పెళ్లై సంవత్సరం కూడా కాలేదు.. అంతలోనే విషాదం..
ABN , Publish Date - Apr 26 , 2025 | 03:16 PM
Karnataka Kolar: పెద్దల్ని ఒప్పించి గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం అత్తింటి వారు రష్మితో బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ విషయానికి ఆమెను టార్చర్ చేసేవారు. అదనపు కట్నం తెమ్మంటూ తిట్టే వారు.. కొట్టేవారు.

శాస్త్ర సాంకేతికత పరంగా మనుషులు ఎంత అభివృద్ధి చెందుతున్నా.. ఆడవాళ్ల విషయంలో మాత్రం ఇంకా దారుణంగానే వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా అత్తింట్లో అడుగుపెట్టిన అమ్మాయిలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏదో ఒక విధంగా అత్తింటి వారు కోడళ్లను వేపుకుతింటున్నారు. అన్ని కుటుంబాల విషయంలో కాకపోయినా.. నూటికి 70 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది. తాజాగా, అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు అత్తింటి వేధింపులు వివరిస్తూ ఓ సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌లో భర్త మంచి వాడని కూడా పేర్కొంది. పెళ్లై సంవత్సరం కాకుండానే ఆ యువతి జీవితం ముగిసిపోయింది.
కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కర్ణాటక, కోలార్ జిల్లాలోని కడిదెనహళ్లి గ్రామానికి చెందిన దినేష్ అనే వ్యక్తి ఓ ఫినాన్స్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. అదే కంపెనీలో పని చేసే రష్మితో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెద్దల్ని ఒప్పించి గత సంవత్సరం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొంత కాలం అత్తింటి వారు రష్మితో బాగానే ఉన్నారు. తర్వాతి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ప్రతీ విషయానికి ఆమెను టార్చర్ చేసేవారు. అదనపు కట్నం తెమ్మంటూ తిట్టే వారు.. కొట్టేవారు.
అత్తింటి వారి వేధింపులు భరించలేకపోయిన రష్మి ప్రాణాలు తీసుకోవాలని భావించింది. చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసింది. ఆ నోట్‌లో.. ‘ మీ అమ్మ.. బామ్మ.. నన్ను ఇబ్బందిపెట్టడం ఆపటం లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పటినుంచి నాకు ప్రశాంతత లేదు. నేను వారి టార్చర్ భరించలేకపోతున్నా. నువ్వు వచ్చేసరికి నేను ప్రాణాలతో ఉండను. నువ్వు మంచి వాడివే.. కానీ, మీ ఇంట్లో వాళ్లు మంచి వాళ్లు కాదు. కట్నం తేనందుకు నన్ను కొడుతున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు. మూడు నెలల క్రితం రష్మికి గర్భ స్రావం అయింది. కట్నం తేనందుకు.. బిడ్డను కననందుకు అత్తింటి వారు వేధించినట్లు విచారణలో తేలింది.
ఇవి కూడా చదవండి
Seema Haider: పాకిస్తాన్ తిరిగి వెళ్లటంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సీమా హైదర్
AP NEWS: లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్