో పసుపు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి చీలికలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి అయిదు నిమిషాలు వేగనివ్వాలి. తరవాత చికెన్‌ ముక్కలు వేసి కలపాలి. రెండు నిమిషాల తరవాత ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలిపి మూతపెట్టి నాలుగు నిమిషాలు మగ్గనివ్వాలి. తరవాత దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కలిపి మూత పెట్టి అయిదు నిమిషాలు ఉడికించాలి. తరవాత మూత తీసి కొన్ని నీళ్లు చిలకరించి మరో అయిదు నిమిషాలు మగ్గించాలి. చివరలో కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఈ దోసకాయ చికెన్‌... అన్నం, చపాతీల్లోకి రుచిగా ఉంటుంది.


జాగ్రత్తలు

  • దోసకాయలను చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా మగ్గుతాయి.

  • దోసకాయ పులుపు లేకుండా తియ్యగా ఉంటే మరో పావు కప్పు టమాటా ముక్కలు కలుపుకోవాలి.

  • గ్రేవీ చిక్కగా ఉండాలనుకుంటే.... చివరగా కూరను మగ్గించేటప్పుడు పావు కప్పు నీళ్లలో ఒక చెంచా కార్న్‌ఫ్లోర్‌ కలిపి పోయాలి.


దోసకాయ చేపల పులుసు

కావాల్సిన పదార్థాలు

దోసకాయ ముక్కలు- ఒక కప్పు, చేప ముక్కలు- పావు కిలో, ఆవాలు- అర చెంచా, మెంతులు- పావు చెంచా, ఎండు మిర్చి- నాలుగు, ఉల్లిపాయ ముక్కలు- ఒక కప్పు, కరివేపాకు- రెండు రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్టు- ఒక చెంచా, పసుపు- ఒక చెంచా, కారం- ఒక చెంచా, గరం మసాలా పొడి- ఒక చెంచా, టమాటా గుజ్జు- అర కప్పు, ఉప్పు- తగినంత, చింతపండు రసం- ఒక కప్పు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, నూనె- నాలుగు చెంచాలు.


తయారీ విధానం

ఒక గిన్నెలో చేప ముక్కలు, అర చెంచా పసుపు, కొద్దిగా ఉప్పు, పావు చెంచా కారం వేసి బాగా కలిపి నాననివ్వాలి.

స్టవ్‌ మీద మందపాటి గిన్నె పెట్టి నూనె వేసి వేడి చేయాలి. ఇందులో పసుపు, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, మెంతులు వేసి వేగనివ్వాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలిపి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. తరవాత దోసకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి అయిదు నిమిషాలు ఉడికించాలి. తరవాత మూత తీసి కారం, గరం మసాలా పొడి వేసి కలపాలి. టమాటా గుజ్జు, చింతపండు రసం, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి. తరవాత కొన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. నీళ్లు బాగా మరిగి బుడగలు వస్తున్నప్పుడు అందులో చేప ముక్కలు వేసి మూతపెట్టి పది నిమిషాలు ఉడికించాలి. తరవాత కొత్తిమీర తరుగు చల్లి స్టవ్‌ మీద నుంచి దించాలి. ఇలా తయారు చేసుకున్న దోసకాయ చేపల పులుసును వేడి అన్నంలో కలుపుకుని తింటే రుచిగా ఉంటుంది.


జాగ్రత్తలు

  • దోసకాయలను మరీ చిన్న ముక్కలుగా కోయకూడదు. పులుసు మరుగుతున్నప్పుడు మెత్తగా ఉడికిపోతాయి.

  • రోహు, కట్లా, శీలావతి, కొర్రమీను చేపలను తీసుకోవచ్చు. ముల్లు ఉన్న చేపలతో చేస్తే పులుసు రుచిగా ఉంటుంది.

  • చేప ముక్కలను మరీ మెత్తగా ఉడికించకూడదు.


దోసకాయ రొట్టె

కావాల్సిన పదార్థాలు

దోసకాయ- ఒకటి, బియ్యప్పిండి- రెండు కప్పులు, ఉప్పు- ఒక చెంచా, కారం- ఒక చెంచా, పసుపు- పావు చెంచా, జీలకర్ర- అర చెంచా, వాము- అర చెంచా, నువ్వులు- ఒక చెంచా, అల్లం పచ్చిమిర్చి ముద్ద- ఒకటిన్నర చెంచా, కరివేపాకు- రెండు రెమ్మలు, ఉల్లిపాయ ముక్కలు- అర కప్పు, కొత్తిమీర తరుగు- రెండు చెంచాలు, పచ్చిశనగపప్పు- పావు కప్పు, నూనె- తగినంత.


తయారీ విధానం

  • దోసకాయకు తొక్కతీసి మధ్యకు కోసి గింజలు తీసివేయాలి. తరవాత సన్నగా తురుముకోవాలి. ఒక చిన్న గిన్నెలో పచ్చి శనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టాలి.

  • ఒక వెడల్పాటి గిన్నెలో దోసకాయ తురుం, నానబెట్టిన పచ్చి శనగపప్పు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, వాము, నువ్వులు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఒక చెంచా నూనె, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తరవాత బియ్యప్పిండి వేసి ముద్దలా కలపాలి.

  • స్టవ్‌ మీద పెనం పెట్టి కొద్దిగా నూనె రాసి వేడి చేయాలి. ఒక ప్లాస్టిక్‌ కవర్‌ మీద కొద్దిగా నూనె రాసి చిన్న పిండి ముద్దను పెట్టి వేళ్లతో తడుతూ చపాతీలా చేయాలి. దీన్ని వేడెక్కిన పెనం మీద జాగ్రత్తగా వేసి ఎర్రగా కాలనివ్వాలి. రొట్టె మీద ఒక చెంచా నూనె చిలకరించి రెండోవైపునకు తిప్పాలి. రెండు నిమిషాల తరవాత పళ్లెంలోకి తీయాలి. ఇలా తయారు చేసిన దోసకాయ రొట్టెను వెన్న, పాల మీగడ, పెరుగు, ఆవకాయ కారంతో తినవచ్చు.


జాగ్రత్తలు

  • బియ్యప్పిండికి బదులు గోధుమపిండి, జొన్నపిండి, సజ్జపిండి కూడా కలుపుకోవచ్చు. పచ్చి శనగపప్పుకు బదులు పెసరపప్పు వేసుకోవచ్చు.

  • కావాలనుకుంటే దోసకాయ గింజలు వేసుకోవచ్చు.

  • మంట మధ్య స్థాయిలో ఉండాలి. రొట్టె ఒకవైపు కాలిన తరవాతనే రెండో వైపునకు తిప్పాలి. లేకుంటే రొట్టె విరిగిపోతుంది.

Updated Date - Jun 21 , 2025 | 06:19 AM